Amalapuram Tension: రణ క్షేత్రంలా ‘కోనసీమ’.. అమలాపురంలో హైటెన్షన్.. అసలు వివాదం ఏంటంటే..!

Amalapuram Tension: కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన

Amalapuram Tension: రణ క్షేత్రంలా ‘కోనసీమ’.. అమలాపురంలో హైటెన్షన్.. అసలు వివాదం ఏంటంటే..!
Konaseema Main
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2022 | 9:49 PM

Amalapuram Tension: కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. అమలాపురంలో లా అండర్ ఆర్డర్ అదుపు తప్పింది. మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. ఎమ్మెల్యే ఇంటిపై అటాక్ చేశారు. అసలు ప్రశాంతమైన కోనసీమ రణక్షేత్రంగా ఎలా మారింది..? అసలేం జరిగింది..? వివాదమేంటి?

ఏపీలో కొత్త జిల్లాలు వచ్చాయి. 13 జిల్లాల నవ్యాంధ్ర.. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న సర్కార్‌.. స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది. ఈక్రమంలోనే… ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్ వ్యవస్ధీకరణలో కొత్త జిల్లాగా మారింది. ప్రభుత్వం దీనికి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది.

జిల్లాలో అత్యధికంగా ఉన్న ఎస్సీ జనాభా మనోభావాల మేరకు కోనసీమ జిల్లాను కాస్తా అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలన్న డిమాండ్లు వినిపించాయి. అమలాపురం కేంద్రంగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగింది. ఇందుకోసం అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాల విభజన ప్రక్రియ నేపథ్యంలో పలు కొత్త జిల్లాలకు దివంగత నేతల పేర్లు పెట్టడంతో.. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు సైతం అంబేద్కర్ లేదా బాలయోగి పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపించాయి. కాపునేత ముద్రగడ పద్మనాభం సైతం జగన్ కు ఇదే డిమాండ్ చేశారు. తొలుత మౌనంగా ఉన్న ప్రభుత్వం.. తర్వాత.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక నిర్ణయం తీసుకుంది. కొనసీమ జిల్లా పేరును.. డాక్టర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం ద్వారా ప్రభుత్వం సమంజమైన నిర్ణయమే తీసుకుందని ఎంతో మంది పార్టీలకతీతంగా అభినందించారు. కానీ… జిల్లాలో కొన్ని కులాల నేతలు, మద్దతుదారులు మాత్రం దీనిపై నిరసనలకు దిగారు. పలు చోట్ల దాడులు కూడా జరిగాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారింది. అంబేద్కర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు.

అంబేద్కర్ జిల్లా పేరును కోనసీమకు పెట్టడాన్ని స్వాగతిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు… పోటా పోటీగా ర్యాలీలు నిర్వహిస్తుండటం, అవి కాస్తా ఉద్రిక్తతలకు వేదికవుతుండటంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల ఇలాంటి వివాదాలు పెరుగుతుండటం, ఇవి దాడులకు కూడా దారితీస్తుండటంతో పోలీసులు చేసేది లేక 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ అమల్లోకి రావడంతో పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టారు.

అమలాపురం జిల్లాకు కోనసీమ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. అమలాపురం ఎస్పీ సుబ్బారెడ్డిపై ఆందోళనకారులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ దాడుల్లో 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అమలాపురం డీఎస్పీ సొమ్మసిల్లిపడిపోయారు. ఆందోళనకారులు భీకరమైన విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారుల దాడుల్లో ఎస్పీ సహా 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. 2 ప్రైవేటు బస్సులకు నిప్పు పెట్టారు.

జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ స్థానిక మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లపైనా దాడులు చేశారు ఆందోళనకారులు. మొదట మంత్రి విశ్వరూప్ ఇంటిపై అటాక్ చేసిన నిరసనకారులు.. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. దాంతో ఆయన ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ తరువాత ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై అటాక్ చేసిన ఆందోళనకారులు.. ఆయన ఇంటికి కూడా నిప్పు అంటించారు. ఎమ్మెల్యే ఇంటి పర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఎంతకీ కంట్రోల్‌లోకి రాకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి హెచ్చరిక కింద ఉన్నపళంగా ఆందోళనలు విరమించాలని ఆందోళనకారులను ఆదేశించారు. లేదంటే కాల్పులు జరపాల్సి వస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు.

