East Godavari: నిమ్మతోటలో పైపులైను కోసం కూలీల తవ్వకాలు.. మట్టి తీస్తుండగా..
నిమ్మతోటలో పైప్ లైన్ కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఈలోపు వారికి ఓ పెద్ద శబ్దం వినిపించింది. ఏదో రాయి అయ్యి ఉంటుందిలే అనుకున్నారు.. కానీ..
తూర్పుగోదావరి జిల్లా… రాజానగరం మండలం శ్రీకృష్ణ పట్నం గ్రామం శివారులో శ్రీరాంపూరలో అరుదైన ఘటన వెలుగుచూసింది. పురాతనమైన అమ్మవారి విగ్రహం బయల్పడింది. ప్రధాన రహదారికి చేరుకుని ఉన్న నిమ్మతోటలో పైపు లైను కోసం కూలీలు గోతులు తీస్తుండగా పురాతన అమ్మవారి విగ్రహం కనిపించింది. అంతా మట్టి ఉండటంతో.. తొలుత అది ఏం విగ్రహమో అర్థం కాలేదు. నీటితో శుభ్రం చేయగా కాళికామాత అవతారం గుర్తించారు. అమ్మవారి విగ్రహాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.
గ్రామస్థులు భక్తిశ్రద్దలతో ఆ విగ్రహానికి జలాలతో అభిషేకం చేసి.. పూజలు చేశారు. పసుపు, కుంకుమ సమర్పించి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ విగ్రహం అతి పురాతనమైనదిగా అనిపిస్తుందని.. ప్రతిష్టాపనతో పాటు గుడి ఏర్పాటుపై గ్రామస్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామ పెద్దలు వెల్లడించారు. ఈ అమ్మవారి విగ్రహం పురాతన శిల్పకళ ఎంత గొప్పదో తెలియజేస్తుందని పురోహితులు అంటున్నారు.
ఇలా నిర్మాణాల కోసం తవ్వకాలు జరితున్నప్పుడు.. పూర్వికులు దాచిన నిధి, నిక్షేపాలు.. ఆయా కాలాల నాటి వస్తువులు బయటపడటం చూశాం. కానీ ఇలా దేవతల విగ్రహాలు బయల్పడటం చాలా రేర్ అని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..