CM Chandrababu: రోడ్డు రోలర్ ఎక్కిన సీఎం చంద్రబాబు.. డ్రైవర్‌తో ఆసక్తిగా ఏం మాట్లాడారో తెలుసా..?!
కాన్వాయ్ దిగిన చంద్రబాబు.. గుంతలో పూడ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రాంతానికి కాలినడకన బయలుదేరారు. దారి పొడవునా రోడ్డు గుంతలను పరిశీలిస్తూ ముందుకు సాగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతల రోడ్లను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషన్ పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ పేరుతో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పూజ చేసి, గుంతల్లో కాంక్రీట్ వేసి పనులను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడ ఎన్నికల కోడ్ కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత తన పర్యటనను అనకాపల్లి జిల్లాకు మార్చుకున్నారు. పరవాడ మండలం వెన్నెల పాలెం ప్రధాన రోడ్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం షెడ్యూల్ ఆకస్మికంగా మారడంతో అనకాపల్లి జిల్లా అధికారులు పరుగులు పెట్టారు. రాత్రికి రాత్రే ఏర్పాట్లు పూర్తి చేసి.. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయానికి అంతా సిద్ధం చేశారు అధికారులు.
కాలినడకన రోడ్డు పరిశీలించి..
శ్రీకాకుళం జిల్లా పర్యటన నుంచి హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఫార్మాసిటీ హెలిపాడ్‌లో హెలికాప్టర్ దిగి.. అక్కడ నాయకులు కార్యకర్తలతో కాసేపు మాట్లాడారు. అక్కడ నుంచి బస్సులో వెన్నెల పాలెం బయలుదేరారు. వెన్నెల పాలెంలో చంద్రబాబుకు భారీగా స్వాగతం పలికారు స్థానికులు. భారీ క్రేన్ తో గజమాలతో స్వాగత సత్కారం చేశారు. అక్కడ కాన్వాయ్ దిగిన చంద్రబాబు.. గుంతలో పూడ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రాంతానికి కాలినడకన బయలుదేరారు. దారి పొడవునా రోడ్డు గుంతలను పరిశీలిస్తూ ముందుకు సాగారు.
పారపట్టి కాంక్రీట్ పోసి..
అక్కడ మిషన్ పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి.. కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారపట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు సిమెంటు కాంక్రీట్ మిక్స్ను రోడ్డుపై ఉన్న గుంతల్లో పోశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభాస్థలికి వెళ్లి ప్రసంగించారు. దాదాపు గంటసేపు మాట్లాడి.. సంక్రాంతి కల్లా రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు లేకుండా సిద్ధం కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, అధికారులకు ఆదేశించారు. రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని, రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్రాంతికి ఇతర ప్రాంతం నుంచి ఏపీకి వచ్చేవాళ్లు ఇక్కడ రోడ్లు చూసి గర్వపడేలా ఉండాలని సూచించారు. డ్రోన్లు పంపించి రోడ్లను పరిశీలిస్తాం అంటూ చమత్కరించారు చంద్రబాబు.
రోడ్డు రోలర్ డ్రైవ్ చేసిన చంద్రబాబు
వెన్నెల పాలంలో సభ ముగిసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా గోతులతో ఉన్న రోడ్ల ఫోటోలను ప్రదర్శనలో ఉంచారు అధికారులు. ఆ తర్వాత విశాఖ పర్యటనకు బయలుదేరే ముందు.. రోడ్డు గుంతలను పూడ్చేందుకు సిద్ధం చేసిన రోడ్ రోలర్ వైపు వెళ్లారు చంద్రబాబు. రోడ్ రోలర్ పైకి ఎక్కారు. డ్రైవర్ సీట్ లో కూర్చుని.. రోడ్డు రోలర్ ను నడిపారు. గుంతలు ఉన్న రోడ్లలో పోసిన కాంక్రీట్ సిమెంట్ పైనుంచి రోడ్డు రూలర్‌ను పోనిచ్చారు. చంద్రబాబుతో పాటు హోం మంత్రి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి వాహనం పైనే ఉన్నారు. పక్కనే ఉన్న డ్రైవర్ రమణ తో మాట్లాడారు. రోడ్ రోలర్ ఆపరేట్ గురించి వివరాలు అడిగారు. సీఎం స్వయంగా రోడ్డు రోలర్ నడిపారు. చాలా తృప్తిగా ఉంది. రోడ్లన్నీ బాగుపడతాయి.. అంత పెద్దాయన అటువంటి కార్యక్రమాన్ని చేయడం, రోడ్డు రోలర్ స్వయంగా డ్రైవ్ చేయడం గర్వంగా ఉంది.’ అని చెప్పానరు రోడ్ రోలర్ డ్రైవర్ రమణ.
అనకాపల్లి జిల్లా పర్యటన ముగించుకుని హెలికాప్టర్‌లో నేరుగా విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లారు. పరవాడ ఫార్మాసిటీ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో ఋషికొండ కు బయలుదేరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..