Andhra Pradesh: నర్సారావుపేట బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం.. తల్లి కళ్లెదుటే ఘోరం..
నర్సారావు పేటలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం అయ్యింది. పిల్లవాడు తల్లి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అదెలా చెప్పాలో తెలియక.. బాలుడు మిస్ అయ్యాడుంటూ..
నర్సారావు పేటలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం అయ్యింది. పిల్లవాడు తల్లి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అదెలా చెప్పాలో తెలియక.. బాలుడు మిస్ అయ్యాడుంటూ ఇరుగుపొరుగు వారికి అబద్ధాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా, నర్సరావుపేటలో ఒక సంవత్సరం వయసున్న బాలుడు.. మిస్ అయిన ఘటన కలకలం రేపింది. తన కొడుకు కనిపించడం లేదంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. బాలుడు నేలబావిలో పడి మృత్యువాత పడినట్లు గుర్తించారు. పిల్లవాడిని బావి పిట్టగోడపై కూర్చోబెట్టి, తల్లి ఆడిస్తుండగా.. జారి బావిలో పడ్డాడు ఏడాది వయస్సున్న పసివాడు. కళ్ళముందే పసివాడు కన్నుమూయడంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిన తల్లి బాలుడు కనిపించడం లేదంటూ చుట్టుపక్కల వారికి చెప్పింది. అయితే పోలీసుల విచారణలో అది ప్రమాదం అని బయటపడింది. బాలుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు పోలీసులు.
నరసరావుపేట రూరల్ పరిధిలోని స్థానికబ్యాంక్‌కాలనీకి చెందిన బండి వాసు, సాయిలక్ష్మీ దంపతులకు కూతురు మోక్ష(4), కుమారుడు భాను ప్రకాష్ (1 సంవత్సరం) ఉన్నారు. అయితే, కుమారుడు భానుప్రకాశ్ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో కనిపించకుండాపోయాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ వేగవంతం చేశారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో అంతా వెతికినా ఫలితం లేకపోయింది. నేరుగా డిఎస్పీ విజయ్ భాస్కరరావు తన పోలీస్ బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి అదృశ్యం అయిన ప్రదేశం, ఘటన జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ ఏరియాలో సీసీ ఫుటేజీని పరిశీలించారు. చివరకు కూతురు చేతుల్లోంచి పడి బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..