Andhra Pradesh: పోస్ట్‌ ఎప్పటిదని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా..! తెరపై గ్రేడ్-2 నేతలే.. మున్ముందు ఇంకెవరో..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సోషల్ మీడియా పోస్టింగ్స్‌, అరెస్టులు షేక్ చేస్తున్నాయి. నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో సహా గతంలో షర్మిల, సునీత, విజయమ్మపై పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని కడప పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Andhra Pradesh: పోస్ట్‌ ఎప్పటిదని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా..! తెరపై గ్రేడ్-2 నేతలే.. మున్ముందు ఇంకెవరో..?
Social Media Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 12, 2024 | 9:45 PM

సోషల్‌ మీడియా అంటేనే ఉలిక్కిపడుతున్నారు కొంతమంది. ముఖ్యంగా ఏపీలో..! పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ అయిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ కొత్త మార్పు అయితే కనిపిస్తోంది. ఎంత వరకు నిజమో గానీ.. 15వేల మందికి నోటీసులు. ఏకంగా 200 మంది వరకు అరెస్ట్. ఒక్కొక్కరిపై కనీసం 20కి పైగా కేసులు. ఇదీ ప్రస్తుత పరిస్థితి అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్‌ చేస్తే.. ఏకంగా పార్టీ మొత్తం కదిలిపోతోంది. ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి వస్తున్నారు. ఒక ప్రజా సమస్యపై స్పందించడానికో, ఓ ఆందోళన చేయడానికో, ఓ ఉద్యమం నడపడానికి కూడా రానివాళ్లంతా పరిగెత్తుకొస్తున్నారిప్పుడు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్‌ చేస్తే అంత ఉలికిపాటా? ఎందుకని..? వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే.. ఆ లింక్‌ సజ్జల నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి మీదుగా ఇంకెటో వెళ్తోంది. అసలేం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో..? ఈ సోషల్‌ మీడియా అరెస్టులు ఇంకెంత దూరం వెళ్తాయి..? అసలు టార్గెట్‌ ఎవరు? ఫుల్‌ డిటైల్స్‌..

ఒక్క పోస్ట్‌ పెడితే.. అరెస్ట్‌ చేసేస్తారా? ఫలానా వ్యక్తికి ప్రభుత్వ విధానం నచ్చింది.. పోస్ట్‌ పెట్టాడు. ఇంకొకరికి నచ్చలేదు.. దాని మీదా పోస్ట్‌ పెట్టాడు. తప్పేముంది అందులో. అభిప్రాయం చెప్పడమే కదా. అంత మాత్రానికే అరెస్ట్‌ చేస్తారా? భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తారా? అభిప్రాయం చెబితే ఎవరూ ఏమీ అనరు. కాని, అంతకు మించి జరుగుతోందే..! అది కదా ప్రాబ్లమ్ ఇక్కడ. ‘రుషులు యజ్ఞయాగాదులు చేస్తుంటే.. రాక్షసులొచ్చి వాటిలో రక్తం పోసేవారు. అలాంటి జాతికి చెందిన వాళ్లు ఉన్నారట.. ఇప్పటికీ..!’ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్‌ చెప్పిన ఈ మాటలు విన్న తరువాత.. ‘సోషల్‌ మీడియాలో అభిప్రాయమే కదా చెప్పేది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే.. కడుపుకి అన్నం తినేవాళ్లెవరూ అలాంటి కామెంట్స్‌ చేయరు. కొన్ని కొన్నింటిని.. చదవడానికి, చూడ్డానికి, వినడానికి కూడా అసహ్యమేస్తుంది. అందుకేగా డీఐజీ కోయ ప్రసాద్‌ ఓ మాట అన్నారు. ఆ పోస్టుల్లో పెట్టిన రాతలు చదవడానికి తన సంస్కారం, విజ్ఞత అడ్డొస్తున్నాయని చెప్పింది. వాటిని చదవడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదన్నారంటే ఎంత జుగుప్సాకరమో ఆ కామెంట్లు. మనదేశంలో కాబట్టి క్షమించి వదిలేస్తున్నాం గానీ దుబాయ్‌ లాంటి దేశంలో అయితే.. రాళ్లతో కొట్టి చంపేస్తారనే మాట కూడా అన్నారు.

