AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buggana vs Kotla: పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలకు తెగించే రెండు కుటుంబాల మధ్య పోరు.. గెలుపెవరిది..?

అక్కడ జరుగుతున్నదీ పార్టీల మధ్య పోటీ కాదు. పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలకు తెగించే రెండు కుటుంబాల మధ్య పోరు. ఓ రకంగా యుద్ధం అని చెప్పవచ్చు. తండ్రులు, తాతల కాలం నుంచి వస్తున్న కుటుంబ గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని నిలుపుకునేందుకు జరుగుతున్న పోరే డోన్ అసెంబ్లీ ఎన్నికలు. కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్న డోన్ శాసనసభ ఎన్నికల తీరు, జరుగుతున్న ప్రచారం, ప్రత్యర్థుల మాటలతుటలపై స్పెషల్ పొలిటికల్ స్టోరీ.

Buggana vs Kotla: పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలకు తెగించే రెండు కుటుంబాల మధ్య పోరు.. గెలుపెవరిది..?
Kotla Surya Prakash Reddy Buggana Rajendranath
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 04, 2024 | 8:23 AM

Share

అక్కడ జరుగుతున్నదీ పార్టీల మధ్య పోటీ కాదు. పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలకు తెగించే రెండు కుటుంబాల మధ్య పోరు. ఓ రకంగా యుద్ధం అని చెప్పవచ్చు. తండ్రులు, తాతల కాలం నుంచి వస్తున్న కుటుంబ గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని నిలుపుకునేందుకు జరుగుతున్న పోరే డోన్ అసెంబ్లీ ఎన్నికలు. కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్న డోన్ శాసనసభ ఎన్నికల తీరు, జరుగుతున్న ప్రచారం, ప్రత్యర్థుల మాటలతుటలపై స్పెషల్ పొలిటికల్ స్టోరీ….

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గంగా ఉన్న డోన్.. జిల్లాల విభజనతో నంద్యాల జిల్లాలోకి చేరిపోయింది.1951లో కొత్త అసెంబ్లీగా ఏర్పడి 1952లో మొదటిసారి ఎన్నికలను ఎదుర్కొన్నది. మొట్టమొదటి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కొట్రిక వెంకటశెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1955లో జరిగిన ఎన్నికల్లో బేతంచర్లకు చెందిన బుగ్గన శేషారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈ బుగ్గన శేషారెడ్డి ముద్ర ఇప్పటికీ నియోజకవర్గంలో ఉంది. అప్పట్లోనే బేతంచర్లలో ఉచితంగా హాస్పిటల్స్, స్కూల్స్ సొంత డబ్బులతో నిర్మించి ఖ్యాతి పొందారు. నాడు నిర్మించిన హాస్పిటల్స్ పాఠశాలలు ఇప్పటికీ కూడా చెక్కుచెదరలేదు. అందుకే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదుతో శేషారెడ్డిని సత్కరించింది. ఆయన మనవడే నేటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా డోన్ నియోజకవర్గం నుంచి 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1978లో ప్రవేశించిన కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి డోనుకు విడదీయరాని బంధం ఉంది. 1978 నుంచి గత ఎన్నికల వరకు అంటే 2019 వరకు కేఈ కుటుంబీకులు పోటీ చేస్తూ వస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి ఐదుసార్లు ప్రభాకర్ రెండుసార్లు కేఈ ప్రతాప్ రెండుసార్లు డోన్ నుంచి పోటీ చేశారు. ఇక కోట్ల కుటుంబం నుంచి కూడా రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన కోడలు కోట్ల సుజాత, సోదరుని కుమారుడు కోట్ల హరి చక్రపాణి రెడ్డి పోటీ చేయగా ఈసారి కోట్ల తనయుడు కేంద్ర మాజీ మంత్రి సూర్య ప్రకాష్ రెడ్డి తలపడుతున్నారు. అలా.. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఏకంగా రాష్ట్రపతిని అందించిన డోన్ నియోజకవర్గం ఖ్యాతి నలు దిశల వ్యాపించింది. కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అని విమర్శలను ప్రచారం కూడా డోన్ మూటగట్టుకుంది. అలాంటి తరుణంలో వైసీపీ ఆవిర్భావం, బుగ్గన ప్రవేశంతో డోన్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. బుగ్గనకు ముందు బుగ్గన తర్వాత అన్నట్లుగా మారిపోయింది.

2014 ఎన్నికలలో ఏపీలోనే మొట్టమొదటి అసెంబ్లీ అభ్యర్థిని డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. డోన్‌లో దశాబ్దాలుగా పాతుకుపోయిన కోట్ల కేఈ కుటుంబాలను ఢీకొంటారని బహిరంగ సభలో జగన్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా డోన్ నియోజకవర్గం ను ఒక మోడల్ అసెంబ్లీగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఆ ప్రకటనే డోన్ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. 2014, 2019 లో కూడా బుగ్గన తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు. ఆర్థిక మంత్రిగా ఐదేళ్లు పాటు కొనసాగారు. రెండేళ్లు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ మిగిలిన సమయంలో డోన్ ఎంతో ప్రగతి సాధించింది అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

