AP Assembly: చంద్రబాబుతో పోలిస్తే ఎన్డీఆర్ పై తనకే గౌరవం ఎక్కువ.. శాసనసభలో సీఏం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
విజయవాడలో ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు అసెంబ్లీని కుదిపేసింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నా.. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ..
AP ASSEMBLY: విజయవాడలో ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు అసెంబ్లీని కుదిపేసింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నా.. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ సెప్టెంబర్ 21వ తేదీ బుధవారం శాసనసభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈబిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో టీడీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆతర్వాత సభలో ఈబిల్లుపై చర్చ జరిగింది. అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈబిల్లుపై సభలో మాట్లాడారు. ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని అన్నారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ గౌరవని.. తాను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదని, చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎన్టీఆర్ ఎక్కువ కాలం సీఎంగా ఉండేవారని అన్నారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదంటూ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే: దివంగత ఎన్టీఆర్ అంటే తనకెంతో గౌరవమన్నారు. అనవసరంగా గొడవలు చేసి.. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమని, వాళ్లు కూడా ఈ చర్చ సందర్భంగా ఉండి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎలాంటి కోపం లేదని, ఒకరకంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడు కంటే జగన్‌మోహన్‌రెడ్డినే ఎక్కువ గౌరవం ఇస్తాడని, ఏపొద్దు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదని గుర్తు చేశారు. పైగా ఎన్టీఆర్ మీద తనకు ఆప్యాయతే ఉందని, ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమూ నా తరపున ఏనాడూ జరగబోదని సీఏం సభకు తెలిపారు. నందమూరి తారకరామారావు అని పలకడం చంద్రబాబు నాయుడికి నచ్చదని, అదే చంద్రబాబు నోట వెంట నందమూరి తారకరామారావు అనే మాట వస్తే పైన ఉన్న ఎన్టీఆర్‌గారికి నచ్చదని పేర్కొన్నారు సీఎం జగన్. నటుడిగా, రాజకీయవేత్తగా గొప్పఖ్యాతి సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఏ పక్షాన ఉన్నా తమ తరపున ఏనాడూ ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనలేదని, పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టామని జగన్ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు.
పేదల దేవుడు వైఎస్సార్: పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాద మహాశిఖరం. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత వైఎస్.రాజశేఖర్ రెడ్డిదన్నారు. ఆ సమయంలో దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుందని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ విషయంలో ఆయన మీద ఎలాంటి కల్మషం లేదని, ఎవరూ అడగకపోయినా ఆయన పేరు మీద జిల్లా పెట్టామని, టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామని సీఎం జగన్ తెలిపారు. బాగా ఆలోచించే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని, మార్పు ముందు ఎన్టీఆర్ పేరు మార్చడం కరెక్టేనా అని తనను తాను ప్రశ్నించుకున్నానంటూ సీఎం జగన్ శాసనసభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..