డీఐజీ కోయ ప్రసాద్‌ అంత మాట అనడానికి కారణాలున్నాయ్..! మందకృష్ణ మాదిగ తల్లిని తిట్టాల్సిన అవసరమేంటి? పవన్‌ కల్యాణ్‌ తల్లిని అంత దారుణంగా అవమానించాల్సిన అవసరమేంటి? భార్య, కూతురు, కోడలు, ఇంట్లోని ఆడవాళ్లను అడ్డుపెట్టి తిట్టాల్సినంత దారుణం ఏంటి? అదా భావప్రకటనా స్వేచ్ఛ..? చిరంజీవి కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్‌ కుమార్తెలు, నాగబాబు కుమార్తె లక్ష్యంగా కొన్ని ముఠాలు విష ప్రచారం చేశాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి కూడా. దీనిపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు స్పందించే తీరు కూడా మారింది. ఇప్పుడు సోషల్‌ మీడియా అంటేనే ఉలికిపాటు మొదలైంది. కొన్ని వందల మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ జాబితాలో కీలకమైన నేతలు కూడా ఉన్నట్టున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో పోస్టులు అభిమానంతో పెడుతుంటారు. లేదా.. ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి పెడుతుంటారు. కానీ.. ఏపీ పోలీసులు ఇందులో మరో కోణాన్ని చూపిస్తున్నారు. ‘ఆర్గనైజ్డ్ సోషల్‌ మీడియా’ అనే యాంగిల్‌ ఇందులో ఉందంటున్నారు. ఇంతకీ ఏంటీ ‘ఆర్గనైజ్డ్‌ సోషల్‌ మీడియా’.

మనందరికీ తెలుసు.. సోషల్‌ మీడియా విభాగం లేనిదే ఏ పార్టీ నడవడం లేదని. 2019లో వైసీపీ అంత బలంగా ప్రజల్లోకి చొచ్చుకొచ్చి, అధికారంలోకి రాగలిగిందంటే కారణం.. సోషల్‌ మీడియా విభాగం కూడా. అప్పట్లో విజయసాయిరెడ్డి నేతృత్వంలో చాలా యాక్టివ్‌గా నడిచింది ఈ డిపార్ట్‌మెంట్. ఆ తరువాత అధికారంలోకి వచ్చాక.. కాస్త పక్కకు పెట్టారు. దాదాపుగా కరోనా వచ్చి పోయేంత వరకు పెద్ద పట్టించుకోలేదనే చెప్పాలి. అలాంటి సమయంలో ఓ మార్పు జరిగింది. 2022లో వైసీపీ సోషల్‌ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్‌రెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచి కథ అంతా మారిపోయింది. దాని తాలూకు ఎఫెక్టే.. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కూడా. ఇలా అరెస్టులు చేశాకే.. ‘ఆర్గనైజ్డ్‌ సోషల్‌ మీడియా’ వ్యవహారం కూడా బయటపడింది.

వర్రా రవీందర్‌రెడ్డి.. ఈయన వైసీపీ కార్యకర్త. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కూడా. అధికారం చేతిలో ఉన్నంత వరకు ఒక్కోసారి ఏదైనా నడిచిపోతుంటుంది. బహుశా ఆ ధైర్యమే కాబోలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేశ్, పీసీసీ చీఫ్‌ షర్మిల, వైఎస్‌ వివేక కుమార్తె సునీత, వైఎస్ జగన్‌ తల్లి విజయమ్మ.. ఇలా అందరిపై పోస్టులు పెట్టారు. మామూలు కామెంట్లు కావు అందులో ఉండేవి. అత్యంత అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టారు వర్రా రవీందర్రెడ్డి. మొన్నామధ్య హనుమంతు అనే యూట్యూబర్.. తండ్రికూతుళ్ల అనుబంధాన్ని ఎంత కించపరుస్తూ మాట్లాడాడో చూశాం. దాదాపుగా అంతే స్థాయిలో పోస్టులు, కామెంట్లు పెట్టారు ఈ వర్రా రవీందర్‌రెడ్డి అనే సోషల్‌ మీడియా యాక్టివిస్టు. ఇంకోసారి జగన్‌కు గానీ, వైసీపీకి గానీ.. వ్యతిరేకంగా మాట్లాడాలంటే వణికిపోవాలనేంత రేంజ్‌లో దుర్భాషలు పెడుతూ పోస్టులు పెట్టేవారు.

కొన్నిరోజులుగా.. 

