Chandrababu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్లూ ఫ్రింట్ రెడీ.. ఆ బాధ్యత వారిదే: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్లూ ఫ్రింట్ రెడీ.. 26 జిల్లాలకు విజన్ డాక్యుమెంట్లు సిద్ధం. ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ దిశగా మరో ముందడుగు వేశారు. ‘స్వర్ణాంధ్ర -2047’ విజన్ అమలులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఆఫీసుల్ని ప్రారంభించారు. ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయించారు. 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లుగా వీటిని అభివర్ణించారు. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారైనట్లు తెలిపారు. 26 జిల్లాల్లో రోడ్ మ్యాప్ మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు చెప్పారు.
విజన్ అమలు బాధ్యత స్థానిక నేతలు, అధికారులదే- చంద్రబాబు
నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని…ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీమ్ కూడా ఇస్తున్నామని, ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్నారు.
టెక్నాలజీ అనేది గేమ్ ఛేంజర్- చంద్రబాబు
రెండు నెలల్లో అన్ని సర్వీస్‌లు వాట్సప్‌లో ఉంటాయన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జి, టూల్స్ అన్ని రెడీగా ఉంటాయని అన్నారు. టెక్నాలజీ అనేదీ ఫ్యాషన్ కాదని. అది గేమ్ ఛేంజర్ అని తెలిపారు. భవిష్యత్‌లో అదే టెక్నాలజీ మరింత కీలకంగా మారనుందన్నారు.
ఈ ఏడాది 1,040 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణమే లక్ష్యం
రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం జరగాలన్నారు చంద్రబాబు. ఈ ఏడాది 1,040 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు .రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో MSMEలు ఏర్పాటు చేస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..