Freebies: బూమరాంగ్‌..! గల్లా పెట్టె చూసి గ్యారెంటీలు ఇచ్చే రోజులొస్తాయా..? ఉచితాలపై మారుతున్న స్వరం

ఈ స్టేట్‌మెంట్‌ను కచ్చితంగా స్వాగతించి తీరాల్సిందే. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ధోరణి ఎప్పుడూ ఉచిత పథకాలు ఇస్తేనే జనం ఓట్లేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు వడ్డించిన విస్తరిలా పథకాలు ఉండేవి. ఆ తరువాత.. కలుపుకుని తినే కర్మ నీకెందుకని.. ముద్ద కలిపి నోటికే అందించడం మొదలుపెట్టారు. ఆ తరువాత.. నమిలి, అరాయించుకోవాల్సిన కర్మ నీకెందుకు.. ఆ పని కూడా మేమే చేసిపెడతాం అన్నంత వరకు వచ్చింది కథ..

Freebies: బూమరాంగ్‌..! గల్లా పెట్టె చూసి గ్యారెంటీలు ఇచ్చే రోజులొస్తాయా..? ఉచితాలపై మారుతున్న స్వరం
National Politicians With Telugu State Politicians
Follow us

|

Updated on: Nov 04, 2024 | 6:33 PM

ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి ఇంటికి కోటి రూపాయలు. ఒక్కసారి కాదు ప్రతి ఏటా కోటి రూపాయలు. ప్రతి ఇంటికి ఓ హెలికాప్టర్. కొత్త జంటకు బంగారు నగలు, మూడంతస్తుల బిల్డింగ్. ఆడవాళ్లకు వంటింటి పనిభారం తగ్గించేందుకు రోబోలు, కాల్వల్లో ఈదడానికి ప్రతి కుటుంబానికి ఓ పడవ. తమిళనాడు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన ఓ జర్నలిస్ట్‌ ఇచ్చిన హామీలు ఇవి. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో.. హైదరాబాద్‌కు సముద్రాన్ని తెస్తానని హీరో ప్రామిస్ చేస్తే అంతా నవ్వుకున్నాం గానీ.. తమిళనాడులో నిజంగానే హామీలిచ్చాడు. ఇందులో.. ఎదుటివాళ్లు హామీలు ఇస్తున్నారు కదా అని ఓటు వేయొద్దని చెప్పడం ఒక ఉద్దేశం అయితే.. పార్టీల హామీలపై సెటైర్లు వేయడం మరో ఉద్దేశం. కలర్‌ టీవీలు, ఫ్యాన్లు, మిక్సీలు, ల్యాప్‌టాప్‌లు.. ఇలా ఎన్ని హామీలు ఇచ్చారో తమిళనాడులో. ఆ రాష్ట్రం సంగతేమో గానీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల హామీలపై ఓ చర్చ అయితే జరుగుతోందిప్పుడు. కాంగ్రెస్‌ హామీలపై మోదీ చేసిన కామెంట్‌.. ‘కాస్త చూసుకుని హామీలు ఇవ్వండంటూ’ ఖర్గే చెప్పడం చూశాక.. ‘గ్యారెంటీ పే చర్చ’ నడుస్తోంది. గెలవడానికి హామీలు ఇవ్వడం, గెలిచాక చతికిలపడడం, ప్రజల్లో నమ్మకం కోల్పోవడం.. కొన్ని పార్టీలకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది అసలు విషయం. ఇంతకీ.. మోదీ ఎందుకని పర్టిక్యులర్‌గా తెలంగాణ, కర్నాటకను ఎగ్జాంపుల్‌గా చూపించారు? ఖర్గే ఎందుకని జాగ్రత్తపడ్డారు? బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మరోసారి ఆలోచించుకుంటామని కర్నాటక ప్రభుత్వం ఎందుకంది? అసలు ఎలక్షన్ కమిషన్‌గానీ, సుప్రీంకోర్టు గానీ ఉచితాలపై ఎలాంటి కామెంట్స్ చేశాయి? డిటైల్డ్‌గా చూద్దాం ఇవాళ్టి టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌లో.

