Andhra Pradesh: ఏపీలో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి.. వ్యూహాలకు పదును పెడుతోన్న నాయకులు
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల వరకూ అందేలా ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక వృద్దాప్య పెన్షన్‌లు కూడా ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే జనవరి నుంచి మూడు వేలకు పెంచాల్సి ఉందని చెబుతున్నారు. ఇలా అన్ని హామీలు మాట తప్పకుండా పూర్తిచేయాల్సి ఉంది కాబట్టి ముందస్తు ఊసే లేదని అంటున్నారు.ఇటీవల కూడా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే స్వయంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

విజయవాడ, జులై 08: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే అప్పుడే ఎన్నికలు వచ్చేసాయా అనే వాతావరణం కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏప్రిల్ 2024లో జరగాల్సి ఉన్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని అధికార పార్టీ మినహా మిగిలిన పార్టీలు అంచనాలు వేస్తున్నాయి. అయితే తాము ముందుగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే చెప్పుకొస్తుంది.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల వరకూ అందేలా ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక వృద్దాప్య పెన్షన్‌లు కూడా ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే జనవరి నుంచి మూడు వేలకు పెంచాల్సి ఉందని చెబుతున్నారు. ఇలా అన్ని హామీలు మాట తప్పకుండా పూర్తిచేయాల్సి ఉంది కాబట్టి ముందస్తు ఊసే లేదని అంటున్నారు.ఇటీవల కూడా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే స్వయంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా ఖండించారు.కానీ ముందస్తు లేకపోయినా 2024 కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటుండటంతో ఎన్నికల కోలాహలాన్ని తలపిస్తుంది.
వ్యూహాలకు పదును పెడుతున్న ముఖ్య పార్టీల నేతలు..
ఎన్నికల వేడిలో ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలో విశాఖకు షిప్ట్ కానున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలును బహిరంగ వేదికల ద్వారా ప్రజల మధ్యే నిర్వహిస్తున్న సీఎం జగన్…ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ లు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.ఎన్నికల క్యాంపెయిన్ మాదిరిగా ప్రభుత్వం చేసిన మంచిని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బహిరంగ సభలను వేదిక చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఇక పార్టీ ముఖ్య నేతలతో అధినేత సమావేశాలు నిర్వహిస్తుండగా సెకండ్ కేడర్ తో సజ్జల రామకృష్ణా రెడ్డి మీటింగ్ లు పెట్టి ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఓవైపు సీఎం జగన్…మరోవైపు సజ్జల ఎవరికి వారు పార్టీని, కేడర్‌ను పరుగులుపెట్టిస్తున్నారు.




ఇక తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కొంతకాలంగా ప్రజల్లోనే ఉంటున్నారు. తనయుడు లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తుండగా చంద్రబాబు సైతం ఏదోఒక కార్యక్రమం ద్వారా జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. గతంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరిట రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్లారు.ఆ తర్వాత భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సభలు నిర్వహించారు. తాజాగా సాగునీటి ప్రాజెక్ట్ ల సందర్శనతో ఎన్నికల హీట్ మరింత పెంచేశారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌ల పర్యటనకు వెళ్లడం, ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం విఫలం అయిందంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు వరుస పర్యటనలతో తెలుగుదేశం పార్టీ కేడర్ లో కూడా కొత్త ఊపు కనిపిస్తుంది. చంద్రబాబు విమర్శలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్ లు ఇస్తుండటంతో ప్రాజెక్ట్ ల పర్యటనలు కాస్తా ఎన్నికల పర్యటనలుగా మారిపోయాయి.
మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం వారాహి యాత్రలతో పార్టీ నేతలు, కార్యకర్తలను ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లిపోయారు. ఇప్పటికే రెండు విడతల యాత్ర పూర్తి చేసిన పవన్ కళ్యాణ్… ఆగస్ట్ 10 వ తేదీ నుంచి విశాఖపట్నం నుంచి మూడోవిడత ప్రారంభించనున్నారు. ఓవైపు వారాహి టూర్ మధ్యలో పార్టీ నేతలతో సమావేశాలు, జాయినింగ్స్.. ఇలా జనసేనలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. తాజా సభలు,సమావేశాలతో పూర్తిస్థాయిలో కేడర్ లో మార్పు కనిపిస్తుంది. బీజేపీ కూడా తన బలాన్ని సొంతంగా పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. త్వరలో ప్రజా సమస్యలపై ఒక్కొక్కటిగా ఆందోళన చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వంపై పోరాటాలతో బీజేపీ కేడర్ ను మళ్లీ యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు పురంధేశ్వరి. గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజిని భారీగా పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. కమలానికి కొత్త దళపతి రాకతో పార్టీ శ్రేణుల్లో ఎలక్షన్ మూడ్ కనబడుతుంది.
పొత్తుల సంగతి తర్వాత…ముందు జనంలోనే ఉండాలంటున్న నేతలు.
ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలు గతానికంటే భిన్నంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించడంతో వైఎస్సార్ సీపీని ఢీకొట్టడం ఇతర పార్టీలకు అంత సులువు కాదు. దీంతో వైసీపీని గద్దె దించేందుకు పొత్తులు తప్పనిసరని జనసేన, తెలుగుదేశం పార్టీలు చెబుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తు ఉన్నప్పటికీ రెండు పార్టీలు కలిసి ఎలాంటి పోరాటాలు చేయడం లేదు. అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఎవరికి వారు సొంతంగా వారి బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. దీనికోసం వీలైనంత ఎక్కువగా ప్రజల్లోనే ఉండేలా అన్ని పార్టీలు నిర్నయించాయి. వైసీపీ మాత్రం తాము సింగిల్ గానే వెళ్తామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. కానీ బీజేపీ, టీడీపీ, జనసేనలు మాత్రం పొత్తుల విషయంలో ఎన్నికల సమయం వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. మరి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా…? లేక ఏయే పార్టీలు కలిసి వెళ్తాయనేది ఇప్పుడే అవసరం లేదంటున్నారు ఆయా పార్టీల నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..