Chandrababu: ‘రా కదలిరా’ సభలకు సర్వం సిద్దం.. పవన్ వ్యాఖ్యలకు టీడీపీ అధినేత మాటేంటో..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఈ నెల మొదటి వారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రా..కదలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు పెడుతూ కేడర్ ప్రజల్లోకి వెళ్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఈ నెల మొదటి వారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రా..కదలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు పెడుతూ కేడర్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న సమస్యలపై స్పందిస్తూనే అక్కడి అధికార పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా 26 జిల్లాల్లో సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ షెడ్యూల్ రూపొందించింది. అయితే మధ్యలో వారం రోజులపాటు అనుకోకుండా విరామం వచ్చింది. చంద్రబాబు అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లడంతో పాటు తిరిగి వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. దీంతో రా.. కదలిరా సభలకు కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి ఇవాల్టి నుంచి మిగిలిన జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా చంద్రబాబు ముందుకెళ్తున్నారు.
ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు ఆరు జిల్లాల్లో చంద్రబాబు రా.. కదలిరా సభలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పీలేరు,ఉరవకొండ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో అన్నమయ్య జిల్లా పీలేరు వెళ్లనున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత అనంతపురం జిల్లా ఉరవకొండలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేపు ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గం సభల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, మధ్యాహ్నం గుంటూరు జిల్లా పొన్నూరులో రా..కదలిరా సభల్లో పాల్గొనున్నారు టీడీపీ అధినేత. టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది.
ఆ ప్రకటనకు దూరంగా టీడీపీ..
తెలుగు దేశం-జనసేన పార్టీల మధ్య అంతా సవ్యంగానే జరుగుతుందనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. త్వరలో రెండు పార్టీల అధినేతలు కలిసి మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కనుక నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తాను అంటూ రాజోలు,రాజనగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు పవన్ కళ్యాణ్. అక్కడితో ఆగకుండా చంద్రబాబుకు ఉండే ఒత్తిళ్లు ఆయనకు ఉంటాయి.. నాకు ఉండే ఒత్తిళ్లు నాకుంటాయని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత పొత్తు ధర్మం పాటించలేదని విమర్శించారు. అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని చెప్పుకొచ్చారు.
పవన్ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా స్పందించారు. పవన్ రెండు సీట్లు ప్రకటించడం వల్ల తమకు ఇబ్బంది లేదని అన్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు-పవన్ కూర్చుని మాట్లాడుకుంటారని అన్నారు. పొత్తు విడిపోవాలని ఉద్దేశంతో వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవే అంటున్నారు రెండు పార్టీల నేతలు. ఈ వివాదం పెద్దది కాకుండా చంద్రబాబు దీనిపై స్పందించి ఫుల్ స్టాప్ పెడతారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు మూడు రోజులపాటు 6 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ వేదికల మీద పవన్ వ్యాఖ్యలపై కేడర్‌కు క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి. చంద్రబాబు స్పందించకుంటే టీడీపీలో మాత్రం గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అయితే ఇకపై జిల్లాల పర్యటనల్లో అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు దూరంగా ఉంటారని పార్టీవర్గాలు మాత్రం చెబుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..