Telugu Desam Party: ‘ఆ’ అంశాలపై జర జాగ్రత్త..! పార్టీ వర్గాలకు చంద్రబాబు హెచ్చరిక.. టీడీపీ శిబిరం అప్రమత్తం

చంద్రబాబు తన పార్టీ వర్గాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కీలకాంశాలేంటో వివరించిన చంద్రబాబు తీవ్ర స్వరంతో కర్తవ్య బోధన చేశారు.

Telugu Desam Party: ‘ఆ’ అంశాలపై జర జాగ్రత్త..! పార్టీ వర్గాలకు చంద్రబాబు హెచ్చరిక.. టీడీపీ శిబిరం అప్రమత్తం
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 23, 2021 | 7:06 PM

Chandrababu warns TDP cadre over important things: చంద్రబాబు తన పార్టీ వర్గాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కీలకాంశాలేంటో వివరించిన చంద్రబాబు తీవ్ర స్వరంతో కర్తవ్య బోధన చేశారు. మునిసిపల్ ఎన్నికలను ప్రతీ టీడీపీ వర్కర్ సవాలుగా తీసుకోవాలని హెచ్చరించారు. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశం నిర్వహించారు. కొనసాగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రాసెస్‌పైనా, ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనా ఆయన పార్టీ నేతలు సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు పార్టీ వర్గాలకు అత్యంత కీలక సూచనలు, హెచ్చరికలు చేశారు.

‘‘ గ్రామాలకు, మునిసిపాలిటీలకు చాలా తేడా ఉంటుంది.. మునిసిపల్ ఎన్నికలను ప్రతి ఒక్క నాయకుడు సవాలుగా తీసుకోవాలి.. పంచాయతీ ఎన్నికల మాదిరిగా అర్ధరాత్రి ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం మునిసిపల్ ఎన్నికల్లో కుదరదు.. అయితే, బలవంతపు ఏకగ్రీవాలు, మైండ్ గేమ్స్, ప్రలోభాలు, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. ’’ అని చంద్రబాబు పార్టీ నేతలకు ఉద్బోధించారు.

గత ఏప్రిల్ 1వ తేదీ నుండి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలపై తీవ్రమైన స్థాయిలో పన్నులు పెంచిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. అభ్యర్ధికి కూడా తెలియకుండా నామినేషన్లు వెనక్కి తీసుకోవడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే సదరు అభ్యర్ధి తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో చూపిన ధైర్యం, చొరవ మునిసిపల్ ఎన్నికల్లో కూడా చూపాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.

‘‘ విశాఖలో విజయసాయిరెడ్డి చేస్తున్న అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.. విశాఖలో మకాం వేసి దోచుకుంటున్నాడు.. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని అరాచకానికి, అకృత్యాలకు, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్‌గా చేశాడు.. కొంత మంది అధికారులు అధికార పార్టీకి అండగా నిలిచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. అలాంటి వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేసిన వారిని కూడా వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేసి, భయపెట్టి వైసీపీ వైపు పని చేసేలా చేస్తున్నారు.. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.. ’’ అని చంద్రబాబు మంగళవారం నాటి సమావేశంలో పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇటీవల ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపైన వివాదం ఏర్పడిన నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం నిలువరించాలని చంద్రబాబు సహా టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి కోరడం విశేషం. పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను కొన్ని చోట్ల రెండు పార్టీలు (వైసీపీ, టీడీపీ) తమ వారిగా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు తమ విజయాలే ఎక్కువ అని చాటుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా చూస్తే సుమారు 80 శాతం పంచాయితీ సీట్లను అధికార వైసీపీ కైవసం చేసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో మునిసిపల్ ఎన్నికలైనా ఏకపక్షంగా జరగకుండా వుండేందుకు విపక్ష టీడీపీ యత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మంగళవారం చంద్రబాబు పార్టీ నేతలకు కీలక సూచనలు చేసి.. తగిన ఆదేశాలు జారీ చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

దానికి తోడు అధినేత చంద్రబాబు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ పేలవమైన ప్రదర్శన చేయడం తెలుగు తమ్ముళ్ళలో ఆవేదనను పెంచింది. పరాజయ పరాభవంతో పలువురు టీడీపీ శ్రేణులు పార్టీకి దూరమయ్యేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో అధికార వైసీపీ.. పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించింది. ముఖ్యంగా వైజాగ్ మునిసిపల్ కార్పొరేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి.. పెద్ద ఎత్తున ఆకర్ష్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొనడంతో చంద్రబాబు వారిలో ఉత్సాహం నింపేందుకు సిద్దమయ్యారని చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన పార్టీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అయినట్లు సమాచారం.

ALSO READ: జోష్ మీద వైసీపీ.. సత్తా చాటుతామంటున్న టీడీపీ.. బెజవాడ బల్దియా బరిలో సై అంటే సై..!!

ALSO READ: బరిలో ఉద్దండులతో ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇక జోరుగా ప్రచార పర్వం

ALSO READ: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!

ALSO READ: పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి.. పోటీ..! పన్ను పోటులో కేంద్రానికేం తీసిపోని రాష్ట్రాలివే