PM Modi: వికసిత్ భారత్ లక్ష్యం.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
ఢిల్లీలో జరిగిన నేషనల్ సెక్రటరీల సమావేశంలో ఆదివారం ప్రధాని మోదీ మాట్లాడారు. ఆత్మనిర్బర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా వేగవంతంగా అడుగులు వేయాలని సూచించారు. ఇందుకు అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని, అందరూ కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని మోదీ పిలుపునిచ్చారు.

ఆదివారం ఢిల్లీలో జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పాలన, డెలివరీ, తయారీలో నాణ్యత, శ్రేష్టతకు వికసిత్ భారత్ పర్యాయపదమని వ్యాఖ్యానించారు. యువత బలంతో భారత్ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను అధిరోహించిందని ప్రశంసించారు. గ్గోబల్ ఎక్స్‌లెన్స్, పోటీతత్వానికి మేడిన్ ఇండియా ఓ చిహ్నంగా ఉండాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మోదీ.. జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ పట్ల మన నిబద్దతను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి దేశీయ తయారీ కోసం 100 ఉత్పత్తులను గుర్తించాలని సూచించారు.
త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న జాతీయ తయారీ మిషన్‌కు అన్ని రాష్ట్రాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తయారీని ప్రోత్సహించడం, సులభతర వ్యాపారాన్ని పెంచడం వల్ల భారత్‌ను ప్రపంచ సేవల దిగ్గజంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా భారత్‌ను సృష్టించేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడం, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడంలో ఈ సమావేశం ఓ నిర్ణయాత్మక అడుగుగా అభివర్ణించారు. వికసిత్ భారత్ కోసం మానవ మూలధనం అనే థీమ్‌ను ఈ ఏడాది రూపొందించినట్లు తెలిపారు. ఇండియాను ఆత్మనిర్భర్‌గా మార్చడానికి, పేదలకు సాధికారత కల్పించడానికి అందరూ సమిష్టిగా పని చేయలన్నారు.
భారత్ యువత బలంతో నడిచేదని, వీరిని శక్తివంతం చేయడం ప్రభుత్వ కీలక ప్రాధాన్యతగా మిగిలిపోయిందని ప్రధానమంత్రి అన్నారు. దేశం ప్రధాన ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడం వైపు స్థిరంగా అడుగులు వేస్తున్న సమయంలో ఈ సమావేశం జరుగుతోందన్నారు. ఉన్నత విద్యలో అధిక నాణ్యత గల ప్రతిభను సృష్టించడానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత జీవనోపాధి కోసం పర్యాటకం భారీ పాత్ర పోషించగలదన్నారు. భారత్ గొప్ప వారసత్వం, చరిత్రను కలిగి ఉందని, ప్రపంచ పర్యాటక ప్రదేశాలలో అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉందని మోదీ అన్నారు. కాగా డిసెంబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఢిల్లీలో ఈ సెక్రటరీల సమావేశం జరిగింది. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ గురించి ఇందులో సుదీర్ఘంగా చర్చించారు.
