Chandrababu Arrest: రాజమండ్రి జైలులో చంద్రబాబును ఇలానే విచారించండి.. సీఐడీ బృందానికి కోర్టు కీలక ఆదేశాలు.

ఒక రోజు...రెండు కోర్టులు..మూడు జడ్జిమెంట్లు. స్కిల్‌ స్కామ్‌ కేసులో.. కోర్టుల్లో చంద్రబాబుకు షాకులు కంటిన్యూ అవుతున్నాయి. బాబు రిమాండ్‌ని పొడిగించాలని ఏసీబీ కోర్టు చెప్పిన కొద్దిసేపటికే...క్వాష్‌ పిటిషన్‌ని కొట్టేసింది ఏపీ హైకోర్టు. ఆ తర్వాత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని తీర్పు చెప్పింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంను ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. సీఐడీ కస్టడీ తర్వాత టీడీపీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి.

Chandrababu Arrest: రాజమండ్రి జైలులో చంద్రబాబును ఇలానే విచారించండి.. సీఐడీ బృందానికి కోర్టు కీలక ఆదేశాలు.
Chandrababu
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 22, 2023 | 10:11 PM

ఫ్రై డే నాడు మూడు తీర్పులు వ్యతిరేకంగా రావడంతో చంద్రబాబుకు న్యాయస్థానాల్లో వరుస షాకులు తప్పలేదు. చంద్రబాబుకు ఈ నెల 24 వరకు రిమాండ్‌ పొడిగించాలని మొదట ఏసీబీ కోర్టు ఆదేశించింది. రిమాండ్‌ మరో రెండురోజులు పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత హైకోర్టులో బాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే వాదిస్తే, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు.

స్కిల్‌ స్కామ్‌ కేసులో రిమాండ్‌ను సస్పెండ్ చేయాలని, ఎప్ఐఆర్‌ని కొట్టివేయాలంటూ చంద్రబాబు తరఫు లాయర్లు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. 4వేల డాక్యుమెంట్లు, 140మంది సాక్షులను విచారించిన తర్వాత క్వాష్‌ సాధ్యం కాదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో 17A పై ప్రొటెక్షన్‌ వర్తించదని, 2018కి ముందు నుంచే విచారణ జరుగుతోందని కోర్టు తెలిపింది. ప్రజా ప్రతినిధుల అరెస్టుకు సంబంధించి గవర్నర్‌ అనుమతి తీసుకోవాలంటూ 2018లో సవరణ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ కేసుకు 17A వర్తించదని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇక ఎప్ఐఆర్‌లో పేర్లు ఎప్పుడైనా పెట్టవచ్చంది కోర్టు. దీంతో బాబు తరఫు లాయర్ల వాదనలు వీగిపోయాయి.

ఇక హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ కొట్టివేతతో ఏసీబీ కోర్టులో విచారణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇరు వర్గాల వాదనలు ఇంతకుముందే విని, తీర్పు రిజర్వ్‌ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి…చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో రెండు రోజుల పాటు బాబును విచారించనుంది సీఐడీ.

విచారణ ఇలా చేయాలి..

చంద్రబాబు కస్టడీ ఆర్డర్‌లో కీలక అంశాలు ఇచ్చింది కోర్టు. శనివారం ఉదయం రాజమండ్రి జైల్ లో చంద్రబాబును విచారించనుంది సిఐడి బృందం. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించవచ్చు. ఉదయం 9:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు రోజులు పాటు విచారించవచ్చు. న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారించాలి.. విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేయాలి. దర్యాప్తు పై పూర్తి గోప్యత పాటించాలి.. సీల్డ్ కవర్లో కాపీని కొర్ట్ కు సమర్పించాలి. గంటలో ఐదు నిమిషాల పాటు చంద్రబాబు తన కౌన్సిల్ ని కలవచ్చు. విచారణ సమయంలో న్యాయవాదికి కనిపించేలా చంద్రబాబును విచారించాలి. విచారణలో న్యాయవాదులు జోక్యం చేసుకోకూడదు. విచారణ సందర్భంగా చంద్రబాబుకు అవసరమైన మెడికల్ సదుపాయం కల్పించాలి. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ విరామం ఇవ్వాలి. కస్టడీ కి తీసుకునే ముందు బాబు కు వైద్య పరీక్షలు చేయాలి. విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు. విచారణ లో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతించాలి. 9 మంది పోలీస్ సిబ్బందితోపాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లను అనుమతించాలి. 7 గురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చని తెలిపింది.

ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని మాత్రమే

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. హైకోర్టు తీర్పుపై నిపుణులతో చర్చిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు అవినీతి చేశారని కోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని మాత్రమే హైకోర్ట్‌ చెప్పిందన్నారు అచ్చెన్నాయుడు. అరెస్ట్‌ చేసిన రోజే 9 గంటలు విచారణ జరిపారని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు.

మరోవైపు న్యాయపోరాటంలో భాగంగా మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌. ఎప్పటికప్పుడు న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నారాయన. సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్నారు. రాజమహేంద్రవరం రావాలనుకున్నప్పటికీ .. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ తిరస్కరణతో పరిణామాలు మారి ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు లోకేశ్‌.

చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించడంతో ఈ నెల 25న సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం