AP Weather Report: ఏపీలో ఎండలు భగభగ.. మరో మూడు రోజుల పాటు మాడు పగిలే ఎండలు! 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా వడగాల్పులు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది..
అమరావతి, ఏప్రిల్ 15: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా వడగాల్పులు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ.. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించలేక పోయాయి. దీంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల మళ్లీ మొదలై వడగాడ్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇవి సోమవారం నుంచి మరింత ఉదృతంకానున్నాయి. ఎండ వేడి వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నెల రోజుల పాటు ఎండలు , వడగాల్పులు తప్పవని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలంటు సూచనలు జారీ చేసింది.
కాగా ఆదివారం 35 మండలాల్లో వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచాయి. నేడు (సోమవారం) 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు,139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు (మంగళవారం) 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు,113 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో నేటి నుంచి వరుసగా మూడు రోజులు పలుచోట్ల 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు ఆ 31 మండలాలు ఇవే.. పార్వతీపురంమన్యంలో 10 మండలాలు, శ్రీకాకుళంలో 9 మండలాలు, విజయనగరంలో 8 మండలాలు, అల్లూరిలో 2 మండలాలు, కాకినాడలో 1 మండలం, తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 139 మండలాలు ఇవే.. శ్రీకాకుళంలో 17 మండలాలు, విజయనగరంలో 19 మండలాలు, పార్వతీపురం మన్యంలో 3 మండలాలు, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 10 మండలాలు, విశాఖపట్నం జిల్లాలో 3 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 18 మండలాలు, కాకినాడలో 16 మండలాలు, కోనసీమ జిల్లాలో 9 మండలాలు, తూర్పుగోదావరిలో 18 మండలాలు, పశ్చిమగోదావరిలో 3 మండలాలు, ఏలూరులో 11 మండలాలు, కృష్ణాలో 3 మండలాలు, ఎన్టీఆర్‌లో 5 మండలాలు, గుంటూరులో 2 మండలాలు, పల్నాడులో 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.