Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana MLC Elections: బరిలో ఉద్దండులతో ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇక జోరుగా ప్రచార పర్వం

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగినప్పటికీ తెలంగాణలో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో…

Telangana MLC Elections: బరిలో ఉద్దండులతో ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇక జోరుగా ప్రచార పర్వం
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 23, 2021 | 5:33 PM

Telangana MLC elections raising curiosity:  రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగినప్పటికీ తెలంగాణలో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల హంగామా పెద్దగా కనిపించడం లేదు. కానీ తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేయడంలో దూకుడుగా వుంటే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో కాస్త రాజకీయ చైతన్యం పాలు ఎక్కువగా కనిపిస్తోంది తెలంగాణలో. దానికి తోడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఉద్ధండులను ఎన్నికల బరిలోకి దింపడంతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రక్తి కట్టిస్తున్నాయి. నామినేషన్ల పర్వానికి మంగళవారం (ఫిబ్రవరి 23వ తేదీన) తెరపడడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఇదివరకులా వీధి ప్రచారానికి కాకుండా డిజిటల్ ప్రచారానికి అభ్యర్థులు ప్రాధాన్యత నిస్తున్నారు.

నామినేషన్ల పర్వం ముగియడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కీలక నేతలు బరిలోకి దిగడంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ మొదలైంది. దివంగత ప్రధాని పివి నరసింహరావు కుమార్తె సురభి వాణి దేవి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున బరిలోకి దిగగా… కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి అవకాశమిచ్చింది. గత ఆరేళ్ళుగా ఎమ్మెల్సీగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత ఎన్. రామచంద్రరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఓసారి ఎమ్మెల్సీగా వ్యవహరించిన ప్రొ. నాగేశ్వర్ మరోసారి వామపక్షాల మద్దతుతో రంగంలోకి దిగారు. వాళ్లే కాదు.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా హర్షవర్దన్ రెడ్డి, టీఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం మార్చి14తో తేలనుంది. ఆ రోజు పోలింగ్ జరగనుండగా…మార్చి17న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ముగిసిపోవడంతో ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజక వర్గం బరిలో అభ్యర్థుల వివరాలు:

1. సురభి వాణి దేవి – టిఆర్ఎస్. 2. జి. చిన్నారెడ్డి – కాంగ్రెస్ 3. ఎన్. రామచంద్రరావు – బీజేపీ 4. ఎల్. రమణ – టీడీపీ 5. ప్రొ. నాగేశ్వర్ – వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి. 6. హర్షవర్ధన్ రెడ్డి – కాంగ్రెస్ రెబల్. 7. కపిలవాయి దిలీప్ కుమార్ – టిఆర్ఎల్డి

మరోవైపు ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానానికి కీలక అభ్యర్థులు పోటీకి దిగారు. అధికార పార్టీ నుంచి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేర్ రెడ్డి పోటీకి దిగగా… కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీకి దిగారు. తెలంగాణ జనసమితి నుంచి కోదండరామ్ రెడ్డి పోటీకి దిగారు. గతంలో ఓసారి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైన మాజీ న్యూస్ ప్రజెంటర్, యువ తెలంగాణ పార్టీ నేత రాణి రుద్రమదేవితోపాటు మరో ఇద్దరు మీడియా నేపథ్యం వున్న వారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. మీడియా నేపథ్యం వున్న తీన్మార్ మల్లన్న, జయసారధి రెడ్డి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గం బరిలో పోటీ పడుతున్నారు. వీరిలో జయసారధికి వామపక్షాలు మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఇంటి పార్టీ నేత చెరుకు సుధాకర్ పోటీ చేస్తున్నారు.

ఖమ్మం- నల్లగొండ-వరంగల్ నియోజకవర్గంలో అభ్యర్థులు:

1. పల్లా రాజేశ్వర్ రెడ్డి – టిఆర్ఎస్ 2. సభావత్ రాములు నాయక్ – కాంగ్రెస్ 3. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి – బీజేపీ 4. కోదండరామ్ – జనసమితి. 5. చెరుకు సుధాకర్ – తెలంగాణ ఇంటి పార్టీ 6. జయసారధి రెడ్డి – సీపీఐ, సిపిఎం 7. రాణి రుద్రమదేవి – యువ తెలంగాణ పార్టీ 8. తీన్మార్ మల్లన్న – ఇండిపెండెంట్ 9. షబ్బీర్ అలీ – ఇండిపెండెంట్

తెలంగాణ ఏర్పాటై ఏడేళ్ళు దగ్గరికి వస్తున్నా యువత కోరుకున్నట్లుగా ఉద్యోగ నియామకాలు జరగలేదన్న ప్రధానాంశంతో విపక్షాలు గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు మొదలు పెట్టాయి. ఉపాధికి అవకాశాలు కలిగించే చర్యలను కూడా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టలేదన్నది విపక్షాల అభ్యర్థుల ప్రధాన ప్రచారాస్త్రంగా కనిపిస్తోంది. అయితే, ఆరున్నరేళ్ళ కాలంలో తెలంగాణను దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలబెట్టామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి స్వర్గీయ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఉద్ధండులు రంగంలోకి దిగడంతో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం తెలంగాణలో రక్తి కట్టిస్తోంది.

ALSO READ: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!

ALSO READ: పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి.. పోటీ..! పన్ను పోటులో కేంద్రానికేం తీసిపోని రాష్ట్రాలివే