AP News: ఆ మంచినీటి సరస్సులో చనిపోతున్న చేపలు.. ఆందోళనలో గ్రామస్తులు.. అసలు విషయమేంటంటే
Kolleru Fresh Water Lake: ఈ నీరు నల్లగా దుర్గంధంతో ప్రవహిస్తుండటంతో అధికారులు తమ్మిలేరు పడమర లాకుల నుంచి దిగువకు విడుదల చేశారు. అయితే...
ఆ మంచినీటి సరస్సులో ఇప్పుడు చేపలు చనిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. ఆ దృశ్యాలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోందన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
చుట్టూ పొదలు.. వాటి మధ్య జలకలతో ఉట్టిపడుతూ అందమైన పక్షులు.. అటు.. ఇటు రయ్యమని పరుగులు తీసే పిల్ల చేపలతో కొల్లేరు సరస్సు కళకళలాడుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఆ సందడి అంతా తగ్గిపోయింది. పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టాల నడుమ విస్తరించి ఉన్న కొల్లేరులో చేపలు చచ్చి తేలుతున్నాయి. వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడుతుండటం అక్కడి స్థానికులను ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. గత రెండు రోజులుగా కొల్లేరులోకి విడుదలవుతున్న కలుషిత నీరు దుర్గంధం వెదజల్లుతుందని వాపోతున్నారు.
కలుషితంగా మారిన కొల్లేరు సరస్సు…
ప్రపంచ ప్రసిద్దిగాంచిన కొల్లేరు సరస్సు.. ఇప్పుడు కలుషిత సరస్సుగా మారిపోయింది. బెజవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా నీటిని విడుదల చేయడం.. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కాలువలు కట్టివేసి ఉండటంతో ఏలూరు కాలువలోకి చేరిన విజయవాడ డ్రైనేజీ నీరు, ఆటోనగర్ పారిశ్రామిక వ్యర్ధాలు, ఇతర పరిశ్రమల నీరు.. కృష్ణా నీటితో కలిసి కాలుష్యం ప్రవహిస్తుంది. ఈ నీరు నల్లగా దుర్గంధంతో ప్రవహిస్తుండటంతో అధికారులు తమ్మిలేరు పడమర లాకుల నుంచి దిగువకు విడుదల చేశారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లోని పలు గ్రామాలతో పాటు ప్రధానమైన కొల్లేరుకు ఈ వ్యర్ధ, కలుషిత నీరు చేరుకుంటోంది. దీంతో సరస్సులో చేపలు గత రెండు రోజులుగా పెద్దసంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు కొల్లేరులో మావులుపెడతారు. వలలు కట్టుకుంటారు. అయితే వీటిలోనూ చనిపోయిన చేపలే పడుతుండటంతో వాటిని విక్రయిస్తున్నారు.
కొల్లేరులోకి తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు, గుండేరుతో పాటు దాదాపు 40 రకాల కాలువలు, కృష్ణ–గోదావరి నీరు వచ్చి చేరుతుంది. అయితే ఈ కాలువల్లో కలిసే నీటిని పరిశ్రమల నిర్వాహకులు శుద్ది చేసి కోల్లెరులోకి విడుదల చేయాలి. అలాచేయకుండా నేరుగా విడుదల చేయటంతో కొల్లేరుకు విజయవాడ వ్యర్దాలు శాపంగా మారాయి. ఈ నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలవాల్సి ఉన్నా కొల్లేరులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం, చేపల చెరువుల ఫలితంగా నీరు దిగువకు వెళ్లదు. దీంతో కొల్లేరు వాసులు తాగటానికి మినహా ఇతర అన్ని అవసరాలకు ఈ నీటినే వినియోగిస్తున్నారు.
గత ఏడాది వరదల తరువాత ఏలూరు, కొల్లేరు పరిసర గ్రామాలైన పూళ్ళ వంటి చోట్ల వింత వ్యాధి ప్రభలిన విషయం తెలిసిందే. ఒక్క ఏలూరులోనే 600 మంది వరకు ఆసుపత్రి బారిన పడ్డారు. దీనికి ముఖ్య కారణంగా వ్యవసాయంలో వినియోగిస్తున్న పురుగుల మందులను తేల్చారు. కాలువల్లో కలుషిత నీరు కలవకుండా చర్యలు చేపడతామని అధికారులు అన్నారు. కానీ ఈ ఏడాది మరోసారి కలుషిత నీరు పెద్ద ఎత్తున కొల్లేరులోకి చేరుకుంటుంది. ఈ నీటిని వేలాది మంది ప్రజలు తాగు , సాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక గేదాలకు ఈ నీరు తాగటానికి ఉపయోగపడుతుంది. చేపల చెరువులకు ఈనీటిని తోడుతున్నారు . దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read: ఏపీ కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం.? ఎప్పటినుంచంటే.!