NTR Jayanthi: ‘ఎన్టీఆర్ జీవితం.. ప్రపంచానికే ఆదర్శం’.. పార్లమెంట్‌లో నివాళులర్పించిన ఎంపీ కేశినేని నాని..
NTR Jayanthi: ఎన్టీఆర్ గొప్ప మహనీయుడు అని కీర్తించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఆయన తెలుగు ప్రజలకే కాదు.. భారత ప్రజల హృదయాల్లోనూ చోటుసంపాదించుకున్నారని
NTR Jayanthi: ఎన్టీఆర్ గొప్ప మహనీయుడు అని కీర్తించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఆయన తెలుగు ప్రజలకే కాదు.. భారత ప్రజల హృదయాల్లోనూ చోటుసంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన దివంగత నాయకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ సేవలను స్మర్మించుకున్నారు. ఆయనను కీర్తిస్తూ.. ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ పుట్టి 99 ఏళ్ళు అయిపోయిందా అన్నట్లు ఉంది అని అన్నారు. ఎన్టీఆర్ జీవన శైలి ప్రపంచానీకే ఆదర్శం అని, ఆయన. ప్రజల కోసం, సమాజం కోసం, వ్యవస్థ కోసం జీవించారని పేర్కొన్నారు. మచ్చలేని జీవితం గడిపారని, మహనీయుడు అని కొనియాడారు ఎంపీ కేశినేని.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. కాదనుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో సినీ రంగాన్ని ఎంచుకున్నారని ఎన్టీఆర్ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు ఎంపీ కేశినేని. సమాజం కోసం సందేశాత్మక చిత్రాల్లో నటించారని పేర్కొన్నారు. చరిత్ర కారుల గురించి, పౌరాణికంగా అనేక చిత్రాల్లో నటించారన్నారు. రాముడిగా, కృష్ణుడిగా ఏ పాత్ర తీసుకున్నా ఎన్టీఆర్ ను మించిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేరని అన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక సేవలు అందించారన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనాపాటి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఎంపీ కేశినేని. టీడీపీ పెట్టాక అనేక సంస్కరణలను తీసుకువచ్చారని చెప్పారు. మహిళలు, పేదలు, వెనకబడిన వర్గాల వారి కోసం అనేక సంస్కరణలు ఎన్టీఆర్ తీసుకువచ్చారన్నారు. సీఎంగా ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు ఎవరూ చేయలేదన్నారు. ఆయన సంస్కరణలే ఇంకా అమలువుతున్నాయని చెప్పారు.
ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని ఎంపీ కేశినేని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం మంచిగా ఉన్నాయంటే అది ఎన్టీఆర్ చలవే అని పేర్కొన్నారు. వంద సంవత్సరాలు కాదు.. వెయ్యి సంవత్సరాలయినా ఎన్టీఆర్‌ను ప్రపంచం గుర్తు పెట్టుకుంటుందని చెప్పారు. ఎన్టీఆర్‌కు మరణం లేదని, ఆయన ఎప్పుడూ ప్రజల మనసుల్లో, ముఖ్యంగా తెలుగువారి గుండెల్లో ఉంటారని పేర్కొన్నారు ఎంపీ కేశినేని నాని.