Rains in AP: రాయలసీమలోని పలు జిల్లాలో భారీ వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న కల్లివంక వాగు .. కొట్టుకుపోయిన కారు
కడప, కర్నూలు జిల్లాలో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా ఆలూరులో భారీ వర్షం కురిసింది. దీంతో ఆలూరు సమీపంలో కల్లివంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది
Rains in AP: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భానుడి భగభగలతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, కర్నూలు జిల్లాలో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కర్నూలు జిల్లా ఆలూరులో భారీ వర్షం కురిసింది. దీంతో ఆలూరు సమీపంలో కల్లివంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. కారులో నలుగురు లేదా ఐదు మంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తు న్నారు. కారు గుంతకల్లు నుంచి ఆలూరు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కల్లివంక వరద ప్రవాహం వల్ల ఆలూరు నుంచి గుంతకల్లు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గల్లంతైన వారిని రక్షించేందుకు ఒకవైపు చీకటి మరొకవైపు వర్షం అడ్డంకిగా మారాయి. పోలీసులు గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. కారు కనుక సమీపంలోనే ఎక్కడైనా ఉండొచ్చు అని గాలిస్తున్నారు. కారు సమాచారం గురించి గుంతకల్ ఆలూరు మధ్యలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
మరోవైపు కడప జిల్లాలోని పులివెందులలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలుతో వర్షం దంచి కొట్టింది. వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పిడుగుల గర్జించడంతో ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. చెట్లు కూలిపోయాయి. మామిడి పంట నేలరాలింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుండడంతో అన్నదాత వ్యవసాయానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..