మరో సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్.. సక్సెస్ చేయాలంటూ అధికారులు, పార్టీ నేతలకు ఆదేశాలు..
Andhra Pradesh: పార్టీ, ప్రభుత్వం కలిసి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. తాజాగా క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రెండు నెలల క్రితం ఎంతో పట్టుదలగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా సీఎం జగన్ దిశానిర్ధేశం..
ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ప్రభుత్వం. ఎన్నికలకు కొన్ని నెలల ముందు రెండు కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వీటిలో ఒకటి జగనన్న ఆరోగ్య సురక్ష కాగా.. రెండోది ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఏం చేయాలి..? ఎలా చేయాలనే దానిపై ఇప్పటికే అందరికీ వివరించారు సీఎం జగన్. ఇటీవల జరిగిన పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలతో జరిగిన సమావేశంలో కార్యక్రమం గురించి పూర్తిగా వివరించారు.
అలాగే పార్టీ, ప్రభుత్వం కలిసి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. తాజాగా క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రెండు నెలల క్రితం ఎంతో పట్టుదలగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా సీఎం జగన్ దిశానిర్ధేశం చేసారు. సుమారు ఏడాదిన్నరగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనంతో పార్టీ కేడర్ మొత్తం మమేకమయ్యారు. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా కోట్లాది ఇళ్లకు వెళ్లేలా ప్లాన్ చేసారు.
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఏం చేయనున్నారు..?
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కానున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయనున్నారు. ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామాన్నీ జల్లెడ పట్టనున్నారు. ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. వారిని గుర్తించి వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్లతో వారికి చికిత్స అందించనుంది. ఏ వ్యాధి ఉన్న పేషెంట్ అయినా వారికి నయం అయ్యే దాకా పూర్తిగా పర్యవేక్షణ చేయనున్నారు. సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చర్యలు తీసుకుంటారు. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమం జరుగనుంది
మొదటి దశ ఇప్పటికే సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం అయింది. దీని ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి బీపీ , షుగర్, హెచ్ బీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేయనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ టెస్టు చేయనున్నారు.టెస్టు ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వారికి చికిత్సలు అందించనున్నారు. ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు. ఎక్కడ చికిత్స అందుతుంది..? ఎలా వెళ్లాలి..? ఏదైనా ఇబ్బంది ఉంటే.. ఎవర్ని సంప్రదించాలి..? అన్న వివరాలతో కూడా బ్రోచర్‌ను అందిస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల రక్తహీనతపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇంకా గ్రామంలో హెల్త్ క్యాంపు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూతనివ్వనుంది ప్రభుత్వం..
అధికారులు, పార్టీ నేతలకు ఆదేశం..
అధికారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బందితో కలిసి పార్టీ నేతలు కార్యక్రమం విజయవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్న ప్రభుత్వం.. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితిపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీర్ఘకాల వ్యాధులున్న వారికి సైతం మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటుంది. విద్య, వైద్యంపై మొదటి నుంచీ ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్.. తాజా కార్యక్రమం ద్వారా ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంత కమిట్‌మెంట్ ఉందో చూపించేలా ముందుకెళ్తున్నారు. నవంబర్ మొదటి వరకూ ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.