AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే దానం నాగేందర్ అదిరే ఆఫర్.. అది పట్టిస్తే రూ.5వేలు..

Danam Nagender: సంక్రాంతి పండుగ వేళ ప్రమాదకరమైన చైనా మాంజా వినియోగాన్ని అరికట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పక్షులకు, మనుషులకు ప్రాణాంతకమైన ఈ మాంజా వల్ల జరుగుతున్న అనర్థాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మాంజా విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే భారీ నగదు ఆఫర్ ప్రకటించారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ అదిరే ఆఫర్.. అది పట్టిస్తే రూ.5వేలు..
Mla Danam Nagender Unique Offer
Krishna S
|

Updated on: Dec 29, 2025 | 5:03 PM

Share

సంక్రాంతి పండుగ వేళ పతంగుల సందడి మొదలైంది. ఈ తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాంతకమైన చైనా మాంజా వినియోగాన్ని అరికట్టేందుకు ఆయన ఒక వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే తన సొంత నిధుల నుండి రూ.5,000 నగదు బహుమతి ఇస్తానని వెల్లడించారు. చైనా మాంజా కారణంగా జరుగుతున్న అనర్థాలపై దానం నాగేందర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “చైనా మాంజా కేవలం దారం కాదు.. అది ఒక మృత్యుపాశం. దీనివల్ల అమాయక పక్షులు గాలిలో ప్రాణాలు వదులుతున్నాయి. బైక్‌లపై వెళ్లే ప్రయాణికులు మెడకు తట్టుకుని తీవ్ర గాయాలపాలవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి” అని ఆయన అన్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా వ్యాపారులు లాభాపేక్షతో చైనా మాంజాను విక్రయిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే దానం హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి మాంజా అమ్ముతున్న షాపులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం నిజమని తేలితే వెంటనే రూ.5,000 నగదును బహుమతిగా అందజేస్తామన్నారు.

వ్యాపారులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ రకమైన దారాన్ని వాడుతున్నారో గమనించాలని దానం కోరారు. పర్యావరణానికి, ప్రాణాలకు హాని కలిగించే వస్తువులను బహిష్కరించి, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణరక్షణ కూడా అంతే ముఖ్యమని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..