మరోవైపు అమలాపురం ఘటనపై 7 కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్ రెండు ఇల్లుల దహనం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి కి నిప్పు, మూడు బస్సుల దగ్దం పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఏపీ డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనతో ప్రమేయమున్న 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రమేయమున్న మరో 72 మంది అరెస్ట్ కు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లందరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం అమలాపురంలో పరిస్తితి పూర్తిగా అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. అదనపు బలగాల మోహరించినట్లు తెలిపారు.  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదన్నారు. నిన్నటి ఘటన అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామని చెప్పారు. వాట్సప్ గ్రూప్‌లలో తప్పుడు ప్రచారం ద్వారా గుమిగూడినట్లు తెలిపారు. అమలాపురంలో ఇంటర్నెట్ పై తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉందని.. గ్రూప్స్ గా తిరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని డీజీపీ వివరించారు.

అమలాపురం అల్లర్లు పొలిటికల్ టర్న్..

అమలాపురంలో అల్లర్ల వ్యవహారం క్రమంగా పొలిటికల్‌ టర్న్ తీసుకుంది. అల్లర్లు, ఆందోళన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది. మహనీయుడి పేరు పెడితే అభ్యంతరమేంటని నిలదీసింది. అయితే వైసీపీ ఆరోపణలను ఆ రెండు పార్టీలు ఖండించాయి. బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశాయి. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు మార్పుతో ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. ఓ వర్గం పేరు మార్చొద్దని డిమాండ్‌ చేస్తే.. దళిత సంఘాలు మాత్రం పేరు మార్చాల్సిందేనని పట్టుబట్టాయి. లోకల్‌గా చినికి చినికి గాలివానగా మారిన వివాదం.. చివరకు రావణకాష్టం రాజేసింది.

నివురుగప్పిన నిప్పులా.. కోనసీమ టెన్షన్‌ టెన్షన్‌గానే ఉంది. అటు అమలాపురం, ఇటు రావులపాలెంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లతో దాడులు చేశారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గోడలు దూకాల్సి వచ్చింది. పోలీసుల్ని చూసి చెల్లాచెదురైన నిరసనకారులు.. కనిపించిన ఇళ్లలోకి దూరిపోయారు. కాంపౌండ్ల చాటున నక్కినవారిని గోడదూకి మరీ బయటకు తీసుకొచ్చారు పోలీసులు.

అదుపులో పాత్రధారి.. అమలాపురం అల్లర్ల కేసులో అన్యం సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోనసీమ జిల్లా కోసం మూడ్రోజుల కిందట కలెక్టరేట్‌లో పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు అన్యం సాయి. నిన్నటి ఆందోళనలను ముందుండి నడిపించాడని ప్రాథమిక నిర్థారణకొచ్చిన పోలీసులు..అన్యం సాయిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. అన్యం సాయిపై గతంలో రౌడీషీట్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ పేరు ముందుగానే పెట్టాల్సింది.. కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని, అలా చేసి ఉంటే ఇప్పుడు అమలాపురం(Amalapuram) అగ్నిగుండంలా మారేది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో ఎందుకు ఆలస్యం చేశారో అర్థం కావట్లేదన్న పవన్ అభ్యంతరాల స్వీకరణకు మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమ(Konaseema) కే ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా అని నిలదీశారు. అంబేడ్కర్ కు గౌరవం ఇవ్వడమంటే ఆయన సిద్దాంతాలు పాటించడం అని పవన్ అన్నారు. ఎస్పీలలో బలం తగ్గుతోందన్న భావించి వైసీపీ(YCP) నేతలే ప్లాన్ చేసి గొడవలకు తెర లేపారని ఆరోపించారు. వారి మీద వారే దాడి చేయించుకుని సింపతీ కోసం చూస్తున్నారని మండిపడ్డారు. నిన్న జరిగిన అల్లర్లలో తమ పార్టీకి చెందిన నేతలు ఉన్నారని హోమంత్రి తానేటి వనిత చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ వెల్లడించారు.

