Andhra News: హెల్మెట్ వాడకంపై తిరుపతి పోలీస్ కొత్త ప్లాన్… ఏమిటో తెలుసా..!
తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం హెల్మెట్ వాడకంపై జనంలో అవగాహన పెంచే ప్రయత్నంలో కొత్త ప్లాన్ అవలంబిస్తోంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని చెబుతోంది. నో హెల్మెట్ నో పెట్రోల్ కాన్సెప్ట్ ఫాలో చేయాలని భావించింది. ఇందులో భాగంగా నో హెల్మెట్ నో రైడ్ అంటోంది.

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని మరింతగా పెంచడం ప్రధాన లక్ష్యంగా, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టమైన ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు.ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపధ్యంలో ప్రాణనష్టం నివారణకు హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమన్న సందేశాన్ని వాహనదారులకు ఇస్తోంది. ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్లకు ఈ మేరకు ఎస్పీ మార్గదర్శకాలు జారీ చేశారు. తిరుపతి జిల్లా మొత్తం మీద ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, బీట్ సిబ్బంది ప్రజలకు నేరుగా చేరుకుని హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించే చర్యలు చేపడుతున్నారు- ప్రజలు హెల్మెట్‌ను కేవలం జరిమానా తప్పించుకోవడానికి కాకుండా తమ ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిన జీవిత రక్షక సాధనంగా భావించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండడంతో, వారికి ప్రత్యేకంగా చైతన్యం కల్పించే కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు.ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ ధరించడం, అధిక వేగాన్ని నివారించడం, రోడ్డు నియమాలు పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి జాగ్రత్తలు ప్రతి వాహనదారుడి బాధ్యతని పోలీసులు సూచిస్తున్నారు.తిరుపతి జిల్లాలో అమలులో ఉన్న నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన ప్రకారం హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వరాదని, అలాగే నో హెల్మెట్ నో రైడ్ కార్యక్రమం ద్వారా చిన్న దూరానికైనా హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రారంభించరాదనివాహనము నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించి విలువైన ప్రాణాలను రక్షించడంలో ప్రతి పౌరుడూ హెల్మెట్‌ను అలవాటుగా మార్చుకుని ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు.తిరుపతి జిల్లా పోలీసులు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి, అలాగే వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు. రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించాలని చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




