చంద్రబాబుకి సంఘీభావంగా లోకేష్ వినూత్న పిలుపు.. ప్రజాశబ్ధం వినిపించాలంటూ
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:05 వరకు మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. గంట, పళ్లాలు, విజిల్స్, హార్న్ లాంటివి వాడాలని లోకేశ్ సూచించారు. ఎక్కడివారు అక్కడే శబ్దాలు చెయ్యాలన్నారు లోకేశ్. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
తప్పుడు కేసులకు భయపడేదే లేదంటున్న లోకేష్, ప్రజాగ్రహాన్ని రుచి చూపిద్దామంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబుకి సంఘీభావంగా లోకేష్ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. బాబుకి మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం వచ్చిందని అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన సరిగ్గా 7 గంటలకు తెలుగు ప్రజలంతా మోత మోగించాలన్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే 5 నిమిషాల పాటు శబ్ధం చేయాలన్నారు టీడీపీ నేత నారా లోకేష్. శబ్ధం చేసేందుకు గంట, పళ్లాలు, విజిల్స్, హార్న్ లాంటివి వాడాలని.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్యాలన్నారు లోకేష్.
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ… pic.twitter.com/K0J6bo5RBY
— Lokesh Nara (@naralokesh) September 29, 2023
లోకేష్‌కు స్పల్ప ఊరట
మరోవైపు నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లోకేష్ తరఫు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీ వరకు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్టోబర్ 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నారా లోకేష్ ఎక్కడ అంటోంది ఏపీ సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు సీఐడీ అధికారులు. నారా లోకేష్ ఎక్కడున్నారో తమకు తెలియదంటున్నారు వాళ్లు. లోకేష్‌ను విచారించేందుకు 41ఏ కింద నోటీసులివ్వనున్న సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్….A14గా ఉన్నారు.
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టువాయిదా వేసింది. వచ్చేనెల 4వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ మొదటి నిందితుడిగా పేర్కొంది. బెయిల్ పిటిషన్‌పై ఈనెల 27న వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఇవాళ జరిగిన విచారణలో సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు జరిగాయి.
రాజధాని అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వివరాలను కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..