ఈ ప్రపంచంలో శాశ్వతం అంటూ ఏదైనా ఉందీ అంటే.. అది ‘మార్పు’ మాత్రమేనంటాడు గీతలో గోవిందుడు. మార్పు మంచిదే. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కూడా ‘మార్పు’ గురించే మాట్లాడారు. ఉచితాలపై ఇస్తున్న హామీల విషయంలో కాంగ్రెస్‌ మారాలి అంటున్నారాయన. సూపర్-5, సూపర్-6, సూపర్-10.. ఇలాంటి హామీలపై పునరాలోచించుకుందాం అన్నారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా మేధావులు, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నది, హెచ్చరిస్తున్నది దీని గురించే. ఇంతకీ మల్లికార్జున ఖర్గే ఏమన్నారు? ఒక హామీ ఇచ్చే ముందు.. ‘అది సాధ్యమా కాదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా, ఐదేళ్ల పాటు నడిపించగలమా లేదా’ అనేది చూసుకోమంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే అప్పులు చేసి మరీ పథకాలు అమలు చేయాల్సినంత అవసరం రాకూడదు అంటున్నారు. గల్లా పెట్టెలో డబ్బుల్లేకపోయినా పథకాలు అమలుచేస్తే.. అది భవిష్యత్‌ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ స్టేట్‌మెంట్‌లో ప్రతి అక్షరమూ నిజమే. మరో మాట కూడా అన్నారు మల్లికార్జున ఖర్గే. కనీసం రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే.. ఇక పథకాలు అమలు చేసి ఏం లాభం అని. పథకాలు ఇచ్చుకుంటూ పోయి అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు తిరగబడతారన్నారు. అదే జరిగితే.. భవిష్యత్‌ తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదంటూ హెచ్చరికలు చేశారు.

కొందరు కామెంట్‌ చేయొచ్చు. ‘ఏం.. హామీలు ఇచ్చే ముందు తెలియలేదా ఆ విషయం’ అని. ఇప్పటికైనా ఆ మేల్కొలుపు మాటలు అంటున్నందుకు సంతోషించాలి గానీ కామెంట్‌ చేయనక్కర్లేదు. అంతా బాగానే ఉంది గానీ.. ఈ జ్ఞానోదయం వెనక కారణం ఏంటి? ఓవైపు మహారాష్ట్ర ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ.. పథకాల విషయంలో ఈ వెనకడుగు ఏంటి? ఎందుకంటే.. కర్నాటకలో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం పథకాన్ని ఆపేయడమో లేదా పరిమితులు విధించడమో చేయబోతున్నారని ఓ ప్రచారం నడుస్తోంది. అది నిజమే అన్నట్టుగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘ఎస్.. ఉచిత బస్సుపై పునరాలోచనలో ఉన్నాం’ అంటూ మాట్లాడారు. ఈ పథకాన్ని పూర్తిగా తీసేయకపోవచ్చు గానీ.. ప్రభుత్వంపై భారం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చని చెబుతున్నారు. దీనిపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ‘ముందుగా హామీ ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు వెనక్కి తగ్గడం ఎందుకు’ అని ఖర్గే కామెంట్‌ చేసినట్టుగా చెబుతున్నారు.

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ చీఫ్‌ నుంచి ఈ మాట వచ్చిందో లేదో.. వెంటనే ఖర్గే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ‘అమలుచేయలేని హామీలు ఇవ్వడం సులభమే.. వాటిని అమలు చేయడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ గుర్తిస్తోంది’ అంటూ ఎక్స్‌ వేదికగా కామెంట్ చేశారు. అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, అభివృద్ధి ఎలా కుంటుపడిందో చూడాలంటూ కామెంట్ చేశారు. వెంటనే.. మాజీ మంత్రి కేటీఆర్ కూడా అందుకున్నారు. గాలిమాటల గ్యారెంటీలతో మొదటికే మోసం వస్తుందన్న విషయం కాంగ్రెస్‌కు ఇప్పుడు అర్థమయిందా అంటూ విమర్శించారు. గ్యారెంటీల పేరుతో చేసిన మోసం క్షమించలేనిదంటూ ఫైర్ అయ్యారు. కర్నాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించినప్పుడు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో వల వేసినప్పుడు బడ్జెట్‌ గురించి తెలియదా అంటూ నిలదీశారు కేటీఆర్. అఫ్‌కోర్స్‌ ఈ కామెంట్లకు కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చిందనుకోండి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రధాని మోదీని ప్రశ్నించారు ఖర్గే. ప్రధాని మోదీ తెలంగాణ టాపిక్ తీసుకురావడంతో.. ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రయాణంతో తెలంగాణ మహిళలకు 3,433 కోట్ల రూపాయలు ఆదా అయిందన్నారు. 18వేల కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ అమలు చేశామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్, 50వేలకు పైగా ఉద్యోగ నియామకాలు, హాస్టల్‌ విద్యార్ధుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంపు.. ఇలా ఏ బీజేపీ పాలిత రాష్ట్రాన్ని తీసుకున్నా.. తెలంగాణదే రికార్డ్‌ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌.. ఇలా సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నామని బదులు ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.

