Gold Theft: ఇస్మార్ట్ మోసం.. కళ్లు మూసి తెరిచేలోపే లక్షల ఆభరణం మాయం..!
యాచకుల రూపంలో ఏంట్రీ ఇస్తారు. అమాయకంగా నటిస్తారు. మెల్లగా టేబుల్‌పై పెట్టిన విలువైన వస్తువులను తస్కరిస్తారు. ఇలాంటి ఘటననే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. మాయమాటలతో బంగారు షాపులోకి వచ్చిన దొంగ.. చెవిటి, మూగవాడిలా నటించి టేబుల్‌పై ఉన్న బంగారు అభరనాలను దొంగిలించారు.
రైల్వే, బస్టాండ్‌ల్లో బధిరులు యాచించడం చూస్తుంటాం. ఒక కరపత్రం పట్టుకుని ప్రయాణీకులకు ఇచ్చి ఆ తర్వాత వారిచ్చినంతా తీసుకుని వెళుతుంటారు. ఈ తరహా యాచన అందరికి తెలిసే ఉంటుంది. ఇటువంటి యాచన చేసే వారు షాపుల వద్ద కూడా తారసపడుతుంటారు. ఇప్పుడు దీన్నే ఆసరగా చేసుకొని ఒక మోసగాడు, ఏకంగా పదిహేను లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాన్ని కొట్టేశాడు. ఇదంతా దుకాణంలో అమర్చిన సిసి కెమెరాలో రికార్డు అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
గుంటూరులోని పెద పులివారి సందు.. రియాన్ నగల దుకాణం.. పెద్దగా రద్దీ లేదు. మధ్యాహ్నం సమయం కావడంతో ఒకరో.. ఇద్దరో కస్టమర్లు వచ్చారు. వారికి రియాజ్ బంగారు ఆభరణాలున్న బాక్సులు బల్లపై పెట్టి చూపించాడు. అయితే వారికి ఆ అభరణాలు నచ్చలేదు. వేరే ఆభరణాలు చూస్తున్నారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి, తాను మూగ, చెవిటి వ్యక్తినంటూ షాపులోకి వచ్చాడు. తన చేతిలో ఉన్న పాంప్లెట్ ను కౌంటర్ లో కూర్చొన్న రియాజ్ కు ఇచ్చాడు. ఆ పాంప్లెట్ అందుకున్న రియాజ్ ఏమి ఇవ్వలేమని చెప్పి పంపించాడు.. అప్పుడే జరిగింది అసలైన సీన్. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో చూడండి..
రియాజ్‌కు కరపత్రం ఇచ్చిన సమయంలో మోసగాడు.. తన మరో చేతిలో ఉన్న పుస్తకాన్ని బల్లపై పెడుతున్నట్లు నటించి, అప్పటికే అక్కడున్న బంగారు ఆభరణ బాక్స్ ను చేతిలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత యాచకుడు అక్కడ నుండి మెల్లగా జారుకున్నాడు. అయితే కొద్ది సేపటి తర్వాత బల్లపై ఉంచిన బంగారు ఆభరణ బాక్స్ కనిపించకపోయే సరికి రియాజ్ కంగారు పడ్డాడు. లోపల ఏమైనా పెట్టానేమో అనుకుని మొత్తం గాలించాడు. ఎక్కడ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన రియాజ్ సిసి కెమెరా విజువల్స్ పరిశీలించాడు. అందులో యాచకుడు బాక్స్ కొట్టేసినట్లు క్లియర్ గా ఉంది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ ద్వారా నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి చోరి జరగలేదని, షాపు యజమానులు అప్రమత్తంగా ఉండాలని లాలాపేట సిఐ శివప్రసాద్ సూచించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..