AP Captial Vizag: శనివారం విశాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఆ పని కోసమే సీఎస్ వైజాగ్ వస్తున్నారా?
Andhra Pradesh: విజయదశమి నుంచి విశాఖ వేదికగా పరిపాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విశాఖకు వస్తున్నారు. దీంతో విశాఖ జిల్లా అధికారుల్లో హడావుడి మొదలైంది. ఒకవేళ ప్రస్తుతం సీఎంఓ వచ్చినా అన్ని ప్రభుత్వ శాఖలు రావని, అవసరమైనప్పుడు సమీక్షల కోసం ఏర్పాట్లు ఉంటే చాలన్న ప్రాథమిక సంకేతాలు జిల్లా అధికారులకు అందాయట. అందుకే తక్షణ అవసరాలు, దీర్ఘకాల ప్రణాళికలు రెండు వర్టికల్స్ గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట..
Andhra Pradesh: విజయదశమి నుంచి విశాఖ వేదికగా పరిపాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విశాఖకు వస్తున్నారు. దీంతో విశాఖ జిల్లా అధికారుల్లో హడావుడి మొదలైంది. ఒకవేళ ప్రస్తుతం సీఎంఓ వచ్చినా అన్ని ప్రభుత్వ శాఖలు రావని, అవసరమైనప్పుడు సమీక్షల కోసం ఏర్పాట్లు ఉంటే చాలన్న ప్రాథమిక సంకేతాలు జిల్లా అధికారులకు అందాయట. అందుకే తక్షణ అవసరాలు, దీర్ఘకాల ప్రణాళికలు రెండు వర్టికల్స్ గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట జిల్లా అధికారులు. అదే సమయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా విశాఖకు వస్తుండటంతో రాజధాని వార్తల నేపథ్యంలో ఆయన టూర్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ముఖ్యమంత్రి నివాసం విశాఖకు మారబోతోందన్న పక్కా సమాచారంతో జిల్లా అధికారుల్లో టెన్షన్ మొదలైంది. విశాఖలో ఏర్పాట్లపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ అలాంటి కమిటీ ఏమీ ఏర్పాటు కాలేదు. జిల్లా అధికారులకు మాత్రం పలు సూచనలు వచ్చాయట. దీంతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జీవిఎంసీ కమిషనర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు నగరంలోని కనీస, ప్రాథమిక మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు.
కార్యాలయాల కోసం వెతుకులాట
ప్రధానంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం మాత్రమే ముందు రాబోతోందన్న సమాచారం ఉంది. అందులోనూ ముఖ్యమంత్రి వారానికి రెండు రోజులు మాత్రమే విశాఖ లో ఉంటారని, ఎన్నికల వరకు అమరావతిలో కూడా రెండు రోజులు, అలాగే పల్లె నిద్ర లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి విశాఖలో సీఎం ఉన్న సమయంలో జరిగే సమీక్షలు, వచ్చే అతిథులు, జరిగే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు అధికారులు.
సీఎంతో పాటు ఉండే అధికార యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు ప్రారంభించారు జిల్లా అధికారులు. రుషికొండ, సాగర్ నగర్, ఎండాడ తో పాటు సమీప ప్రాంతాల్లో ఒకేచోట 50 ఫ్లాట్లతో పాటు వంద కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం కల అపార్ట్మెంట్ కోసం హంట్ ప్రారంభమైంది. ఇప్పటికే నిర్మించిన భవనాలు కానీ లేదా కొత్తగా నిర్మిస్తున్న అపార్టుమెంట్లతోపాటు స్థానికంగా ఉండే విద్యా సంస్థలకు చెందిన భవనాలు, కొత్తగా నిర్మించిన హోటల్స్, రిసార్ట్స్ కూడా పరిశీలిస్తున్నారు అధికారులు.
జీవిఎంసీ అప్‌గ్రేడ్..
మరోవైపు జీవీఎంసీ స్థాయిని కూడా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ప్రస్తుతం జీవిఎంసీకి జాయింట్ కలెక్టర్ స్థాయి ఐఏఎస్ కమిషనర్‌గా ఉంటూ స్టేట్ సర్వీసెస్ కు చెందిన పలువురు అదనపు కమిషనర్‌లుగా ఉంటున్నారు. వారి స్థానంలో కార్యదర్శి స్థాయి కలిగిన సీనియర్ ఐఎఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించి జూనియర్ ఐఏఎస్ లను అదనపు కమిషనర్లుగా నియమించాలన్న ప్రణాళిక సిద్ధం అవుతోంది. దీంతో పరిపాలనా పరంగా విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అదే సమయంలో జీవిఎంసి ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి తాత్కాలికంగా ముడసర్లోవలోని స్కిల్ డెవలప్‌మెంట్ భవనంలోకి తరలించాలన్న ఆలోచన కూడా ఉంది. ఒకవేళ జీవీఎంసీ భవనం ఖాళీ చేస్తే రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగానికి ఆ భవనాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది.
మరోవైపు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ హుటాహుటిన విజయవాడ వెళ్లడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగానికి సంబంధించిన పది మంది కీలమైన అధికారులతో ఈరోజు విజయవాడలో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటుచేశారని, అందుకోసమే కమిషనర్ వెళ్లారని జీవీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అధికారుల్లో హడావుడి ఏ స్థాయిలో ఉందో కనిపిస్తోంది.
వీటన్నింటినీ మించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి రేపు విశాఖ వస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అని అధికారులు చెబుతున్నా అందుబాటులో ఉన్న భవనాలు, ఏర్పాట్లను సీఎస్ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..