Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Municipal Polls: జోష్ మీద వైసీపీ.. సత్తా చాటుతామంటున్న టీడీపీ.. బెజవాడ బల్దియా బరిలో సై అంటే సై..!!

రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన బెజవాడలో బల్దియా పోరు రసవత్తరం కానున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. మేయర్ కుర్సీ నీదా..? నాదా..? అంటూ సై అంటే సై అని రంకెలేస్తున్నాయి ప్రధాన పార్టీలు.

AP Municipal Polls: జోష్ మీద వైసీపీ.. సత్తా చాటుతామంటున్న టీడీపీ.. బెజవాడ బల్దియా బరిలో సై అంటే సై..!!
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 23, 2021 | 6:30 PM

Interesting fight in Vijayawada Municipal Corporation: రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన బెజవాడలో బల్దియా పోరు రసవత్తరం కానున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. మేయర్ కుర్సీ నీదా..? నాదా..? అంటూ సై అంటే సై అంటు సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు రంకెలేస్తున్నాయి. కౌన్ బనేగా బెజవాడ మేయర్? ఈ ప్రశ్న రాజకీయ రాజధాని నలుమూలలా వినిపిస్తోంది. దానికి సంబంధించిన చర్చలు ఏ ఇద్దరు కలిసినా మొదలవుతున్నాయి. పంచాయితీ పోరులో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటిన అధికార వైసీపీని విపక్షాలు నిలువరించగలవా? ఈ పోరులు విపక్షంలో వున్న అంతర్గత పోరు తిరగబెడితే వైసీపీ విజయం నల్లేరు మీద నడకే అవుతుందా? ఇంతకీ మేయర్ పీఠమెక్కే నాయకురాలు నాగమ్మ ఎవరు? ఇవే ఇప్పుడు బెజవాడ ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలు.

పొలిటికల్ సర్కిల్స్‌లో బెజవాడ రాజకీయం ఎప్పుడూ హాట్ టాపిక్కే. అందులో మేయర్ పీఠంపై కన్నేసిన వైసీపీ, టీడీపీ నేతలు లోకల్ హీట్‌ను అమాంతం పెంచేసారు. పథకాలు అస్త్రాలుగా మారి విపక్ష తెలుగుదేశం పార్టీ అడ్రస్సును గల్లంతు చేస్తాయని అధికార పార్టీ నేతలు చెబుతుంటే.. వైసీపీ పతనం మొదలైంది ఇక ఆ పార్టీ రంగులు వెలిసిపోవడం ఖాయమని పసుపు కండువాలు సవాల్ చేస్తున్నాయి. మొత్తానికి బెజవాడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

గత ఎన్నికల్లో బెజవాడ బల్దియా పరిధిలో 59 వార్డులు ఉండగా.. తాజాగా జరిగిన పునర్విభజనతో వార్డుల సంఖ్య 64కి పెరిగింది. ఈ లెక్కన బెజవాడ బల్దియా పీఠం దక్కాలంటే 35 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార వైసీపీ.. మునిసిపల్ ఎన్నికల్లోను అదే వేవ్ కొనసాగించాలని వ్యూహ రచన చేస్తోంది. ఇక టీడీపీ, జనసేన-బీజేపీ, సీపీఐ, సీపీఎం విజయవాడ మునిసిపల్ బరిలో బలపరీక్షకు రెడీ అవుతున్నాయి. గతంలో టీడీపీ మేయర్‌గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లడిగే పనిలో టీడీపి ఉండగా.. జనసేన-బీజేపీ కూటమి అధికార, ప్రతిపక్షాల వైఫల్యాలను చూపి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది.

విజయవాడ నగరంలో 64 డివిజన్లలో 9 లక్షల 15 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నగరంలోని ఆయా డివిజన్ల పరిధిలో అధికార వైసీపీ సింగిల్‌గా 64 స్థానాలకు పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం సీపీఐతో జతకట్టి 59 వార్డుల్లో బరిలోకి దిగుతోంది. 5 సీట్లను సీపీఐకి కేటాయించింది టీడీపీ. ఇక జనసేన-బీజేపీ కూటమిలో జనసేన 37 సీట్లకు, బీజేపీ 27 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. సీపీఎం మాత్రం తమకు బలం ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు ఆల్‌మోస్ట్ రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీకే అనుకూలంగా వుంటాయని పలువురు భావిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం మేయర్ పీఠం అంత ఈజీ కాదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణగా వినిపిస్తోంది. 64 డివిజన్ల పరిధిలో సామాజిక, ఆర్ధిక అంశాలు బేరీజు వేసుకుని వైసీపీ, టీడీపీ మధ్యలో జనసేన-బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక్కడ మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద ఎత్తున ఆశావహులు మేయర్ పీఠం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. నగరంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఉన్న వారి కుటుంబ సభ్యులకు సీట్లు ఇవ్వకూడదని జగన్ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది వెనక్కి తగ్గారు.

అయితే పార్టీ నేత గౌతం రెడ్డి తన కుమార్తె నిఖితా రెడ్డిని మేయర్ పీఠం పైకి కూర్చోపెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు లాస్ట్ టైం కార్పోరేటర్‌గా పోటీ చేసి గెలిచిన పుణ్యశీల మేయర్ పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడే మేయర్‌ అభ్యర్ధి పేరును ప్రకటిస్తే పార్టీలో వివాదాలు మొదలవుతాయని దాదాపు అన్ని పార్టీల అధినాయకత్వాలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి.

మరోవైపు ప్రతిపక్ష టీడీపీలో మేయర్ సీటు కోసం ఆశపడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బెజవాడ ఎంపీ కేశినేని నాని తన రెండో కుమార్తె శ్వేతను బరిలోకి దింపారు. అటు శ్వేతే మేయర్ అభ్యర్థంటూ టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటే.. మరోవైపు బొండా ఉమా కూడా తన సతీమణిని బరిలో దింపుతారన్న ప్రచారం ఇంకోవైపు నడుస్తుంది. అందుకనే విజయవాడ పశ్చిమలో ఉన్న 22 స్థానాలపై ఫోకస్ పెట్టారని చెప్పుకుంటున్నారు. ఇక జనసేన-బీజేపీ కూటమి ముందుగా వీలైనన్న వార్డులను గెలుచుకుని ఆ తర్వాత మేయర్ ఎన్నికలో కీలకం కావాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల బరిలో వుందా లేదా అన్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ పోటీ చేస్తున్నారో కూడా తెలియనంతగా కాంగ్రెస్ పార్టీ ఉనికి పరిమితమవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కునారిల్లి పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆరేళ్ళ తర్వాత కూడా జవసత్వాలు రాకపోవడంతో ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లోను ఆ పార్టీ నామమాత్రపు పోటీకే పరిమితమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు బెజవాడలో బలమైన క్యాడర్‌ను కలిగి వున్న వామపక్షాలు ప్రస్తుతం తమ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే పరిమితమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో సీపీఐ తెలుగుదేశం పార్టీతో జత కట్టి అయిదు సీట్లలోనైనా గెలిచేందుకు తాపత్రయ పడుతుంటే.. సీపీఎం తమ బలం మేరకు వార్డుల్లో గెలిచేందుకు ఎత్తుగడలు వేస్తోంది. మొత్తానికి బెజవాడ మేయర్ రేస్‌లో బలమైన అభ్యర్ధులు ఉండటంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది.

ALSO READ: బరిలో ఉద్దండులతో ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇక జోరుగా ప్రచార పర్వం

ALSO READ: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!

ALSO READ: పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి.. పోటీ..! పన్ను పోటులో కేంద్రానికేం తీసిపోని రాష్ట్రాలివే