Diabetes And Eyes: మీకు షుగర్ ఉందా? అయితే బహుపరాక్! నిర్లక్ష్యం చేశారో.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం.. ఫ్యాక్ట్స్ చెక్ చేయండి..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, అది రెటీనాకు హాని చేస్తుంది. దీని వలన తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దృష్టి అస్పష్టత సంభవించవచ్చు.
సైలెంట్ కిల్లర్.. మధుమేహాన్ని సాధారణంగా నిపుణులు ఇలానే పిలుస్తారు. ఎందుకంటే అది లోలోపల శరీరంలోని వ్యవస్థలన్నింటిని చిన్నాభిన్నం చేసేస్తుంది. దీనితో పాటు కొలెస్ట్రాల్ స్థాయి, రక్తపోటు వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి, తద్వారా దృష్టి లోపం, గుండె జబ్బులు , మూత్రపిండ వ్యాధి వంటి ప్రధాన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఒక వేళ వీటిని అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, వైద్యుల సిఫారసు మేరకు మందులు వాడుతూ ఉండాలి. ఈ నేపథ్యంలో మధుమేహ రోగు సాధారణంగా చేసే తప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేత్ర ఆరోగ్యానికి తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
కళ్లపై తీవ్ర ప్రభావం..
మధుమేహం కళ్ళపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని ఫలితంగా అంధత్వం సంభవించవచ్చు. శరీరంలో అధికంగా షుగర్ ఉంటే మెదడుకు సంకేతాలను చేరవేసే కంటిలోని అత్యంత సున్నితమైన కణజాలాలు దెబ్బతింటాయి.
ఈ పనులు చేయాలి..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, అది రెటీనాకు హాని చేస్తుంది. దీని వలన తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దృష్టి అస్పష్టత సంభవించవచ్చు. మధుమేహం ఉన్నవారిలో డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా, కంటిశుక్లం మూడు విభిన్న కంటి పరిస్థితులు సాధారణంగా కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా శాశ్వత అంధత్వాన్ని నివారించవచ్చు.
ధూమపానం మానేయండి
ధూమపానం వల్ల శారీరక వ్యవస్థలు దెబ్బతింటాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులపై దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ధూమపానం శరీరంలోని సిరలు, ధమనులు, కేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న మధుమేహ ద్వారా కలుగుతున్న నష్టాన్ని తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో మధుమేహ రోగులు ధూమపానాన్ని వదలిపెట్టాలి.
శారీరక వ్యయామం అవసరం..
వ్యాయామం అన్ని భౌతిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రోజూ ఉదయం వాకింగ్, జాగింగ్ చేయడం ఉత్తమం. ఆహారం తీసుకున్న తర్వాత కూడా అటుఇటు తిరుగుతుండాలి. రోజూ వారి చేసే వ్యాయామాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఫలితంగా కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం..
ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యవంతమైన కళ్లకు ఉపకరిస్తుంది. డయాబెటిక్ తో బాధపడుతున్నవారు తమ కళ్ళను రక్షించుకోడానికి మంచి పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు A, C, E, బీటా-కెరోటిన్, లుటిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, జియాక్సంతిన్ వంటివి తీసుకోవాలి. ఆకు కూరలు, సాల్మన్, ట్యూనా లేదా మాకేరెల్ వంటి కొవ్వు చేపలు, వాల్‌నట్స్, బాదం వంటి గింజలు, బీన్స్, కాయధాన్యాలు, పుట్టగొడుగులు అధికంగా తీసుకుంటే మంచిది.
క్రమం తప్పకుండా పరీక్షలు..
బ్లడ్ షుగర్‌ని నియంత్రించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు మీ కంటి చూపు ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. దీనిని నిర్ధారించుకోడానికి సంవత్సరానికి ఒకసారి మీ నేత్ర వైద్యుడి నుంచి పూర్తి కంటి పరీక్ష చేయించుకోండి. కంటిశుక్లం, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి వాటి కోసం స్క్రీనింగ్ చేయించండి. దీని వల్ల ఏమైనా సమస్యలున్నా త్వరితగతిన, ప్రారంభ దశలోనే వైద్యుడు వాటిని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..