సరే.. కామెంట్లు, కౌంటర్ల గురించి చెప్పుకుంటూ పోతే.. ఓ మంచి విషయంపై చర్చ అక్కడితో ఆగిపోతుంది. దేశవ్యాప్తంగా పార్టీలు ఇస్తున్న హామీలు, ఉచిత పథకాలు వాగ్ధానాలపై డిస్కషన్‌ జరగాల్సిన సమయం ఇప్పటికైనా వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు కూడా దీనిపై ప్రశ్నించింది. అసలు ఈ ‘ఉచితాలు’ అంటే ఏంటి అని నిలదీసింది. ఇదే సందర్భంలో ‘ఉచితాలు’ వేరు, సంక్షేమ పథకాలు వేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.

ఏదేమైనా తనను తాను కరెక్ట్‌ చేసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. గతంలో హామీలనే ఎక్కువగా నమ్ముకుని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో చాలా ప్రామిస్‌లు చేసింది. వాటిలో కొన్ని మాత్రమే నెరవేర్చగలిగింది. దీంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయి.. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చడం లేదంటున్నాయి అక్కడి ప్రతిపక్షాలు. అటు తెలంగాణలోనూ ఇవే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పథకాలు అమలు చేయకపోవడంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వెనకబడిందని చెబుతున్నారు. చేతిలో అధికారంలో ఉన్నా సరే.. సిట్టింగ్ సీట్ల కంటే కేవలం నాలుగు ఎంపీ సీట్లను మాత్రమే పెంచుకోగలిగిందని అంటున్నారు. అంతకు ముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. 2014లో 14 ఎంపీ సీట్లు, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లు గెలిచింది. ఇక్కడ మాత్రం అధికారంలోకి వచ్చిన మొదటిసారే 8 ఎంపీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకోగలిగిందని గుర్తు చేస్తున్నారు.

ఖర్గే ఏమన్నారంటే..

ప్రస్తుతం కర్నాటక కాంగ్రెస్‌ను సైతం ‘ఇచ్చిన హామీలు’ డ్యామేజ్ చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ 28 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే 9 మాత్రమే గెలిచింది. అధికారంలో లేని బీజేపీ మాత్రం 25 సీట్లలో పోటీ చేసి 17 గెలుచుకుంది. అందుకే, ఇప్పుడు మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా సరే ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చారంటున్నారు. ఇకపై ఇష్టమొచ్చిన హామీలు ఇవ్వొద్దని రాష్ట్రాల కాంగ్రెస్‌ లీడర్లకు సూచించారు. కాస్త రాష్ట్ర బడ్జెట్‌ను చూసుకుని, ఇవ్వగలమో లేదో తేల్చుకుని, ఓవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేసుకుని.. అప్పుడు హామీలు ఇవ్వాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో అదే.. పరిస్థితి

ఈ స్టేట్‌మెంట్‌ను కచ్చితంగా స్వాగతించి తీరాల్సిందే. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ధోరణి ఎప్పుడూ ఉచిత పథకాలు ఇస్తేనే జనం ఓట్లేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు వడ్డించిన విస్తరిలా పథకాలు ఉండేవి. ఆ తరువాత.. కలుపుకుని తినే కర్మ నీకెందుకని.. ముద్ద కలిపి నోటికే అందించడం మొదలుపెట్టారు. ఆ తరువాత.. నమిలి, అరాయించుకోవాల్సిన కర్మ నీకెందుకు.. ఆ పని కూడా మేమే చేసిపెడతాం అన్నంత వరకు వచ్చింది కథ. తెలుగు రాష్ట్రాలే ఇందుకు ఎగ్జాంపుల్. నిజానికి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ‘ఉచిత పథకాల’ విషయంలో ఫెయిల్యూర్స్‌ ఉంటే ఉండొచ్చు గానీ.. తెలుగు రాష్ట్రాల్లో అలా జరగలేదు. ఇక్కడి ప్రాంతీయ పార్టీలు పథకాలను నిక్కచ్చిగానే అమలు చేశాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో గత జగన్ ప్రభుత్వం పథకాలను బాగానే అమలు చేశాయి. అయినా సరే ఓడిపోయాయి.

