విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. దీంతో విద్యార్ధులు పుస్తకాలు, బ్యాగులు దులిపే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వేసవి సెలవులను భారీగా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఉత్తర్వులు జారీ చేసింది..

జూన్ నెల ప్రారంభమైనా.. దేశంలోని పలు రాష్ట్రాలు ఇంకా నిప్పుల కుంపటిని తలపిస్తు్న్నాయి. మరికొన్ని రోజుల్లోనే వేసవి సెలవులు ముగియనుండగా.. పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత కొనసాగుతున్న కారణంగా పాఠశాలల వేసవి సెలవులను పొడిగించింది. ఈ మేరకు జూన్ 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ జూన్ నెల మొత్తం వేసవి సెలవులను కొనసాగించాలని ఆదేశించింది.
మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి విద్యాశాఖలు ఇప్పటికే జూన్ 4 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. ఇక ఏపీ, తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూళ్లు ప్రారంభించనున్నారు. అయితే వేసవి తీవ్రత మరింత ప్రభలంగా ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవులను నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున విద్యార్థులు పాఠశాలలకు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అందువల్ల విద్యార్థుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని నెల రోజుల పాటు సెలవులు కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అన్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ, జూన్ నెలలో మళ్లీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పంజాబ్ విద్యాశాఖ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ, పరిస్థితులు అనుకూలించిన తర్వాత పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




