Andhra Rains: ఏపీ వాసులారా యువర్ అటెన్షన్ ప్లీజ్.. ఈ జిల్లాలో దండిగా వానలు
ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు.

పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం అక్కడక్కడ చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మరోవైపు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులులో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని గురువారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.46 లక్షల క్యూసెక్కులు ఉందని వెల్లడించారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేవరకు కృష్ణానది పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోను పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. సోషల్ మీడియాలోని వదంతులను నమ్మొద్దని, అలెర్ట్ మేసేజ్‌లు విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేస్తుందని స్పష్టం చేశారు.
బుధవారం ఉదయం 8.30గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన సగటు వర్షపాతం ఎన్టీఆర్ జిల్లా 94మిమీ, కోనసీమ 90.8మిమీ, పశ్చిమగోదావరి 90మీమి, ఏలూరు 65.8మిమీ, కాకినాడ 57.7మిమీ, తూర్పుగోదావరి 50.4మిమీ వర్షపాతం నమోదైందని వివరించారు. గురువారం ఉదయం 8.30గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 52మిమీ, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో 48.2మిమీ, ఏలూరు జిల్లా కోటపాడులో 40.2మిమీ, అనకాపల్లి జిల్లా గంధవరంలో 38మిమీ, అనకాపల్లిలో 38మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




