రెండు రోజుల టైం.. 100కి పైగా ప్రశ్నలు.. చంద్రబాబుకు సీఐడీ ‘క్వశ్చన్’ పేపర్.!
సీఐడీకి పెద్దగా సమయం లేదు. కేవలం రెండు రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించేందుకు పక్కా వ్యూహంతో క్వశ్చన్ పేపర్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై శరపరంపరగా ప్రశ్నలను సంధించేందుకు సీఐడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
సీఐడీకి పెద్దగా సమయం లేదు. కేవలం రెండు రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించేందుకు పక్కా వ్యూహంతో క్వశ్చన్ పేపర్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై శరపరంపరగా ప్రశ్నలను సంధించేందుకు సీఐడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్లాన్ Aతో పాటు ప్లాన్ B కూడా సీఐడీ రెడీ చేసిందంటున్నారు. ఇక ఈ ప్రశ్నల బాణాలను ఎలా ఎదుర్కోవాలా అనే అంశంపై చంద్రబాబు కూడా తన లాయర్లతో మాట్లాడి రెడీ అయ్యారు. ఇంకొద్ది గంటల్లోనే రాజమండ్రి జైలు సాక్షిగా ప్రశ్నల సంగ్రామానికి తెర లేవనుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు విచారణకు సీఐడీ వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. చంద్రబాబు నుంచి సమాధానాలు ఎలా రాబట్టాలా అనేదానిపై సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఏసీబీ కోర్టు…చంద్రబాబును కేవలం రెండు రోజుల కస్టడీకి మాత్రమే ఇవ్వడంతో…సమయం తక్కువగా ఉన్నందున ఎక్కువ సమాచారం రాబట్టేందుకు పక్కా ప్రశ్నల ప్రణాళికతో ముందుకు సాగుతోంది సీఐడీ. శనివారం, ఆదివారం…రెండు రోజుల పాటు..ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాబును విచారిస్తారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి షెల్ కంపెనీలపై చంద్రబాబును ప్రశ్నించనున్నారు అధికారులు. చంద్రబాబు బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల నుంచి డబ్బు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వరకు ఎలా వచ్చిందో తేల్చడమే ఈ కస్టోడియల్ విచారణలో కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్ టెక్ అధిపతి ఖన్వేల్కర్‌తో చంద్రబాబు మీటింగ్‌లపైనా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముందు కొన్ని డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంచి ఆయనను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అప్రూవల్ లేకపోవడంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేసిందని చెబుతున్నారు. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో సీఐడీ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కలిపి విచారించేందుకు ఈ కేసులో ఉన్న మిగిలిన నిందితులను కూడా పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ప్రత్యేక బ్యారక్‌లో చంద్రబాబును విచారించనున్నారు అధికారులు. సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు, ఇద్దరు టైపిస్ట్‌లు, ఒక వీడియోగ్రాఫర్ విచారణలో పాల్గొంటారు. విచారించబోతున్న అధికారుల జాబితాను ఏసీబీ కోర్టుకు ఇప్పటికే సీఐడీ సమర్పించింది. మొత్తం 12మంది బృందానికి పర్మిషన్ తీసుకుంది సీఐడీ. ఇక ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకునేముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేస్తారు. బాబు వయసును, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణ చేయాలని, ఆయనను ఇబ్బంది పెట్టకూడదంటూ సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో ఫొటోలు, వీడియోలు బహిర్గతం చేయకూడదంటూ సీఐడీని కోర్టు ఆదేశించింది. ఇక విచారణ సమయంలో గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
కస్టడీ విచారణ సమయంలో చంద్రబాబు తరఫున ఇద్దరు న్యాయవాదులు ఉండడానికి అనుమతి ఇచ్చారు. అయితే వారు కొద్దిగా దూరంగా కూర్చుంటారని జైలు వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబుతో ఆయన న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. సీఐడీ అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో బాబుకు ఆయన బ్రీఫింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక విచారణ సందర్భంగా చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తారు. రాజమండ్రి జైల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని విచారించడం ఇదే తొలిసారి కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రబాబు విచారణ నేపథ్యంలో బాలకృష్ణతో పాటు టీడీపీ సీనియర్ నేతలంతా రాజమండ్రి చేరుకున్నారు. సీఐడీ ప్లాన్ – B కూడా రెడీ చేసిందని చెబుతున్నారు. చంద్రబాబు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా, మౌనంగా ఉన్నా…మరోసారి కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించాలని సీఐడీ భావిస్తోందని సమాచారం. ఇక విచారణ తర్వాత రిపోర్టును సీల్డ్ కవర్‌లో ఏసీబీ కోర్టుకు అందిస్తారు సీఐడీ అధికారులు.