AP News: బస్సు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. కట్ చేస్తే.!
అడ్డదారులు తొక్కాలంటే అనంతకోటి మార్గాలు అంటారు. ఇప్పుడు దీన్నే స్మగ్లర్లు బాగా వంట పట్టించుకున్నట్టు ఉన్నారు. ఒకవైపు గంజాయి స్మగ్లర్లు వేర్వేరు రూపాల్లో సరిహద్దులో దాటించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇప్పుడు బంగారం తరలించేందుకు వెలుగులోకి వచ్చిన స్మగ్లర్ల ప్లాన్ ఖాకీలనే కంగు తినిపించింది.
అడ్డదారులు తొక్కాలంటే అనంతకోటి మార్గాలు అంటారు. ఇప్పుడు దీన్నే స్మగ్లర్లు బాగా వంట పట్టించుకున్నట్టు ఉన్నారు. ఒకవైపు గంజాయి స్మగ్లర్లు వేర్వేరు రూపాల్లో సరిహద్దులో దాటించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇప్పుడు బంగారం తరలించేందుకు వెలుగులోకి వచ్చిన స్మగ్లర్ల ప్లాన్ ఖాకీలనే కంగు తినిపించింది. అనుమానం వచ్చి అంతా చెక్ చేసినా.. తొలుత ఎక్కడా కనిపించలేదు. చివరకు జీన్ ప్యాంట్‌లో.. అది కూడా ఫ్లైట్‌లో ప్రయాణం కాదు ఏకంగా..
విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఇప్పటివరకు మత్తు వ్యవహారాలపై దృష్టి సారించి గంజాయి, మత్తు ఇంజక్షన్లు, టాబ్లెట్లు, సింథటిక్ డ్రగ్స్ పట్టుకుని కేసులు కూడా పెట్టారు. పదుల సంఖ్యలో నిందితులను జైలుకు కూడా పంపించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా.. బంగారం స్మగ్లింగ్ గుట్టు విప్పారు. గుట్టుచప్పుడు కాకుండా రోడ్డు మార్గంలో తరలిస్తున్న బంగారం బిస్కెట్లను పట్టుకున్నారు. విశాఖ సీపీగా అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కీలక పాయింట్లుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎన్‌ఫోర్స్మెంట్‌ను ముమ్మరం చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులను స్పీడప్ చేశారు. దీంతో ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సుల్లో సైతం తరలిస్తున్న గంజాయి వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పుడు తాజాగా బంగారం స్మగ్లింగ్ గుట్టు విప్పారు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. 815 గ్రాముల ఏడు బంగారం బిస్కెట్లను సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
జీన్ ప్యాంట్‌లో అలా..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ ఏడీసీపీ నాగేంద్రుడు.. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినాధరావుకు అలెర్ట్ చేశారు. వెంటనే స్పెషల్ టీంతో రంగాల్లోకి దిగిన టాస్క్‌ఫోర్స్.. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధి భీమిలి క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేశారు. ఒడిస్సా వైపు నుంచి వస్తున్న ఓ బస్సులో తనిఖీ చేసినవారికి ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. అనుమానంతో అంతా వెతికారు. వాళ్ల బ్యాగేజీని చెక్ చేశారు. కానీ ఎక్కడా ఏమీ లభించలేదు. చివరికి మరోసారి తనిఖీల్లో భాగంగా.. ధరించిన డ్రెస్సులు చెక్ చేశారు. దీంతో జీన్ ఫ్యాంట్‌లో వెనుక వైపు ఏదో గట్టిగా తగిలినట్టు అనిపించింది. ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. వాళ్లని పట్టుకుని.. జీన్ ఫ్యాంట్ లోపల చెక్ చేస్తే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారంతో పాటు రెండు వేల నగదు, సిల్వర్ బ్రాస్లెట్లు, రెండు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విశాఖ మీదుగా వెళ్తున్న బస్సులో ఇచ్చాపురం నుంచి గుంటూరు వెళ్తున్నట్టు పోలీసులు సమాచారాన్ని సేకరించారు. దీపక్ అక్షయ్ అనే ఇద్దరు నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును ఆనందపురం పోలీసులకు అప్పగించారు. ఇద్దరినీ విచారిస్తున్నారు పోలీసులు.