వెజిటేరియన్‌గా మారిన గ్లామర్ డాల్.. ఆమె శరీరంలో వచ్చిన మార్పులు ఏంటో తెలుసా?
గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ అందాల తార, ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. వెండితెరపై మెరిసిపోయే ఆమె చర్మం వెనుక, ఆమె టోన్డ్ బాడీ వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. సాధారణంగా సినీ తారలు డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు.

అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన జీవనశైలిలో ఒక కీలక మార్పు చేసుకుంది. గతంలో మాంసాహారం ఇష్టపడే ఈ భామ, ఇప్పుడు పూర్తిగా శాకాహారిగా మారిపోయింది. కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు వల్ల తన శరీరంలో కొన్ని ఆశ్చర్యకరమైన, వింతైన మార్పులు చోటు చేసుకున్నాయని ఆమె వెల్లడించింది.
ఆ వింత మార్పులు ఏంటి?
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె వెజిటేరియన్‌గా మారిన తర్వాత తన ఆరోగ్య సమస్యలన్నీ మాయమయ్యాయి. ముఖ్యంగా చాలా ఏళ్లుగా ఆమెను వేధిస్తున్న ‘అడల్ట్ ఆక్నే’ (పెద్దవారిలో వచ్చే మొటిమలు) సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడూ చర్మంపై వచ్చే మొటిమలతో ఇబ్బంది పడే ఆమెకు, శాకాహారం ఒక వరంగా మారిందని తెలిపింది. ఇక రెండో మార్పు ఏంటంటే, ఆమె బరువులో హెచ్చుతగ్గులు ఆగిపోయాయి. సాధారణంగా చాలామందికి బరువు అప్పుడప్పుడు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. కానీ శాకాహారిగా మారిన తర్వాత ఆమె బరువు స్థిరంగా ఉంటోందని చెప్పింది ఈ బ్యూటీ.

Jaquelin Fernandez
ప్రోటీన్ కోసం ఏం తింటున్నారంటే..
కేవలం మొటిమలే కాకుండా, కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఆమెకు విముక్తి లభించింది. చాలామంది శాకాహారులుగా మారితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందదని భావిస్తుంటారు. కానీ ఈ బ్యూటీ ఆ వాదనను కొట్టిపారేసింది. బీన్స్, టోఫు, వివిధ రకాల కూరగాయల ద్వారా తనకు కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని ఆమె పేర్కొంది. ఒకవేళ అదనపు ప్రోటీన్ అవసరమైతే వీగన్ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటానని స్పష్టం చేసింది.
జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేసే ఆమెకు ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ ఎంతో శక్తిని ఇస్తోందట. ప్రస్తుతం ఈ గ్లామర్ క్వీన్ చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల చర్మ సౌందర్యం, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె నిరూపించింది. శాకాహారం వైపు అడుగులు వేయాలనుకునే వారికి ఆమె ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. తన అనుభవాలను పంచుకుంటూ, వెజిటేరియన్ లైఫ్ స్టైల్ వల్ల తన జీవితం ఎంత హాయిగా సాగుతుందో వివరించింది.
