Nara Lokesh: లోకేష్ యాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ, షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవా..? మూడు రోజుల షెడ్యూల్ ఇదే..
లోకేష్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే కండీషన్స్ అప్లయ్ అంటోంది. ఆచితూచి అడుగేయాలని హెచ్చరించింది. దీనిపై కస్సుబుస్సు మండూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ఇంతకీ ఆ షరతులేంటి? వాటి వల్ల యాత్రకు ఇబ్బందేంటి?
టీడీపీ నేత లోకేష్ యాత్రకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 14 షరతులతో లోకేష్ యువగళం యాత్రకు అనుమతిచ్చారు పోలీసులు. దీంతో శుక్రవారం (జనవరి 27న ) కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. అదే రోజు కుప్పంలో బహిరంగ సభ ఉంటుంది. పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని సూచించారు పోలీసులు. టైమ్ ప్రకారమే బహిరంగ సభల నిర్వహించాలని…ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదని స్పష్టం చేశారు.
రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని.. అంబులెన్స్‌తో పాటు ఫైర్‌ఇంజిన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. బాణసంచా కాల్పడం పూర్తిగా నిషేధమని.. విధుల్లో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్థం పర్థం లేని ఆంక్షలు పెట్టిందని ఆరోపించింది. పోలీసుల ఆంక్షలపై తీవ్రంగా మండిపడుతున్నారు టీడీపీ నేతలు.
మూడు రోజుల షెడ్యూల్ ఇదే..
యువగళానికి ముందు ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ లో లోకేష్ నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి కడప బయలుదేరివెళ్తారు. శ్రీ దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అమీన్ పూర్ దర్గాలో ప్రార్ధనలు అనంతరం తిరుపతి వెళ్తారు నారా లోకేష్. ఈ నెల 26న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు.
ఈనెల 27న కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయనున్నారు లోకేష్. నాలుగు వందల రోజులకు పైగా సాగే యాత్రకు ఇంఛార్జ్‌గా దీపక్‌రెడ్డిని నియమించింది టీడీపీ.
నిబంధనల్ని పాటించకపోతే.. ఏ క్షణమైనా పాదయాత్రకు అనుమతి రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక వైసీపీ నేతలైతే లోకేష్ యాత్రపై కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో యువగళం యాత్రపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..