నియోజకవర్గంలోని బేతంచర్ల , డోన్, ప్యాపిలి మండలాల్లో ప్రత్యేక ప్రగతి సాధించింది. ఇలాంటి పరిస్థితులలో టీడీపీ నుంచి ఇంచార్జిగా ఉండటానికి అటు కోట్ల ఇటు కేఈ కుటుంబాల నుంచి ఎవరూ ముందుకు రాని పక్షంలో సుబ్బారెడ్డిని చంద్రబాబు నాయుడు ఇంచార్జిగా, అభ్యర్థిగా కూడా ప్రకటించారు. సుబ్బారెడ్డిని కొందరు వ్యతిరేకించడంతో చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని మార్చుకుని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని రంగంలోకి దించారు. సూర్య ప్రకాశ్ రెడ్డికి, ఆయన కుటుంబానికి నిజాయితీపరుడు అని పేరుంది. బుగ్గనను ఢీ కొట్టాలంటే కోట్ల, కేఈ కుటుంబాలతో పాటు సుబ్బారెడ్డి లాంటి ఉద్దండులను చంద్రబాబు ఏకం చేసి యుద్ధానికి సిద్ధం చేశారు.

అటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సై అంటూ కదం తొక్కుతున్నారు. కేఈ ఫ్యామిలీ, సుబ్బారెడ్డి వర్గాల మద్దతుతో సూర్యప్రకాశ్ రెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే సుజాత, కూతురు నివేదిత, కొడుకు రాఘవేంద్ర రెడ్డి ప్రతి ఇంటి గడపను చుట్టేస్తున్నారు. ఇటు బుగ్గన తోపాటు కొడుకు అర్జున్ రెడ్డి కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే డోన్ నియోజకవర్గంలో కోట్ల, కేఈ వర్గాలే ఉండేవి. వైసీపీ రాకతో కాంగ్రెస్ కనుమరుగై ఆ పార్టీలో ఉన్న కోట్ల వర్గం మొత్తం బుగ్గనను ఆశ్రయించింది. 15 ఏళ్ల తర్వాత కోట్ల తిరిగి డోన్ చేరికతో రాజకీయం సరికొత్త రూపును సంతరించుకుంది. కేఈ వర్గంపై టీడీపీ కేడర్‌పై కోట్ల ఆధారపడాల్సి వచ్చింది.

పోలింగ్‌కు ఇంకా 40 రోజులు సమయం ఉన్నప్పటికీ అప్పుడే డోన్ అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర సమరాన్ని తలపిస్తున్నాయి. ఎండలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రతి గడపను చుట్టేస్తున్నారు నేతలు. పెద్దలు అందించిన రాజకీయ వారసత్వాన్ని, పరువు ప్రతిష్టల్ని భవిష్యత్తు తరాలకు అందించే ఏకైక లక్ష్యంతో బుగ్గన, కోట్ల కుటుంబాలు గెలుపే లక్ష్యంగా కాలికి బలపం చుట్టుకున్నట్లుగా సర్వసక్తులు ఒద్దుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీల మధ్య కాకుండా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న రాజకీయ పోరు ప్రత్యక్ష యుద్ధాన్ని తలపిస్తున్నదని చెప్పవచ్చు. ఉన్న వర్గీయులు చేజారకుండా కొత్తవారిని చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాయి.

ఇక వ్యవసాయంతో పాటు కొంత మైనింగ్ కూడా నియోజకవర్గంలో ప్రధాన ఉపాధి. ముస్లింలు, రెడ్డి, కాపులు, వైశ్యులు, బోయ, కురుబా, బెస్త, ఎస్సీలు ఇక్కడ అన్ని వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకులుగా ఉన్నాయి. గత ఎన్నికలలో వైసీపీ హవాలో మొత్తం బుగ్గనకు ఓటెత్తింది. 35 వేల ఓట్లకు పైగా మెజారిటీ బుగ్గన సొంతం చేసుకున్నారు. ఈసారి అభివృద్ధి చేసినందున మరింత ఎక్కువ మెజార్టీ సాధించాలని బుగ్గన భావిస్తున్నారు. ఓటర్లతో పాటు బుగ్గన అనుచర వర్గంలో కూడా వ్యతిరేకత ఉన్నదని, ఈసారి తనదే విజయం అని కోట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా.. కోట్ల, కేఈ వర్గాలు తలపడే డోన్‌లో ఈసారి ఆ రెండు వర్గాలు ఏకమైనందున, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నందున తనదే విజయం అంటున్నారు కోట్ల.

పనిలో పనిగా ఇద్దరు రాజకీయ ఉద్దండల మధ్య మాటలతోటాలు పేలుతున్నాయి. ప్రచారం తప్ప అభివృద్ధి లేదని కోట్ల అంటుంటే, కోట్ల, కేఈలు కలవడమే వారు చేసిన అభివృద్ధి అంటూ మంత్రి బుగ్గన ఎద్దేవా చేస్తున్నారు. ఉద్దండులు ఏలిన డోన్ లో మరోసారి పాగా వేసేందుకు ఆ ఇద్దరు ఉద్దండుల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష పోరు సమరం. పోలింగ్ దగ్గర పడే కొద్ది మరింత రసవత్తరంగా మారింది. రానున్న ఎన్నికలలో ప్రజాబలం ఎవరిది అనేది ఉత్కంఠ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..