AP News: ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మూడేళ్లలో ప్రభుత్వం టార్గెట్ ఇదే..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద రానున్న మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు, లబ్ధిదారుల గుర్తింపునకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముస్లిం మైనారిటీలకు రూ.50,000 అదనపు సాయం ప్రకటించడంతో పాటు గత ప్రభుత్వ పెండింగ్ బిల్లుల వసూలుకు ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులకు భారీ లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటికే 3 లక్షలకుపైగా ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాలు చేయించిన ముఖ్యమంత్రి.. రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ కీలక ఆదేశాలు ఇచ్చారు.
టార్గెట్ స్పష్టం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో 3 లక్షల గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 17 లక్షల ఇళ్లను వేగంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. “హౌసింగ్ ఫర్ ఆల్” కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి. ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. ఎటువంటి జాప్యం చేయకూడదు’’ అని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు.
లబ్ధిదారుల గుర్తింపులో పారదర్శకత
నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు లబ్ధిదారుల గుర్తింపులో పారదర్శకత పాటించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన లబ్దిదారులతో పాటు ఇంకా అర్హులైన వారిని గుర్తించి జాబితాలో చేర్చడానికి చేపట్టిన సర్వేను త్వరగా పూర్తి చేయాలి. అర్హులైన లబ్దిదారుల తుది జాబితాను తయారు చేసి గ్రామాల వారీగా ప్రదర్శించాలి. ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వాలని, స్థలం ఉన్న లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూడాలి.
ముస్లిం మైనార్టీలకు అదనపు సాయం
పీఎంఏవై హౌసింగ్ స్కీములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ వర్గాలకు అదనంగా నిధులు కేటాయిస్తున్న తరహాలోనే.. ఇప్పుడు ముస్లిం మైనార్టీలకూ అదనంగా రూ.50,000 చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీని కోసం 18 వేల ముస్లిం మైనార్టీ లబ్దిదారులకు రూ.90 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు.
నరేగా తరహాలో పెండింగ్ బిల్లులు రాబట్టండి
గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల కారణంగా 2014-2019 మధ్య చేపట్టిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించి పెండింగులో ఉన్న రూ.920 కోట్ల బిల్లులను మళ్లీ రప్పించేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. గతంలో నరేగా పనుల బిల్లులను కూడా ఇదే తరహాలో ఆపేయగా.. కేంద్రంతో సంప్రదించి వాటిని మళ్లీ పొందినట్టుగానే, ఈ పెండింగ్ బిల్లులను కూడా రప్పించేందుకు కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