13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ ఓ వైపు టీడీపీ విమర్శించినా సరే.. గత జగన్ ప్రభుత్వం మాత్రం పథకాలు పంచుతూనే వెళ్లింది. ఐదేళ్లలో 2 లక్షల 74 వేల కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మలకు నేరుగా పంచామని చెప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. కాని, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా.. పోయిన ఎన్నికల్లో ఓట్లు వేయలేదు ఏపీ ప్రజలు. తెలంగాణలోనూ అదే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోనే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కాని, పట్టణాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. సంక్షేమంతోనే ఎన్నికల్లో గెలుస్తాం అని ఏ పార్టీ అయినా అనుకుంటే అది పొరపాటు అవుతుందనడానికి తెలుగు రాష్ట్రాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను కూడా ఓసారి గుర్తు చేసుకోవాలి. నిజంగా సంక్షేమంతోనే గెలిస్తే.. అధికార పార్టీ ఎప్పటికీ ఓడిపోకూడదు అన్నారు అమిత్‌ షా. నిజమే కదా అది. అలాగని.. ఓడిపోయారు కాబట్టి సంక్షేమంతో ఓట్లు రావు అనుకుంటే పొరపాటే. ఏపీలో ఎన్నికలు అయిపోయి, ఫలితాలు వచ్చిన తరువాత ఓ సర్వే జరిగింది. పోస్ట్‌ పోల్ సర్వే అంటారు దాన్ని. ఆ సర్వేలో.. ఈ ప్రభుత్వానికే ఎందుకు ఓటు వేశారని అడిగితే ‘సంక్షేమ పథకాల కోసమే’ అని నిర్మొహమాటంగా చెప్పారు జనం. పైగా అధికారంలోకి ఎవరొచ్చినా సరే.. ఇంతకంటే ఎక్కువే ఇస్తారనే ధోరణి ప్రజల్లో కనిపించింది. ‘వైఎస్ జగన్‌ ఇంత ఇచ్చారు.. చంద్రబాబు అంత ఇస్తామంటున్నారు.. సో, ఎవరొచ్చినా పథకాలైతే ఆగవు కదా’ అనేశారు. అందులోనూ.. పార్టీలపై, నాయకులపై ప్రజల్లో కృతజ్ఞతా భావం తగ్గింది. ఫలానా ప్రభుత్వంపై గానీ, ఫలానా ముఖ్యమంత్రి విషయంలో గానీ రుణపడి ఉండడం అనేది తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారు. ఆరోగ్య శ్రీతో ఉచిత వైద్యం కల్పించారు. అప్పటి వరకు అలాంటి పథకాలను ఊహించనుకూడా లేదు జనం. అందుకే, కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా.. 2009లో రెండోసారి కూడా వైఎస్‌ గెలిచారు. కాకపోతే.. అవే పథకాలను తరువాత వాళ్లు కూడా కంటిన్యూ చేశారు. సో, అప్పుడు అర్థం అయింది జనానికి. రేప్పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా.. కచ్చితంగా ఈ పథకాలను అమలు చేస్తారు అనే ఆలోచన మొదలైంది. అందుకే, నవరత్నాలు అంటూ పథకాలకు ఓ బ్రాండ్‌ తీసుకొచ్చినా సరే.. ప్రజలు మాత్రం అవి జగన్‌ ఇస్తున్న సంక్షేమంగా చూడలేదు. అవి జగన్‌కు మాత్రమే సొంతం అనీ జనం అనుకోలేదు. రేప్పొద్దున ఎవరు వచ్చినా అవే పథకాలు కొనసాగుతాయని జనం నమ్మారు. అలా నమ్మారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు. సంక్షేమ పథకాలకు వైఎస్, వైఎస్ జగన్ బ్రాండ్‌ అంబాసిడర్లు అయితే.. డెవలప్‌మెంట్‌కి బ్రాండ్‌ నేమ్‌గా చంద్రబాబు కనిపిస్తారు. అయినా సరే.. జగన్‌ ఇస్తానన్న దాని కంటే ఎక్కువే ఇస్తామనే సరికి కూటమికే ఓట్లు వేశారు జనం. కారణం ఏంటి? ఒక్కటే కారణం.. రేప్పొద్దున ఎవరు వచ్చినా.. పథకాలు కొనసాగుతాయనే నమ్మకం.

పైగా ప్రజల్లో రాజకీయ స్పృహ బాగా పెరిగింది. జగన్ అయినా, చంద్రబాబు అయినా.. తెలంగాణలో కేసీఆర్ అయినా, ఇప్పుడు రేవంత్‌ అయినా.. ఉచిత పథకాల పేరుతో పంచేది వాళ్ల డబ్బులు కావు కదా అనే ఓ స్పృహతో ఉన్నారు. అవి జనం డబ్బు. అంటే తమ డబ్బు. మా డబ్బులు మాకు పంచుతున్నారు అనే వివేకం కలిగింది ప్రజల్లో. గత ఎన్నికల ముందు టీడీపీకి అనుకూలంగా వచ్చిన కొన్ని యాడ్స్‌ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఉన్న భావనను పోగొట్టడానికి కొందరు కొన్ని ప్రకటనలు, యాడ్‌ఫిల్మ్స్‌ తయారు చేశారు. ‘పథకాల పేరుతో పంచిపెడుతున్న డబ్బు.. జగన్‌ ఇంట్లోంచి తీసుకొస్తున్న డబ్బు కాదు’ అని ప్రచారం చేశారు. చెప్పడానికి కఠినంగానే అనిపించినా అదే నిజం కూడా. సో, పథకాలు ప్రకటించగానే గెలుస్తాం అని చెప్పడానికీ లేదు.

