AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shishu Mapan: నవజాత శిశువులకు స్మార్ట్ రక్షణ.. తాకకుండానే బరువు, ఎత్తు కొలిచే సరికొత్త AI యాప్..!

టెక్నాలజీ మారుతోంది.. దాంతో పాటే మన వైద్య విధానాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం చాట్ జీపీటీ, రోబోల గురించి విన్నాం. కానీ, ఇప్పుడు పుట్టిన నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోకి దిగింది. శిశువును చేత్తో తాకాల్సిన అవసరం లేదు.. టేపులు, వెయింగ్ మెషిన్లు అసలే వద్దు..! కేవలం మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్ కెమెరాతో ఒక్క వీడియో తీస్తే చాలు.. ఆ పాప లేదా బాబు బరువు ఎంత..? ఎత్తు ఎంత..? తల చుట్టుకొలత ఎంత ఉందో ఏఐ సెకన్లలో చెప్పేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సంచలన ప్రాజెక్టును ప్రకటించారు..

Shishu Mapan: నవజాత శిశువులకు స్మార్ట్ రక్షణ.. తాకకుండానే బరువు, ఎత్తు కొలిచే సరికొత్త AI యాప్..!
Shishu Mapan App in AP Healthcare
Sridhar Rao
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 8:40 PM

Share

ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘వాద్వానీ-ఏఐ’ రూపొందించిన ‘శిశు మాపన్’ యాప్‌ను ఇకపై క్షేత్రస్థాయిలో ఉపయోగించబోతున్నారు. ఆశా కార్యకర్తలు ఉపయోగించే అఫీషియల్ యాప్‌తో దీనిని అనుసంధానం చేయనున్నారు. సాధారణంగా శిశువు పుట్టినప్పటి నుంచి 42 రోజుల్లోపు ఆరు సార్లు (అంటే 3, 7, 14, 21, 28, 42వ రోజుల్లో) ఆశా కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి హెల్త్ చెకప్ చేయాలి. ఇప్పటివరకు బరువైన వెయింగ్ మెషిన్లు, ఇన్‌ఫాంటో మీటర్లు, టేపులు పట్టుకుని ఆశాలు ఇళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒక్కో ఇంటి దగ్గర 15 నిమిషాల సమయం పట్టేది. కొలతలు తీసేటప్పుడు శిశువులు ఏడవడం, సహకరించకపోవడం పెద్ద సమస్యగా మారేది. కానీ, ఇకపై ఈ ఇబ్బందులన్నీ తొలిగిపోనున్నాయి.

ఈ అత్యాధునిక ఏఐ టెక్నాలజీని మొదటగా డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఇందిరానగర్, కొప్పురావు కాలనీ, కాజా, ఎర్రబాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు, పెదవడ్లపూడి పీహెచ్‌సీ పరిధిలో ఈ ట్రయల్స్ రన్ అవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని శిశువుల శరీరతత్వానికి, ఎదుగుదలకు అనుగుణంగా ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ పనిచేయాలి. అందుకోసం సుమారు 1,000 మంది నవజాత శిశువుల ఆరోగ్య వివరాలను వీడియోల రూపంలో ఏఐ డేటాబేస్‌కు ఫీడ్ చేయనున్నారు. ఈ డేటాబేస్ సిద్ధం కావడానికి మరియు ఆశాలు, ఏఎన్ఎమ్‌లకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ యాప్ కేవలం వివరాలు నమోదు చేయడమే కాదు.. నవజాత శిశువుల్లో ఏవైనా ఎదుగుదల లోపాలు ఉన్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే గుర్తించేస్తుంది. వెంటనే సంబంధిత ప్రాంత మెడికల్ ఆఫీసర్‌కు ఆటోమేటిక్‌గా ఒక ‘అలర్ట్’ మెసేజ్ పంపుతుంది. దీనివల్ల డాక్టర్లు అలర్ట్ అయి, ఆ శిశువుకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. మొబైల్ కెమెరా ద్వారా తీసే ఈ వీడియో కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉండవని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ స్పష్టం చేశారు. మంగళగిరిలో రాబోయే ఫలితాలను బట్టి, త్వరలోనే ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఏఐ సాంకేతికతతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

Follow Us