విశాఖ జిల్లాలో భూప్రకంపనలు
విశాఖ తెల్లవారుజామున 4.24 నిమిషాలకు విశాఖ నగరాన్ని స్వల్ప భూకంపం సంభవించింది. విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై మీరూ లుక్కేయండి మరి. ఇదిగో వివరాలు

ఇటీవల ప్రపంచదేశాలను భూప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. భారత్‌లోనూ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామును భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4:20 నిమిషాల మధ్య విశాఖ నగరంలో భూప్రకంపనలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా, భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. ముఖ్యంగా మురళీనగర్, గాజువాక, మాధురవాడ, ఎమ్.వి.పి కాలనీ, గోపాలపట్నం,విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0 గా నమోదై ఉండవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారిక ధృవీకరణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పరిశీలన ప్రారంభించింది. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు లేవని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, జాగ్రత్త చర్యలుగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