ఎన్నికలప్పుడు ప్రజలకు చాలా అందమైన మాటలు చెబుతాయి పార్టీలు. ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు.. ప్రభుత్వం చేస్తున్న అప్పులను చూపిస్తూనే ప్రజల్లో ఆశలు రేపుతారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాం అని ప్రచారం చేస్తారు. ఓవైపు అప్పు పెరుగుతోందని అంటున్నదీ వాళ్లే.. గెలిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటున్నదీ వాళ్లే.. అదెలా? ఈ ప్రశ్న వినిపించినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు చాలా అందమైన సమాధానాలు చెబుతాయి. ఇదిగో ఫలానా దగ్గర సేవ్‌ చేస్తే ఈ పథకం ఇవ్వొచ్చు. ఫలానా రూపంలో సంపద సృష్టిస్తే ఈ పథకాలు ఇవ్వొచ్చు అని చెబుతాయి. ‘మీకేం భయం లేదు.. మా దగ్గర యాక్షన్ ప్లాన్‌ ఉంది, పథకాలు అమలు చేస్తాం’ అని చాలా కన్విన్సింగ్‌గా చెబుతాయి. కాని, రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. సంపద సృష్టి జరగొచ్చు గాక. కాని అది వెంటనే జరిగిపోదుగా. రెండేళ్లో, ఐదేళ్లో పట్టొచ్చు. ఆ తరువాత ఆ సంపద నుంచి ఆదాయం పెరగొచ్చు. కాని, అంతకంటే ముందు జరగాల్సింది పథకాల అమలు. వచ్చీ రాగానే పథకాలు కావాలి, ఇవ్వాలి అనే అడుగుతారు జనం. సో, సంపద సృష్టించి, పథకాలు అమలు చేస్తాం అనే మాట కరెక్టే గానీ.. ఆ రెండింటికీ టైమ్‌ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈలోపు పథకాలు అమలు చేయాల్సిందే. సో, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంటుంది. ఓవైపు ఖజానాలో డబ్బు ఉండదు. కాని, ప్రజలకు వెంటనే పంచేయాలి. అంటే ఏం చేయాలి..? అభివృద్ధి పనులు ఆపేయాలి. లేదా ప్రజలపై భారం మోపాలి. అలా చేస్తే అల్టిమేట్‌గా నష్టపోయేది ప్రజలే. ప్రజలపై భారాలు మోపితేనే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. అలా చేశారనే కదా.. ‘బాదుడే బాదుడు’ నినాదాన్ని తీసుకొచ్చింది టీడీపీ. ప్రజల్లో కూడా ‘ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు’ అనే అభిప్రాయం ఏర్పడింది. ఒకవేళ ప్రజలపై భారం మోపకూడదు అనుకుంటే.. ఎడాపెడా అప్పులు చేయాలి. అలాంటప్పుడు గత ప్రభుత్వం చేస్తున్న తప్పే ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కదా. లేదా.. అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్‌ అవ్వాలి. ఏపీలో అదే జరిగిందంటారు రాజకీయ విశ్లేషకులు. సంక్షేమ పథకాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టే సరికి గత జగన్‌ సర్కార్‌ అభివృద్ధిని మ్యాచ్‌ చేయలేకపోయింది అనే విమర్శ ఎదుర్కొంది. సో, ఇలాంటి తలనొప్పులు రాకూడదని ముందు జాగ్రత్తగా ఓ మంచి సూచన చేశారు మల్లికార్జున ఖర్గే. హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ అనుమతిస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నారు. ఎందుకంటే.. డబ్బులేం ఊరికే రావు. అవేం ఆకాశం నుంచో ఊడిపడవు, చెట్లకు కాయవు. సో, ఉన్నంతలో ప్రజలకు ఎలా మేలు చేయగలమో ఆలోచించాలన్నారు మల్లికార్జున ఖర్గే. ఇప్పటికైనా.. ఖర్గే సూచనను ఓ అలారమ్‌గా తీసుకుని మేల్కొంటే మంచిదంటున్నారు మేధావులు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.