కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! ఒకే ఒక్క గంటలో కాసుల వర్షం..
ఆరుగాలం పండించిన ఉల్లి పంటకి గిట్టుబాటు ధరలేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఓ రైతు మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించాడు. రేటు తక్కువగా ఉండటంతో దళారుల దగ్గరకు వెళ్లడం ఇష్టం లేక.. తన పంటను నేరుగా జనాల దగ్గరకే తీసుకెళ్లాడు. ఉల్లిపాయలను ట్రక్కులో తీసుకెళ్లి ఒకే ఒక్క గంటలో ట్రక్కు మొత్తం అమ్మేశారు..

కర్నూలు, డిసెంబర్ 8: ఆరుగాలం పండించిన ఉల్లి పంటకి గిట్టుబాటు ధరలేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఓ రైతు మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించాడు. రేటు తక్కువగా ఉండటంతో దళారుల దగ్గరకు వెళ్లడం ఇష్టం లేక.. తన పంటను నేరుగా జనాల దగ్గరకే తీసుకెళ్లాడు. ఉల్లిపాయలను ట్రక్కులో తీసుకెళ్లి ఒకే ఒక్క గంటలో ట్రక్కు మొత్తం అమ్మేశారు. కర్నూలు జిల్లాకు చెందిన కరీం అనే రైతు ఈ వినూత్న ప్రయోగం చేశాడు. ఉల్లి పంటను స్వయంగా అమ్మడంతో మంచి లాభాలు తెచ్చిపెట్టడంతోపాటు దళారుల చేతిలో మోసపోకుండా తనను తాను కాపాడుకున్నాడు. వివరాల్లోకెళ్తే..
కర్నూలు జిల్లాకు చెందిన కరీం అనే రైతు ఈ ఏడాది ఉల్లి సాగుచేశాడు. అయితే అక్కడి మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో దళారులు చెబుతున్న రేటుకు విక్రయిస్తే నష్టాలు తప్పవని గుర్తించారు. దీంతో తన పంటను దళారులకు అమ్మకుండా పంటనే నేరుగా తన సొంత వాహనంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ నేరుగా వినియోగదారులకే అమ్మేశాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ట్రక్కు సరుకుతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు వెళ్లాడు. ఇక్కడ ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 ఉంది. అయితే కరీం మాత్రం ఉల్లిని కేవలం రూ.15కే ఇస్తానని బోర్డు పెట్టాడు. అంతే దెబ్బకు జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. వచ్చినవారందరికీ పది కిలోలు రూ.150కి ఇచ్చేశాడు. దీంతో గంట వ్యవధిలోనే ట్రక్కులోని ఉల్లి మొత్తం అమ్ముడైంది. మంచి ధరకు బండి ఖాళీ అవడంతో కరీం సంతోషం వ్యక్తం చేశాడు. దళారులు ఇస్తామన్న దానికన్నా ఎక్కువగానే లాభం వచ్చిందని అన్నాడు.
సాధారణంగా మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దళారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేసి ఎక్కువ లాభాలకు అమ్ముకుంటున్నారని తెలిపాడు. తమ మార్కెట్లోనూ ఉల్లి ధర పడిపోవడంతో సొంత వాహనంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలకు వెళ్లి నేరుగా వినియోగదారులకే తన పంటను అమ్మాలని అనుకున్నట్లు తెలిపాడు. ఈ పద్ధతి ద్వారా రైతులు నేరుగా వినియోగదారులకు అమ్మితే మధ్యవర్తుల బెడద తగ్గి, రైతులకు మంచి ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డాడు. కరీం చర్య ఇతర రైతులకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దీంతో ఇతర రైతులు కూడా కరీం బాటలో ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ పంటను అమ్మి, లాభాలు అర్జిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




