Andhra Pradesh: ఏపీలో హింసాకాండపై ఈసీ సీరియస్.. వివరణ ఇవ్వాలని ఆ జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ కొరడా ఝళిపించింది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో... రాజకీయ హింసపై ఆరా తీసింది. ఇవాళ సాయంత్రంలోగా వీటిపై వివరణ ఇవ్వాలంటూ మూడు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ.. మూడు జిల్లాల ఎస్పీలు ఎన్నికల కమిషన్ ముందు హాజరుకానున్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో హత్యలు జరిగాయి.. మాచర్లలో ట్రాక్టర్లు తగులబెట్టారని ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి వెళ్లింది. దీంతో ఈ సీరియస్ అయింది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో రాజకీయ హింస జరగడంపై ఈసీ స్థానిక పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈసీ కార్యాలయంలో సీఈవో వద్ద హాజరై వివరణ ఇవ్వాలంటూ మూడు జిల్లాల ఎస్పీలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. హత్యలు, హింస ఎలా జరిగింది, ఎవరి పాత్ర ఉందనే దానిపై వివరణ తీసుకుంటామని, ఇలాంటి హింసకు ఇప్పుడే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఈసీ స్పష్టం చేసింది.
వేలంపాటలో ఘర్షణతో హత్య
అంతకుముందు నంద్యాల జిల్లా, చాగలమర్రి మండల కేంద్రంలో దారుణం జరిగింది. గ్రామ పంచాయతీ వేలంపాటల్లో ఘర్షణ జరగడంతో రసూల్ కుమారుడు ఇమామ్ హత్యకు గురయ్యాడు. ఈసీ ఆదేశాలతో పోలీసుల్లో కదలిక వచ్చింది. ఈ కేసుకు సంబంధించి దస్తగిరి, ఖాదర్ అనే నిందితులను అరెస్ట్ చేశారు ఆళ్లగడ్డ పోలీసులు. హతుడు ఇమామ్, నిందితుడు దస్తగిరి ఇద్దరు కజిన్స్ అనే అని, ఇద్దరూ వైసీపీ సానుభూతిపరులే అన్నారు డీఎస్పీ.
టీడీపీ కార్యకర్త హత్య
ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీలోని పరమేశ్వర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రజాగళం సభకు వెళ్లాడనే… నెపంతో టిడిపి కార్యకర్త మునయ్యపై వైసీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మునయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై టిడిపి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాలో..
మరోవైపు పల్నాడు జిల్లాలో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. మాచర్ల 10వ వార్డుకి చెందిన టీడీపీ కార్యకర్త.. వీర్ల సురేష్ కి చెందిన కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. వైసీపీ కార్యకర్తలే తన కారును తగబెట్టారని ఆరోపించారు బాధితుడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరింది ఈసీ.. కాగా, ఇవాళ ఎస్పీలు ఏ విధంగా సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




