Andhra Pradesh: ఒక కేసు విచారిస్తే మరో కేసు తేలింది.. బయటపడ్డ అత్తా-అల్లుడి క్రైమ్ కత..
కంటే కూతుర్నే కనాలి..అంటారు. మరోవైపు వారసుడు కావాలనే ఉబలాటం. మగ పిల్లలు లేరని ఒకరు.. సంతానమే లేదని మరొకరు.. అంగట్లో సరుకుల్లా..
కంటే కూతుర్నే కనాలి..అంటారు. మరోవైపు వారసుడు కావాలనే ఉబలాటం. మగ పిల్లలు లేరని ఒకరు.. సంతానమే లేదని మరొకరు.. అంగట్లో సరుకుల్లా అబ్బాయిలను కొనాలనుకున్నారు. కొన్నారు కూడా. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఓ కిలాడీ మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన వైనం సీసీ టీవీ ఫుటేజీలో తళుక్కుమంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎట్టకేలకు బుజ్జిగాడ్ని కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. అంతేకాదు జీజీహెచ్ కేసులో కూపీలాగితే.. మరో చిన్నారి కిడ్నాప్ కేసు కూడా సుఖాంతమైంది. ఇద్దరు చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కళ్లలో ఒత్తులేసుకుని బిడ్డ జాడ కోసం తల్లడిల్లిన అమ్మ కళ్లు చెమర్చాయి.. ఖాకీలకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
ఇష్టమైన వస్తువు కన్పించకపోతేనే కంగారుపడుతారు. అలాంటి కన్నబిడ్డ కన్పించకపోతే అమ్మమనసు ఎంత తల్లడిల్లాలి. అమ్మప్రేమను.. పోలీసింగ్‌పై నమ్మకాన్ని గెలిపించిన గుంటూరు జిల్లా ఎస్పీ అరీఫ్ హాఫీజ్‌కు.. రెండు కిడ్నాప్ కేసులను చాకచక్యంగా చేధించిన మెరికల్లాంటి పోలీసులను అభినందించడం సహా వాళ్ల టీమ్ వర్క్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
బుజ్జిగాళ్లను రక్షించడమే కాదు.. కిడ్నాప్ సూత్రధారులు పాత్రదారులను కటకటాల బాటపట్టించారు పోలీసులు. కూపీలాగితే కిడ్నాప్ వెనుక చిన్నారుల విక్రయం సహా అత్తా-అల్లుడి క్రైమ్ హిస్టరీ తెరపైకి వచ్చింది దర్యాప్తులో.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కనకాపురం కు చెందిన బత్తుల కల్యాణ రావుకు ఇద్దరూ ఆడపిల్లలే. మగబిడ్డ కావాలని నాగమ్మ చెవిలో వేశాడు. ఆమె తన అల్లుడు నాగరాజుకు మ్యాటర్ చెప్పింది. అరండల్ పేటలో వుంటోన్న పోలమ్మ కుమారుడిపై అతని కన్నుపడింది. అదనుచూసి చిన్నారి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేశారు. రూ. 20 వేలకు అమ్మేశారు. మరో బేరం తగిలింది. ఈసారి జీజీహెచ్‌లో నాగమ్మ సీన్‌లోకి ఎంటరైంది. చిన్నారి వర్షిత్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో తళుక్కుమన్నాయి. వర్షిత్ కేసులో పక్కా ఆధారాలతో నాగమ్మ, నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీస్తే ప్రకాశ్ కిడ్నాప్ కేసులోనూ మిస్టరీ వీడింది. చిన్నారులను కొన్న కల్యాణ్‌రావు, వెంకటరావులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అలా రెండు కిడ్నాప్ కేసులను చేధించి.. ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రుల ఒడికి చేర్చారు పోలీసులు. అయితే, ఇలాంటి కంత్రీలు ఇంకెందరో. ఇలాంటి ఘటనలు చూశాకైనా.. పేరెంట్స్ తమ పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..