కొన్నిరోజులుగా ఈ సోషల్ మీడియా బ్యాచ్‌ని వెంటాడడం మొదలుపెట్టారు ఏపీ పోలీసులు. అందులో భాగంగానే వర్రా రవీందర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ సంచలనం కాకపోయినప్పటికీ.. అరెస్ట్‌ తరువాత ఆయన చెప్పిన విషయాలే సంచలనంగా మారాయి. అసభ్యకర పోస్టులు పెట్టడం వెనుక వైసీపీ పెద్దల పాత్ర ఉందనే విషయం బయటపడింది. ఎవరిని తిట్టాలి, ఎలా తిట్టాలి, ఎంత భయంకరంగా తిట్టాలనేది.. ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. ఈ స్క్రిప్ట్‌ ఎక్కడిది అని ఆరా తీస్తే.. వైసీపీ ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణా రెడ్డి కుమారుడు స‌జ్జల భార్గవ రెడ్డి దగ్గర తేలింది. ఇంతకాలం ఆ పోస్టులు, అందులోని బూతులన్నీ వైసీపీపై అభిమానంతో కార్యకర్తలు, అభిమానులు పెడుతున్నారనే అనుకున్నారు. కాని, చాలా ‘ఆర్గనైడ్జ్‌’గా చేశారని వర్రా అరెస్టుతోనే తెలిసింది. చంద్రబాబు, పవన్‌, లోకేశ్, అనిత.. వీళ్లను, వీరి కుటుంబ సభ్యులను ఎంతగా తిడితే అంతలా సజ్జల భార్గవ్‌ రెడ్డి కళ్లలో ఆనందం కనిపించేది. అందుకే అంతలా దుర్భాషలాడేవారు. ఈమాట ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా డీఐజీనే ప్రెస్‌మీట్‌లో చెప్పారు. 2020-22 మ‌ధ్య హైకోర్ట్ న్యాయ‌మూర్తుల‌కు వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టారు. తీర్పులు నచ్చనివాళ్లు, వైసీపీ అభిమానులే ఈ పని చేశారనే అనుకున్నారంతా. కాని, ఇది కూడా ‘ఆర్గనైజ్డ్’ అని ఇప్పుడే తెలిసింది. అంటే.. కావాలనే, స్క్రిప్ట్‌ ప్రకారమే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.

అదే సమయంలో మరో కొత్త విషయం కూడా బయటపడింది. వైసీపీ ప్రభుత్వాన్ని అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి ప్రభుత్వం నుంచి జీతాలు అందాయి. ఏపీ డిజిటల్ కార్పోరేషన్ నిధుల్ని వైసీపీ సానుభూతిపరులకు ఇచ్చారు. ప్రభుత్వం పథకాలు, వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెట్టిందే ఏపీ డిజిటల్ కార్పొరేషన్. కాని, ఈ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి వేల రూపాయల జీతాలు ఇచ్చి మరీ తమ ప్రత్యర్థులను తిట్టించారు. ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టుకి ఏకంగా 70 వేల రూపాయల జీతం ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి. ఈ విషయం కూడా పోలీసులు చెప్పిందే. ఒకవిధంగా.. ప్రత్యర్ధులను సోషల్‌మీడియాలో తిట్టడానికి ప్రజాధనం ఉపయోగించడం పెద్ద స్కామ్‌ అంటున్నాయి పోలీసు వర్గాలు. సో, రేప్పొద్దున ఉచ్చు ఇలా బిగుసుకోబోతోందన్నమాట.

