ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు సాయం అందించింది. ఈ ఏడాది టాప్ 200 విదేశీ వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు తొలి విడతగా రూ.20 కోట్ల సాయం అందించారు ముఖ్యమంత్రి జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు సాయాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా కొందరు విద్యార్థులతో ముఖ్య మంత్రి జగన్ మాట్లాడారు. చదువుపై పెట్టే పెట్టుబడి పిల్లల కుటుంబాల భవిష్యత్తునే మార్చేస్తుందని సీఎం అన్నారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలని సీఎం ఆకాంక్షించారు. ఆ రకంగా ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని సీఎం అభివర్ణించారు.
పిల్లలకు చదువే మనమిచ్చే ఆస్తి అని, ప్రపంచ స్థాయిలో రాణించాలని సీఎం కోరారు. ప్రపంచ వేదికపై దేశం, ఏపీ జెండా ఎగర వేయాలని తెలిపారు. గతంలో విదేశీ విద్యను నామమాత్రంగా ఇచ్చేవారని, ఇప్పుడు ఒక్కొక్కరికి అత్యధికంగా కోటీ 25 లక్షల వరకు సాయం చేస్తున్నామని చెప్పారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా కాల్ చేయాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..