Byreddy Rajasekhar Reddy: ‘అప్పర్ భద్ర’తో ఏపీ, తెలంగాణకు తీవ్ర అన్యాయం.. ఇకనైనా సీఎంలు స్పందించాలి..
అప్పర్ భద్రకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశారు బైరెడ్డి. రైతులతో కలిసి పాదయాత్ర మొదలుపెట్టారు. ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ కలిసి అప్పర్ భద్రను ఆపాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో అప్పర్ భద్ర డ్యామ్ నిర్మాణాన్ని ఆపకపోతే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులదే బాధ్యతని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.. ఒకవేళ అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌ను ఆపలేకపోతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పర్ భద్ర కంప్లీటైతే ఏపీ, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. తుంగభద్ర నికర జలాల పరిరక్షణ కోసం రైతులతో కలిసి పోరుబాట పట్టారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. కోస్గి దగ్గర తుంగభద్ర నదికి పూజలు నిర్వహించి RDS ఆనకట్ట నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు.
అప్పర్ భద్ర పూర్తయితే రాయలసీమతోపాటు తెలంగాణ కూడా ఏడారిగా మారుతుందంటున్నారు బైరెడ్డి. సాగునీటితోపాటు తాగునీటికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఇద్దరు సీఎంలు కలిసి ప్రధానితో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు బైరెడ్డి. అలాగే, RDS కుడి కాలువను కంప్లీట్‌చేసి తాగుసాగు నీరివ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
రాయలసీమ లో 52 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు వారికి కూడా అప్పర్ భద్ర ప్రాజెక్టు ను రద్దు చేయాలని వినతి పత్రాలు ఇచ్చామన్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించలేదని ఆయన అన్నారు. దీనిపై రాయలసీమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..