CJI NV Ramana: నాపై.. రావి శాస్త్రి రచనల ప్రభావం ఎంతో ఉంది.. జయంతి వేడుకల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
రావి శాస్త్రి రచనలకు ప్రభావితమై జీవన శైలిని నేర్చుకున్నానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. రావి శాస్త్రి పేదల పక్షాన నిలిచిన న్యాయవాది అంటూ కొనియాడారు.
CJI NV Ramana: ఏపీలోని విశాఖపట్నంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై రావిశాస్త్రి (Raavi Sastry) పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రావి శాస్త్రి రచనలకు ప్రభావితమై జీవన శైలిని నేర్చుకున్నానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. రావి శాస్త్రి పేదల పక్షాన నిలిచిన న్యాయవాది అంటూ కొనియాడారు. రావి శాస్త్రి కథల్లో సామాజిక స్పృహ ఉట్టి పడేదన్నారు. రావి శాస్త్రికి ప్రపంచస్థాయి గుర్తింపు రాకపోవడం బాధాకరమన్నారు. విశాఖపట్నంలోని అంకోసా హాల్‍లో రావి శాస్త్రి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీజేఐ ఎన్వీ రమణ చేతుల మీదుగా రచయిత ఓల్గాకు రాచకొండ విశ్వనాథ శాస్త్రి పురస్కారం అందజేశారు. అలాగే సీజేఐను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ రావి శాస్త్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మాండలికాలను నిలబెట్టిన దిట్ట రావి శాస్త్రి అని కొనియాడారు. రావి శాస్త్రి సూక్తులను, ఆయన చెప్పిన సత్యాలను శాశ్వతంగా గుర్తుండేలా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు సీజేఐ.
రాజద్రోహం కేసు సెక్షన్ 124 రద్దు నిర్ణయం వెనుక రావి శాస్త్రి ప్రభావం కూడా ఉండేదని, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని అప్పట్లోనే ఆయన సూచించేవారని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. రావిశాస్త్రి తన రచనల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించారనిన్నారు. సరిగా రాయని, అమలుకాని చట్టాల గురించి తన రచనల్లో ప్రస్తావించారన్నారు. తాను ఆగస్ట్ 27న పదవీ విరమణ చేస్తున్నానని, ఆ తర్వాత ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తానని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..