Andhra Pradesh: జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు సర్వం సిద్దం.. ఎక్కడ చేసుకోవాలంటే..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. నవరత్నాలు పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు నగదు బదిలీతో పాటు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. నగదు బదిలీ ద్వారా ఇప్పటి వరకూ రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి మళ్లించినట్లు ప్రభుత్వం చెబుతుంది.

విజయవాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. నవరత్నాలు పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు నగదు బదిలీతో పాటు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. నగదు బదిలీ ద్వారా ఇప్పటి వరకూ రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి మళ్లించినట్లు ప్రభుత్వం చెబుతుంది. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఏపీ ప్రభుత్వం నిలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. పేదవాడిని సంపన్నులుగా చేసేలా ఆర్ధికంగా నిలదొక్కుకునేలా పథకాలను అందిస్తున్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. దీంట్లో భాగంగానే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా సొంత ఇళ్లు లేని వారికి సెంటు స్థలంతో పట్టాలు ఇవ్వడంతో పాటు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వమే వివిధ రూపాల్లో సహకారం అందిస్తుంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తికాగా.. ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ఆర్డిక సంవత్సరం పూర్తయ్యే సరికి సుమారు 10 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యేలా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాల విలువ కనీసం 5 లక్షల నుంచి గరిష్టంగా పది లక్షల వరకూ ఉంటుందని చెబుతుంది. ఈ పట్టాలన్నీ కుటుంబ పెద్దల పేరు మీద కాకుండా ఆ ఇంట్లో ఉండే మహిళల పేరు మీదే ఇచ్చింది సర్కార్. అక్కచెల్లెమ్మళ్ల పేరు మీద పట్టాలు ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. అయితే పట్టాల పంపిణీ పూర్తయినప్పటికీ లబ్దిదారుల పేరుమీద ఇంకా రిజిస్ట్రేషన్లు కాలేదు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించింది.
సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..
రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు అందించనున్నారు. ఇప్పటి వరకూ 31లక్షల 19 వేల మందికి ఇళ్ల పట్టాలందించింది ప్రభుత్వం. అయితే గతంలో ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు అందిస్తే వాటిని డి-ఫామ్ పట్టా జాబితాలో ఇచ్చేవారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై లబ్దిదారులకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. కానీ దేశంలోనే మొదటిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వారికి సర్వహక్కులు కల్పించేలా చట్ట సవరణ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం మహిళలకు ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ఇవాళ్టి నుంచి గ్రామ,వార్డు సచివాలయాల్లో ట్రయల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ఈనెల 29 నుంచి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
రిజిస్ట్రేషన్ల కొరకు గ్రామ,వార్డు సచివాలయాలనే రిజిస్ట్రార్ కార్యాలయాలుగా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ కూడా దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. లబ్దిదారులకు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి కన్వేనియన్స్ డీడ్స్ ఇవ్వనున్నారు. పంచాయతీ కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా ఈ వ్యవహారం మొత్తం చూస్తారు. వీఆర్వోలు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. మొత్తం ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ను 12 రోజుల్లోగా పూర్తి చేసేలా టార్గెట్‌గా పెట్టుకుంది ప్రభుత్వం. ఇలా రిజిస్ట్రేషన్ పూర్తయిన స్థలాలకు పదేళ్ల తర్వాత వాటిపై లబ్దిదారులకు పూర్తి హక్కులు రానున్నాయి. ఇప్పుడు ఇచ్చే కన్వెనియన్స్ డీడ్స్ పదేళ్ల తర్వాత సేల్ డీడ్ లుగా మారతాయి. మొత్తం 31.19 లక్షల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, ఇళ్ల నిర్మాణం ద్వారా 17వేలకు పైగా జగనన్న కాలనీలుగా మారనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