జనసైనికుడే… జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌ దుమారం రేపాయి. ఇక పవన్‌ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి రోజా. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే పవన్ కల్యాణ్ చదివారని.. తుని ఘటన వైసీపీ చేయించిందని గతంలో పవన్‌ అన్నారన్నారు. కోనసీమ కోసం ఆత్మహత్య చేసుకుంటానన్న వ్యక్తి.. జనసేనలో పనిచేస్తున్న వాడేనన్నారు.

పేరుపై రగడ.. కోనసీమ జిల్లా సాధన సమితి నేతలు, కార్యకర్తలను రావులపాలెంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు వంద మందిని అరెస్ట్‌ చేసి పోలీస్టేషన్‌కి తరలించారు. కోనసీమ అనేది మొదటి నుంచి ఉన్న పేరని దాన్ని మార్చవద్దని డిమాండ్‌ చేస్తున్నారు కోనసీమ జిల్లా సాధన సమితి నేతలు.

దళిత సంఘాల డిమాండ్‌.. మంత్రి విశ్వరూప్, MLA సతీష్ ఇళ్లను ధ్వంసంచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అమలాపురంలో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేయాలని దళిత నాయకులు నినాదాలు చేశారు.

అందరి పేర్లు బయటకు వస్తాయి.. అమలాపురం ఘటనలో పోలీసులు, YCP కార్యకర్తలు, నేతలు సంయమనంతో వ్యవహరించడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ఘటన వెనుక ఉన్న అందరి పేర్లు బయటకు వస్తాయన్నారు. అమలాపురంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు హోంమంత్రి తానేటి వనిత. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

అరెస్టుల పర్వం.. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చుతామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో అమలాపురం అగ్నిగుండంగా మారింది. నిన్నటి విధ్వంసం ఘటనలో 46 మందిని అరెస్టు చేశారు. మరో 72 మందిని కూడా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు మంత్రి తానేటి వనిత.

ఉద్రిక్తంగా మారిన చలో రావులపాలెం.. అమలాపురంలో నిన్నటి ర్యాలీకి కొనసాగింపుగా చలో రావులపాలెంకు కోనసీమ సాధన సమితి పిలుపుచ్చింది. దీంతో కోనసీమకు ముఖద్వారంగా భావించే రావులపాలెంలో టెన్షన్‌ ఏర్పడింది. అమలాపురం విధ్వంసం తరహా సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు రావులపాలెంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు తరలివచ్చిన యువకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని యువకులు నినాదాలు చేశారు. పోలీసులు రావడంతో చాలా మంది యువకులు తాము వచ్చిన బైకులను రోడ్లపైనే వదిలేసి పారిపోయారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసిన యువకులను పోలీసులు చెదరగొట్టారు.

అన్యం సాయిపై పార్టీల పరస్పర ఆరోపణలు.. అన్యం సాయి YCP కార్యకర్త అని టీడీపీ ఆరోపించింది. YCP నేతలతో ఉన్న ఫొటోలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చూపారు. మరో వైపు అతను జనసేనకు చెందిన వాడంటూ YCP ఫొటోలు విడుదల చేసింది. రెండు పార్టీలు మా వాడు కాదంటే మా వాడు కాదని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. మొత్తానికి పేరు కోనసీమ మార్పు వివాదం, అమలాపురంలో చోటుచేసుకున్న విధ్వంసానికి రాజకీయ రంగు అంటింది.

తగులబడిపోయిన తన ఇంటిని సందర్శించిన మంత్రి విశ్వరూప్‌.. అటు నిన్నటి విధ్వంసంలో తగులబడిపోయిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ సందర్శించారు. కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఆయన ఇంటికి వచ్చారు. పూర్తిగా కాలిపోయిన ఇంటిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఆందోళనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అటు తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని అన్ని పార్టీలు, వర్గాలు డిమాండ్‌ చేశాయని విశ్వరూప్‌ గుర్తు చేశారు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.