ఇప్పటికే ఈ ‘ఆర్గనైజ్డ్‌ నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు. ఇక మిగిలింది అసలు సూత్రధారుల వైపు అడుగులు వేయడమే. ఇప్పటికైతే సజ్జల భార్గవ్‌ అజ్ఞాతంలో ఉన్నారు. భార్గవ్‌రెడ్డితో సహా కొందరు కీలకమైన యాక్టివిస్టులపైనా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. సో, సజ్జల భార్గవ్‌ను ప్రశ్నిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఓ అంచనా. ఇప్పటికే కొన్ని సెన్సేషన్స్ బయటికొచ్చాయి. వర్రా రవీందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు వెతుకుతున్న సమయంలో.. ఆయన బండి రాఘవరెడ్డితో చాటింగ్‌ చేసిన విషయం తెలిసింది. రాఘవరెడ్డి ఎవరో కాదు.. కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి పీఏ. వర్రా రవీందర్‌ దొరికిన తరువాత ఈ రాఘవరెడ్డితో సంబంధం ఏంటి నీకు అని ఆరా తీశారు పోలీసులు. వైఎస్‌ కుటుంబ సభ్యులను దుర్భాషలాడే విషయంలో ‘స్క్రిప్ట్‌’ తనకు రాఘవరెడ్డి నుంచే వచ్చేదని చెప్పుకొచ్చారు వర్రా. ఒక్కోసారి.. ఎంపీ అవినాశ్‌ రెడ్డి చెబుతుంటే.. వాటిని రాఘవరెడ్డి నోట్ చేసుకునే వారని.. అతను సోషల్‌ మీడియాలో ఎలా పోస్టులు పెట్టాలో డిక్టేట్‌ చేసేవారని చెప్పుకొచ్చారు. అంటే.. వైఎస్‌ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్‌ వివేకా కుమార్తె సునీతపై వర్రా రవీందర్‌ దారుణమైన కామెంట్లు పెట్టడానికి వెనక మరొకరి హస్తం ఉందని గట్టిగానే అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో ఇంకాస్త కూపీ లాగితే.. పెద్ద డొంకే బయటపడుతుంది. అందులో నో డౌట్.

షర్మిల సంచలన వ్యాఖ్యలు

అయితే.. వైఎస్ షర్మిల మాత్రం తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి కారణం వైఎస్‌ జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ గనక ఒక్కమాట చెప్పి ఉంటే.. తనపై వ్యక్తిత్వ హననం జరిగేదే కాదన్నారు.

ఇకపోతే.. రామ్‌గోపాల్‌ వర్మ అండ్‌ పోసాని కృష్ణమురళి. వీరిపై కేసులు నమోదు చేయడం ద్వారా నోటికి పనిచెప్పిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదనే సంకేతం పంపుతోంది కూటమి ప్రభుత్వం. వైపీసీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ‌్‌పై పోసాని కృష్ణమురళి ఎలాంటి కామెంట్స్‌ చేశారో అందరూ విన్నారు. కొన్నిసార్లు బూతులు కూడా అలవోకగా మాట్లాడేసేవారు. దీనిపై 2022లో కంప్లైంట్‌ కూడా అందింది. ఆ కేసును ఇప్పుడు యాక్టివేట్‌ చేశారు. సో, పోసానికి ఈ కేసు బిగుసుకునే అవకాశం లేకపోలేదు. ఇక రామ్‌గోపాల్‌ వర్మ. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో.. చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిపైన.. వారి క్యారెక్టర్‌ని కించపరిచేలా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేది కంప్లైంట్. సో, పోసాని, వర్మపై కూడా పోలీసుల నుంచి గట్టి యాక్షన్‌ ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.

ఓవరాల్‌గా.. కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసిన వారెవరీనీ వదిలిపెట్టడం లేదు ప్రభుత్వం. ఆ సిగ్నల్‌ ఆల్రడీ పంపించేసింది. ఒక్కొక్కరికి నోటీసులు అందుతుండడంతో.. ఉలిక్కిపడుతున్నారు. వర్రా లాంటి వారి అరెస్ట్‌ హైలెట్‌ అయింది కాబట్టి తెలిసింది గానీ.. చాలా మందిని అరెస్ట్ వివరాలు ఇంకా బయటకు రాలేదంటున్నారు వైసీపీ నేతలు. సో, సీన్‌ అర్థమైన కొందరు.. క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

