నిద్ర రావట్లేదని బాధపడుతున్నారా? అది తింటే నిద్ర ముంచుకొస్తుందనే వార్తల్లో నిజమెంత
ఆరోగ్యంగా ఉండాలని జిమ్‌కు వెళ్తాం, పౌష్టికాహారం తింటాం, చర్మ సౌందర్యం కోసం స్కిన్‌కేర్ రూటీన్ ఫాలో అవుతాం. కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య నిద్రలేమి. అర్ధరాత్రి వరకు మొబైల్ స్క్రోలింగ్ చేయడం, ఓవర్ థింకింగ్ వల్ల నిద్ర మనకు దూరమవుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వింత ట్రెండ్ వైరల్ అవుతోంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా వెన్న తింటే నిద్ర బాగా పడుతుందని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతమైన నిద్ర ఒక లగ్జరీగా మారిపోయింది. సోషల్ మీడియాలో నిద్రకు సంబంధించి రోజుకో కొత్త చిట్కా వైరల్ అవుతుంటుంది. అందులో ఇదొకటి.. పడుకునే ముందు ఒక చెంచా వెన్న తినడం. బయోహ్యాకర్లు, వెల్నెస్ బ్లాగర్లు ఈ విధానాన్ని తెగ ప్రమోట్ చేస్తున్నారు. వెన్న తినడం వల్ల రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని, దీనివల్ల నిద్ర మధ్యలో మెలకువ రాదని వారి వాదన. మరి దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో తెలుసుకుందాం..
వెన్న నిద్రను నేరుగా ప్రేరేపిస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, కొందరు రాత్రిపూట ఆకలి వల్ల నిద్ర మధ్యలో లేస్తుంటారు. శరీరంలో శక్తి తగ్గినప్పుడు మెదడు మనల్ని నిద్రలేపుతుంది. వెన్నలో ఉండే అధిక కొవ్వు పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల ఆకలి వల్ల వచ్చే నిద్ర భంగం తప్పుతుంది.
రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, శరీరం కార్టిసోల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. వెన్న వంటి కొవ్వు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అన్షుల్ సింగ్ పేర్కొన్నారు. అయితే, కేవలం వెన్న మాత్రమే కాకుండా కొద్దిగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్త తప్పనిసరి..
వెన్న అందరికీ సరిపడదు. ముఖ్యంగా ఈ క్రింది సమస్యలు ఉన్నవారు పడుకునే ముందు వెన్న తినడం మానుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు సాచురేటెడ్ ఫ్యాట్స్ కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు కొవ్వు పదార్థాలు తింటే గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. పాల పదార్థాలు పడని వారికి ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పిత్తాశయ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
వెన్న ఒక్కటే కాదు, నిద్రను మెరుగుపరిచే ఇతర తేలికపాటి ఆహారాలు కూడా ఉన్నాయి. గుప్పెడు నట్స్ (బాదం, వాల్‌నట్స్), గ్రీక్ యోగర్ట్, ఉడికించిన గుడ్డు లేదా ఒక గ్లాసు వెచ్చని పాలు వంటివి వెన్న కంటే సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటివి శరీరానికి విశ్రాంతిని ఇచ్చి నిద్ర పట్టేలా చేస్తాయి. వెన్న అనేది నిద్రకు మంత్రదండం లాంటిదేమీ కాదు. ఒకవేళ మీకు అర్ధరాత్రి ఆకలి వేసి నిద్ర పట్టకపోతుంటే, ఒక చిన్న స్నాక్ గా దీనిని ప్రయత్నించవచ్చు. కానీ వైరల్ ట్రెండ్స్ ను గుడ్డిగా ఫాలో అయ్యే కంటే మీ శరీరతత్వానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం.
