AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జనసేనలో చేరేందుకు సిద్ధమైన వైఎస్ఆర్ శిష్యుడు.. ఇందుకు కారణం వైసీపీయేనట..!

కొణతాల రామకృష్ణ.. వైఎస్ఆర్ శిష్యుడిగానే రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు. కానీ ఇప్పుడు అదే వైఎస్ కుమారుడి పార్టీ వైఎస్సార్సీపీకి బద్ద వ్యతిరేకిలా మారాడు. ఉత్తరాంధ్రకి చెందిన ఈ సీనియర్ రాజకీయ నాయకుడు నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

Andhra Pradesh: జనసేనలో చేరేందుకు సిద్ధమైన వైఎస్ఆర్ శిష్యుడు.. ఇందుకు కారణం వైసీపీయేనట..!
Konathala Ramakrishna
Eswar Chennupalli
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 20, 2023 | 8:25 AM

Share

కొణతాల రామకృష్ణ.. వైఎస్ఆర్ శిష్యుడిగానే రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు. కానీ ఇప్పుడు అదే వైఎస్ కుమారుడి పార్టీ వైఎస్సార్సీపీకి బద్ద వ్యతిరేకిలా మారాడు. ఉత్తరాంధ్రకి చెందిన ఈ సీనియర్ రాజకీయ నాయకుడు నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1980లో యువజన నేతగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా మారి 1989, 91లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించారు. 89లో అయితే కేవలం 9 ఓట్ల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించడం ఇప్పటికీ రికార్డు. అంతటి రాజకీయ అదృష్టం కలిగిన కొణతాల రామకృష్ణ ఆ తర్వాత కాలంలో కూడా అనకాపల్లి అసెంబ్లీ నుంచి ఎన్నికై 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విశాఖ రాజకీయాలను శాసించారు కూడా. కేవలం ఉత్తరాంద్రకే పరిమితమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేతగా, బీసీ నేతగా కొణతాల రామకృష్ణ రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపుని సంపాదించాడు.

అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మాత్రం ఆయన రాజకీయ ప్రయాణం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదట్లో కలిసే ఉన్న కొణతాల 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ విశాఖ లోక్ సభకు పోటీ చేసిన సందర్భంగా ఎన్నిక ప్రధాన ఏజెంట్‌గా ఉండడంతో పాటు మొత్తం తానే ముందుండి వ్యవహరించాడు. అంతటి సన్నిహిత సంబంధాలు వైఎస్ కుటుంబంతో రామకృష్ణకు ఉండేవి. అయితే విజయమ్మ ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ఓటమికి కొణతాల కూడా ఒక కారణం అంటూ అప్పట్లో రకరకాల కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్లపాటు మౌనంగానే ఉన్నా 2019లో తిరిగి ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. అయితే చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తడం, ఆ కమ్యూనికేషన్ గ్యాప్‌ మరింత పెరిగి జగన్‌కి అనూహ్యంగా దూరమయ్యాడు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరై తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండే ప్రయత్నం చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరొక అడుగు ముందుకేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక పేరుతో సమావేశాలు నిర్వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే వేదికలా మార్చారు. రాజకీయాలకతీతంగా అంటూనే అన్ని రాజకీయ పార్టీలని అందులో భాగస్వామ్యం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై గట్టిగానే నిలదీసే ప్రయత్నం చేశారట. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో కూడా ఇటీవల కాలం ఆయన సన్నిహితంగా ఉంటున్న సందర్భాలు కూడా లేవు. దీంతో ఆయన రాజకీయ జీవితంపై అనేక అనుమానాలు కూడా ఆయన అభిమానులలో నెలకొన్నయట. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ సమాన దూరంలో ఉంటూ వీలైతే జనసేనలో చేరితే బాగుంటుందన్న అభిప్రాయం ఆయన అభిమానులు ఇటీవల కాలంలో ఎక్కువ వ్యక్తం చేస్తూ వస్తున్నారట. అదే సమయంలో జనసేన కూడా ఆ ప్రాంతంలో కీలకమైన గవర సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఒకరు అవసరం కావడంతో జనసేన కూడా సానుకూలంగానే ఉందట. ఒకవేళ కొనతాల ఆసక్తి చూపిస్తే ఆ జిల్లా బాధ్యతలు ఇవ్వడానికి కూడా జనసేన సిద్ధంగా ఉందట. కొణతాల కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన నేపథ్యంలో అనకాపల్లి పై దృష్టి సారించిన జనసేన కొణతాలతో కూడా మాట్లాడాలని భావిస్తుందట. కొణతాల కూడా అందుకు సానుకూలంగా ఉండడంతో త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం ప్రస్తుతం విశాఖ అనకాపల్లి జిల్లాలో గట్టిగా సాగుతోంది. దీనిపై రెండు వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినా కొణతాల తనతో పాటు వచ్చే తన అనుచరులకు కూడా కొన్ని స్థానాల్లో టికెట్లు ఇప్పించే ఆలోచన కూడా చేస్తున్నారట. ఎన్నికల ఏడాది కాబట్టి ఎన్నికల్లో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాబట్టి కొనతాల జనసేనలో చేరడం అన్న స్పెక్యులేషన్ కూడా నిజం కావచ్చన్న దిశగా రాజకీయ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..