ఇక్కడ మరో కీ-పాయింట్‌ చెప్పుకోవాలి. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులకి పార్టీ నుంచి సరైన సపోర్ట్‌ దొరకడం లేదు అనేది ఇక్కడ మెయిన్‌ పాయింట్. కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా యాక్టివిస్టును వెంటాడుతున్నారు పోలీసులు. చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఇంకొంత మంది తప్పించుకుని తిరుగుతున్నారు. కాని, వారికి న్యాయ సహాయం అందడం లేదన్న వాదన ఒకటి వినిపిస్తోంది. సజ్జల భార్గవ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది కాబట్టే ఈమాత్రం అయినా వైసీపీ నేతలు కదులుతున్నారని, అంతకుముందు తమను పట్టించుకున్న వాళ్లే లేరని తెగ ఫీలవుతున్నారు. ఈ సందర్భంలో కళ్లం హరిప్రసాద్ రెడ్డి వర్షన్‌ చెప్పుకోవాలిక్కడ. ఒకనాడు అనంతపురం క్లాక్ టవర్ దగ్గర పరిటాల ఫ్యామిలీపై తొడకొట్టి మీసం మెలేసిన వ్యక్తి ఈ కళ్లం హరిప్రసాద్ రెడ్డి. ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో తత్వం బోధపడింది. సాయం చేయడానికి పార్టీ తరపున ఎవరూ రాలేదేమో.. ఎవరూ అసభ్యకర పోస్టులు పెట్టొద్దని రిక్వెస్ట్‌ చేశారు. ఒకనాడు తిట్టమని చెప్పిన లీడర్లంతా బాగానే ఉంటారని.. కేసులు బుక్ అయితే నష్టపోయేది సామాన్యులేనని హితబోధ చేశారు.

బట్.. వైసీపీ నేతలు మాత్రం అలా ఫీలవడం లేదు. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు రెడీ అవుతోంది. నిజానిజాలు నిగ్గు తేల్చేలా న్యాయపోరాటం చేస్తామంటోంది వైసీపీ. అందులో భాగంగానే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి వివరాలు కావాలంటూ హెబియస్‌ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయబోతోంది. అంతేకాదు.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో.. వారి కుటుంబసభ్యులను పరామర్శించాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్.. నేరుగా జిల్లాల నేతలకు సూచించారు. దాని ఫలితంగానే.. జైలుకు వెళ్లి పరామర్శించడంతో పాటు జైళ్ల వద్ద ఆందోళన చేపడుతున్నారు వైసీపీ కీలక నేతలు.

వైసీపీకి అండగా నిలిచిన వారికి కచ్చితంగా న్యాయం జరిగి తీరాల్సిందేనంటున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఇంటూరి రవికిరణ్‌ అరెస్ట్‌ విషయంలో ఆమె సతీమణికి భరోసా దక్కడమే ఇందుకు ఉదాహరణ. స్వయంగా వైఎస్ జగనే భరోసా ఇచ్చారు. సో, యాక్టివిస్టులను కాపాడుకునేందుకు పార్టీ అన్నివిధాలా ప్రయత్నిస్తోందన్న సిగ్నల్‌ బలంగా పంపగలుగుతోంది వైసీపీ.

అయితే.. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. చంద్రబాబు, పవన్‌, లోకేశ్, అనిత.. ఇలా కూటమి నేతల కుటుంబాలను టార్గెట్‌ చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారు. మరి.. ఇదే దుర్భాలను వైఎస్ జగన్‌, వైఎస్‌ భారతి రెడ్డి కూడా ఎదుర్కొన్నారుగా.. వారికి న్యాయం చేయరా అనే ప్రశ్న వినిపిస్తోంది. పేర్ని నాని దీన్నే హైలెట్ చేశారు కూడా.

ఫైనల్‌గా ఒక్కమాట. అధికారం ఉంది కదా అని ప్రస్తుతం కొందరిని అరెస్ట్‌ చేయొచ్చు. అంతమాత్రాన దుర్భాషలు, దుష్ప్రచారాలు ఆగుతాయని చెప్పడానికి లేదు. ఎప్పుడూ కూడా నోటీసులు, కేసులు, అరెస్టులు ఇలాంటి సైకోయిజాన్ని ఆపలేవు. మరి దీనికి పరిష్కారం ఏంటి? రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకోవడమే దీనికి పరిష్కారం. పార్టీ కార్యకర్తల్ని నియంత్రణలో ఉంచేలా చేయడమే వన్‌ అండ్‌ ఓన్లీ సొల్యూషన్. షర్మిల, చంద్రబాబు ఓ మాట అన్నారు. ఏ పార్టీ వాళ్లైనా సరే.. తమ పార్టీపై, కార్యకర్తలపై నియంత్రణ ఉండాలి అని.

సో.. పాలిటిక్స్‌ను పాలిటిక్స్‌లాగే చూడాలి, విమర్శలు కూడా అలాగే ఉండాలి తప్పితే.. ఆడవాళ్లపై, కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టకుండా పార్టీలే లక్ష్మణ రేఖ గీసుకోవాలి. లేదంటే.. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.