CM Jagan: టార్గెట్ 175.! జనంలోకి సీఎం జగన్.. వైజాగ్‌లో 3లక్షల మందితో భారీ బహిరంగ సభ..
సాధారణ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం వేగంగా చేస్తూ ముందుకు వెళ్తోంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా వేగాన్ని పెంచాయి. ఇందులో భాగంగా జనవరి 27న అధికార వైఎస్సార్సీపీ ఎన్నికల కేడర్‌ను పూర్తి స్థాయిలో సిద్దం చేసేందుకు అడుగులు వేస్తోంది.
సాధారణ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం వేగంగా చేస్తూ ముందుకు వెళ్తోంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా వేగాన్ని పెంచాయి. ఇందులో భాగంగా జనవరి 27న అధికార వైఎస్సార్సీపీ ఎన్నికల కేడర్‌ను పూర్తి స్థాయిలో సిద్దం చేసేందుకు అడుగులు వేస్తోంది. అందుకే “సిద్దం” అనే పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు ఉత్తరాంధ్ర వేదిక అయింది. ఈరోజు భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఎన్నికలను ఎదుర్కొనేలా కేడర్‌కు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ క్రియాశీలక సభ్యులు, సానుభూతి పరులతో జరగబోయే ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి మూడు లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. వీరితో దాదాపు గంటన్నర పాటు మాట మంతి కలుపనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకూ ఈ సమావేశం ఉండనుంది. ఒక వైపు జనసేన – టీడీపీ పొత్తు కుదుపుల నేపథ్యంలో ఈరోజు జరగబోయే సమావేశంపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది.
2024 అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒకవైపు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల తుదిజాబితాను కూడా విడుదల చేసింది. అదే సమయంలో పోలింగ్ బూత్‌లు, భద్రత, అధికారుల బదిలీలు తదితర కీలక అంశాలపైనా దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో వచ్చే ఫిబ్రవరిలో ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాజకీయ పార్టీలు ప్రచారం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కదలి రా.. పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అంతే వేగంగా మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తి చేసింది. దాదాపు 60 నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జ్‌లను కూడా నియమించింది. మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది.
ఒకవైపు అభ్యర్ధులను ఖరారు చేస్తూనే మరోవైపు కీలకమైన ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దుమ్మురేపేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా భావిస్తోంది. రెండోసారి వరుసగా విజయం దక్కించుకుని అధికారంలోకి రావడం ద్వారా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎదురయ్యే భారీ పోటీని ముందుగానే అంచనా వేసిన వైసీపీ అధిష్టానం.. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు అస్త్ర శస్త్రాలతో సిద్ధమౌతుంది. ప్రధానంగా ఈ 56 నెలల తమ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర పథకాలు, నాడు నేడు, జగనన్న ఇళ్లు, ఇలా ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుంది. అదేసమయంలో గత ప్రభుత్వానికి.. తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ.. ప్రజలకు ఆయా విషయాలపైన పోలికలు చూపించే ప్రయత్నం కూడా చేయనుంది. మొత్తంగా.. ఈరోజు జరిగే సభ ద్వారా అధికార వైఎస్సార్సీపీ ఎన్నికల సంగ్రామంలోకి దాదాపు దిగిపోయినట్టే భావించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే జనవరి 27న జరిగే ప్రచార పర్వానికి నాందిపలకడానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ కోర్ టీమ్ ఈ సభను దిగ్విజయం చేయడానికి సర్వం సిద్దం చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 2019లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే.. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు ఈ సభ వేదిక కావాలన్న రీతిలో పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. సంక్షేమమే కాకుండా ఉద్దానంలో ఏర్పాటు చేసిన కిడ్నీ పరిశోధన కేంద్రం సహా.. కిడ్నీ రోగులకు అందిస్తున్న పింఛన్లు, వెనుక బడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో చేపట్టిన అభివృద్ధి, మత్స్యకారుల కుటుంబాలకు చేస్తున్న మేలు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, పోర్టుల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపై పార్టీ కేడర్‌కు పార్టీ సుప్రీం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..