Andhra Pradesh: అత్యాశకు పోయి అడ్డంగా బుక్కైన క్యాష్ కస్టోడియన్స్.. భారీగా ఏటిఎమ్ డబ్బు దోపిడి
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాంలో బ్యాంకు ఏటిఎంలలో నగదు జమ చేసే ఏజన్సీ కస్టోడియన్స్ నుంచి కోటి నలభై లక్షలు కాజేశారు ఘరానా మోసగాళ్లు. సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ, ప్రవేట్ బ్యాంకులకు చెందిన ఏటిఎం కేంద్రాల్లో క్యాష్ ను పెడుతుంది. ఈ కంపెనీలో కస్టోడియన్స్ గా వ్యవహరిస్తున్న నలుగురు వ్యక్తులు ఆగస్టు 23న కోటి నలభై లక్షలు..
విజయనగరం, సెప్టెంబర్ 5: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాంలో బ్యాంకు ఏటిఎంలలో నగదు జమ చేసే ఏజన్సీ కస్టోడియన్స్ నుంచి కోటి నలభై లక్షలు కాజేశారు ఘరానా మోసగాళ్లు. సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ, ప్రవేట్ బ్యాంకులకు చెందిన ఏటిఎం కేంద్రాల్లో క్యాష్ ను పెడుతుంది. ఈ కంపెనీలో కస్టోడియన్స్ గా వ్యవహరిస్తున్న నలుగురు వ్యక్తులు ఆగస్టు 23న కోటి నలభై లక్షలు తీసుకొని జిల్లాలోని రూట్ నంబరు 3, మరియు 4 లో గల ఏటిఎం కేంద్రాల్లో జమ చేసేందుకు బయలుదేరారు. అలా వెళ్లిన వారు కుమిలి గల ఇండియా వన్ ఏటిఎంలో నాలుగు లక్షలు జమ చేసి, మిగిలిన కోటి ముప్పై ఆరు లక్షల నగదుకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ఆగస్టు 24 నుండి 26 వరకు క్యాష్ ఆడిట్ నిర్వహించారు..
దీంతో అసలు బండారం బయటపడి సుమారు కోటి నలభై లక్షలు కస్టోడియన్స్ కాజేసినట్లు గుర్తించి గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు కంపెనీ నిర్వాహకులు. దీంతో పోలీసులు సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ కంపెనీలో కస్టోడియన్స్ గా పని చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి విచారించారు. అలా పోలీసులు చేసిన విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. కస్టోడియన్స్ నలుగురు రెండు కోట్ల విలువ చేసే రెండు వేలు నోట్లు తీసుకొని, కోటి నలభై లక్షల విలువ చేసే ఐదు వందల నోట్లు ఇవ్వడానికి ఒక గ్యాంగ్ తో ఒప్పందం చేసుకున్నారు. అలా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ డీల్ లో అరవై లక్షల కమీషన్ వస్తుందని ఆశపడ్డారు నలుగురు కస్టోడియన్స్. అలా నోట్లు మార్పిడి వ్యవహరంలో భాగంగా ఆగస్టు 23న రెండు బ్యాగుల్లో కోటి నలభై లక్షల రూపాయలను తీసుకొని కస్టోడియన్స్ నలుగురు గంట్యాడ మండలం కొర్లాం గ్రామ శివారుకు మోటారు సైకిళ్ల పై వెళ్లారు. అలా వీరు వెళ్లగానే అక్కడకు నోట్ల మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్న గ్యాంగ్ వచ్చారు.
ముందుగా కస్టోడియన్స్ తెచ్చిన ఐదు వందల రూపాయలు డబ్బులు చూసి ఇక తమ ప్లాన్ ని అమలు చేశారు నిందితులు. ముందుగా మాటల్లో పెట్టి ఒక్కసారిగా నలుగురు కస్టోడియన్స్ పై మెరుపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం కస్టోడియన్స్ వద్ద ఉన్న కోటి నలభై లక్షలు తీసుకొని పరారయ్యారు దుండగులు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు దోపిడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఎనభై లక్షల నగదును, ఒక బంగారు గొలుసు, మూడు సెల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు కస్టోడియన్స్ తో పాటు దోపిడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఇంకా వీరికి సహకరించిన మరికొంతమంది నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ఇంకా సుమారు పది మందికి పైగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు పోలీసులు. ప్రజలు మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని, నిబంధనల మేరకు రెండు వేల నోట్లను బ్యాంకుల్లోనే మార్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్ పి దీపిక. రెండు వేల నోట్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి వ్యక్తుల సమాచారం ఏదైనా ఉంటే స్థానిక పోలీసులకు అందించాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.