Tomato Price in Hyderabad: సామాన్యుడికి ఊరట..! దిగొస్తున్న టమాటా ధరలు.. ప్రస్తుతం కిలో టమాట ధర ఎంతంటే..
హైదరాబాద్‌కు దిగుబడి అవుతోన్న టమాటా హోల్‌సేల్ మార్కెట్లో డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి మొదటి, రెండో రకంగా విభజించి వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు ధర నిర్ణయిస్తారు. నిర్ణయించిన ధర ప్రకారమే రైతుబజార్లలో అమ్మాలని ఆదేశిస్తారు. ఐతే వ్యాపారులు మాత్రం అన్ని రకాల టమాటాలకు ఒకే విధమైన ధర తీసుకుంటున్నారు. ధరల పట్టికలో కూడా మొదటి రకానికి చెందిన ధరలనే మార్కెట్లో ప్రదర్శిస్తారు. దీంతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు..
హైదరాబాద్, ఆగస్ట్ 8: మొన్నమొన్నటి వరకూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్న టమాట ధరలు తగ్గుతున్నాయి. గడచిన రెండు రెండు రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకూ కిలో టమాట రూ.300 వరకు చేరే అవకాశం ఉందని బెంబేలెత్తిపోతున్న తరుణంలో అనూహ్యంగా ధరలు దిగివచ్చాయి. ప్రస్తుతం రైతుబజారులో కిలో టమాటా రూ.63 వరకు విక్రయిస్తు్న్నారు. ఇక బయట మార్కెట్‌లలో రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. గత పది రోజుల కిందట హైదరాబాద్ నగరానికి కేవలం 850 క్వింటాళ్ల టమాట హోల్‌సేల్ మార్కెట్‌కు చేరితే.. సోమవారం 2,450 క్వింటాళ్లు వచ్చింది. ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక రాష్ట్రం నుంచి నగరానికి అధిక దిగుబడి వస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మార్కెట్‌కు టమాటా రావడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆగస్టు నెలాఖరుకు కిలో రూ.50లోపు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్లో డిమాండ్ ఆధారంగా ధరల నిర్ణయం
హైదరాబాద్‌కు దిగుబడి అవుతోన్న టమాటా హోల్‌సేల్ మార్కెట్లో డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి మొదటి, రెండో రకంగా విభజించి వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు ధర నిర్ణయిస్తారు. నిర్ణయించిన ధర ప్రకారమే రైతుబజార్లలో అమ్మాలని ఆదేశిస్తారు. ఐతే వ్యాపారులు మాత్రం అన్ని రకాల టమాటాలకు ఒకే విధమైన ధర తీసుకుంటున్నారు. ధరల పట్టికలో కూడా మొదటి రకానికి చెందిన ధరలనే మార్కెట్లో ప్రదర్శిస్తారు. దీంతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మొదటి రకం టమాటా కిలో రూ. 63 నిర్ధారించి బోర్టుల్లో పేర్కొన్నారు. రైతుబజార్లలో ఈ మేరకు ధరల పట్టీ పెట్టినా దుకాణదారులు కిలో రూ.100 లకు ఏమాత్రం తగ్గకుండా అమ్ముతున్నారని మార్కెట్‌లకు వెళ్లే కొనుగోలు దారులు వాపోతున్నారు.
అటు ఏపీలోనూ మార్కెట్‌లలో ధరలు రూ.100 నుంచి రూ.65 వరకు తగ్గిపోయాయి. అనూహ్యంగా ధర తగ్గడంతో రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కెట్‌లలో టమాటా ధరలు తగ్గినా ఇతర రాష్ట్రాలకు మాత్రం ఎగుమతులు జోరందుకున్నాయి. అనంతపురం మార్కెట్‌లో మొదటి రకం టమాట కిలో రూ.110, రెండో రకం రూ.90, మూడో రకం రూ.75 చొప్పున పలికాయి. 15 కిలోల బుట్ట మొదటి రకం రూ.1650, రెండో రకం రూ.1350, మూడో రకం రూ.1125 చొప్పున ధర పలికింది. మరోవైపు అన్నమయ్య జిల్లాలోనూ రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 23 కేజీల బాక్సు ధర ఆదివారం టమాటా నాణ్యతను బట్టి రూ.1500 నుంచి రూ.2300 వరకు ధర పలికింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.