Guntur District: ముఖాలు సన్నగా ఉన్నాయ్.. బాడీలు బలంగా ఉన్నాయ్.. వీరిపై నిఘా పెట్టగా..?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయి అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక బలగాలను నియమించి ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే గంజాయి రవాణా చేసే ముఠాలు కొత్త మార్గాలను కొత్త విధానాలను ఎంచుకుంటున్నాయి. కొత్త పద్దతుల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాకు తెనాలి పోలీసులు పెట్టారు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన సాహిత్ రెడ్డి, హర్షణ్ వర్ధన్ రెడ్డి, రిషి బాబులు గత కొన్నేళ్లేగా గంజాయి విక్రయిస్తున్నారు. వీరిపై అనేక కేసులున్నాయి. గంజాయి వీరు సేవించడమే కాకుండా కాలేజ్ విద్యార్ధులను టార్గెట్ చేసుకొని వారికి విక్రయిస్తుంటారు. ఒరిస్సా నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చి గుంటూరు జిల్లాలోని పలు కాలేజ్‌ల వద్ద గంజాయి అమ్ముతుంటారు. అయితే గత కొంతకాలంగా వీరిపై నిఘా ఉంచడంతో గంజాయి రవాణాకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. బ్యాగ్స్‌లో తీసుకొస్తుంటే తనిఖీల్లో పదే, పదే పట్టుబడుతున్నారు. దీంతో వీరే ఒరిస్సా వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి దాన్ని బనియన్‌కు కోట్‌లా అమర్చుకున్న భాగంలో దాచి… ఆ పైన షర్ట్ వేసుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా రైళ్లలో ప్రయాణిస్తూ లక్ష్యాలకు చేరుకుంటారు. అలా గంజాయి ఏపీకి రవాణా చేస్తున్నారు. ఇక తెచ్చిన గంజాయి అమ్మకం కోసం మరో ప్లాన్ వేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ను తమ సరకు అమ్మకానికి సాధనంగా ఉపయోగిస్తున్నారు. కేసులు ఉండటంతో వీరి ఫోన్ నంబర్లపై పోలీసులు నిఘా ఉంచారు. అలా వీరు గంజాయి రవాణా చేసే విధానం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరితో పాటు కేసుతో సంబంధం ఉన్న తెనాలికి చెందిన ప్రశాంత్, వెంకటేశ్వరావును అదుపులోకి తీసుకున్నారు
వీరి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేస్తున్నవారిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. అదే విధంగా ఒరిస్సాలో వీరికి గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు తెనాలి డిఎస్పీ జనార్ధన రావు తెలిపారు. గంజాయి ఏ రూపంలో తెనాలి ప్రాంతానికి వచ్చినా పట్టుకుంటామని డిఎస్పీ చెప్పారు. పాత నేరస్థులపై నిఘా ఉంచడమే కాకుండా కొత్త మార్గాలను ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆరుగురిని అరెస్ట్ చేసిన తెనాలి పోలీసులు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
