Global Investors Summit: ‘విశాఖ సమ్మిట్’పై ఏపీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దేశ చరిత్రలోనే మారువలేనిది అంటూ..
భారత పారిశ్రామిక దిగ్గజాలు అందరూ ఒకే వేదికపైకి వచ్చారని, ఈ సదస్సు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని..
రాష్ట్రాన్ని పాలించిన గత ప్రభుత్వాలు కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లు నిర్వహించాయని, కానీ విశాఖపట్నం వేదికగా ఈ నెలలో జరిగిన సదస్సు భారతదేశ చరిత్రలోనే మరువరానిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత పారిశ్రామిక దిగ్గజాలు అందరూ ఒకే వేదికపైకి వచ్చారని, ఈ సదస్సు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువత కలలు నెరవేరే రోజులు వచ్చాయన్నారు. ‘గత ప్రభుత్వాలు నిర్వహించిన సదస్సులకు ముఖేష్ అంబానీని రప్పించగలిగారా’ అని ప్రశ్నించారు. అంబానీ, ఆదానీ వంటి దిగ్గజాలను విశాఖపట్నంకు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే తీసుకురాగలిగామన్నారు. పారిశ్రామిక దిగ్గజాలు ఎందరో ఏపీకి క్యూ కట్టారన్నారు.
ఇంకా ఈ సందర్భంగా ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారుల్లో నమ్మకం, విశ్వాసం కల్పించారని తెలిపారు.విశాఖ ఇన్వెస్టర్స్ సదస్సులో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఎవరో చెబితే పారిశ్రామికవేత్తలు సమ్మిట్‌కి రారని.. స్థిరమైన ప్రభుత్వం, బలమైన నమ్మకం కలగడం వల్లే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని తెలిపారు.విశాఖపట్నం రాజధాని కాబోతోందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికపై నుంచే వెల్లడించారని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. విశాఖపట్నంకు త్వరలోనే మకాం మారుస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఒక్క ఒప్పందం కూడా అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో భరోసా ఇవ్వలేకపోయారని, అందువల్లే అవన్నీ రద్దయి పోయాయని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..